ETV Bharat / state

పంటను అమ్ముకునేందుకు టమాట, ఉల్లి రైతుల కష్టాలు

author img

By

Published : Nov 15, 2022, 9:43 PM IST

Updated : Nov 16, 2022, 6:37 AM IST

No price to Tomatos:కిలో టమాటా రూపాయే.. కొన్ని చోట్ల రైతులు విక్రయిస్తోంది కేవలం 20 పైసలకే. అటు ఉల్లి రైతులదీ ఇదే పరిస్థితి. కనీస ధర దక్కక పంటను పండించిన రైతులు.. తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. టమాటా, ఉల్లి రైతుల పరిస్థితే కాదు.. సజ్జ, వేరుశనగ పండించిన అన్నదాతలకూ ఆవేదన మిగులుతోంది. ఇంత జరుగుతున్నా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లైనా లేదు.

tomoto price down
tomoto price down

No price to Tomatos: 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని గతంలో సీఎం జగన్ గొప్పలు చెప్పారు. ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఎంతనే పోస్టర్‌ ఆర్‌బీకేల్లో ఉంటుందని కూడా అన్నారు. దానికన్నా ధర తగ్గితే వ్యవసాయ సహాయకులు మార్కెటింగ్‌ శాఖకు, ఆ జిల్లాలోని సంయుక్త కలెక్టర్‌కు సీఎం యాప్‌ ద్వారా నివేదిస్తారని ఆ వెంటనే ప్రభుత్వం కొంటుందని సీఎం.. అనేక సార్లు సమీక్ష సమావేశాల్లో చెప్పారు. కానీ వాస్తవంగా ఇది అమలు అవుతోందా అంటే.. అంతా తూచ్‌ అనాల్సిందే. కావాలంటే ఈ దృశ్యాలు చూడండి.. కర్నూలు జిల్లా పత్తికొండలో రైతులు టమాటాలను రోడ్డుపైన పారబోస్తున్నారు. గిట్టుబాటు ధర అటుంచితిదే.. కనీసం నామమాత్రమైన ధర కూడా లభించకపోవడమే దీనికి కారణం.

టమాటా, ఉల్లిపాయల ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీలు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ.... 2017 డిసెంబరులో కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో జగన్‌ భరోసా ఇచ్చారు. కానీ రైతులు మాత్రం పంటను రోడ్డున పారబోస్తున్నారు. ఇదీ వాస్తవ పరిస్థితి. ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయిద్దామని మార్కెట్‌కు వస్తే కనీసం ఇంటి నుంచి పంటను తీసుకొచ్చిన కూలి సైతం రావట్లేదని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఉల్లి రైతుల పరిస్థితీ ఇలానే ఉంది. పండించిన పంటను అమ్ముకుందామంటే సరైన ధర లేదు.... పోనీ అలా వదిలేద్దామంటే అప్పుల పరిస్థితేంటి అని ఆలోచిస్తూ తీవ్రంగా మధనపడుతున్నారు రైతులు.

కిలో టమాటాకు రైతుకు దక్కేది రూపాయే. అదే విజయవాడ రైతుబజార్‌లో కిలో 19 రూపాయలు ఉంది. కర్నూలులో కిలో ఉల్లి 6నుంచి 8 రూపాయలు ఉంటే విజయవాడలో 25రూపాయలకు విక్రయిస్తున్నారు. ఆదుకునే గిట్టుబాటు ధర, ధరల స్థిరీకరణ నిధి ఏమయ్యాయో తెలియడం లేదు. ఎక్కువ మంది రైతులు తక్కువ ధరకే పంట అమ్ముకునేదాకా ప్రభుత్వం నిద్ర నటిస్తోంది. ఆ తర్వాత కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అనుమతిస్తోంది.

టమాటా తదితర పంట ఉత్పత్తుల ఆధారిత గుజ్జు పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. రాయలసీమలో నెల కింద వేరుసెనగ చేతికొచ్చినా కొనుగోలు ప్రారంభించలేదు. దీంతో అధికశాతం రైతులు మద్దతు ధర కంటే తక్కువకే క్వింటా 5,200 నుంచి 5,400 మధ్య అమ్ముకున్నారు. అయినా సేకరణ ప్రారంభించలేదు. నాలుగైదు రోజులనుంచి క్వింటా 6,400 రూపాయల వరకు లభిస్తోంది. ముందే అమ్ముకున్న రైతులు క్వింటాకు వేయిపైనే నష్టపోయారు. సజ్జ మద్దతు ధర క్వింటా 2,350 ఉంటే.. ప్రస్తుతం మార్కెట్‌ ధర 2వేలే దక్కుతోంది. నిమ్మ రైతులకూ నష్టాలే మిగులుతున్నాయి.

ఫలానా పంట ఉత్పత్తి ధర తగ్గిందని తెలిశాక ఆలస్యంగా మార్కెటింగ్‌, మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపిస్తున్నారు. కొనుగోలుకు అనుమతి రావడానికి 15 రోజులనుంచి 2,3 నెలల సమయం పడుతోంది. అప్పటివరకు రైతులు నష్టపోతున్నా పట్టించుకునేవారు లేరు. 2019నుంచి 2022సెప్టెంబరు వరకు 6,903 కోట్ల రూపాయల విలువైన 20 లక్షల టన్నుల పంటలను కొన్నామని ప్రభుత్వం చెబుతున్నా నష్టపోతున్న రైతులకు భరోసా లేదు. బకాయిలను చెల్లించకపోవడంతో మార్క్‌ఫెడ్‌ కూడా కొనుగోలులో ఆచితూచి వ్యవహరిస్తోంది..

ఇవీ చదవండి:

Last Updated : Nov 16, 2022, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.