ETV Bharat / state

స్టేట్ క్యాన్సర్ ఇన్​స్టిట్యూట్​ నిర్మాణానికి సుస్తి.. అవస్థల్లో క్యాన్సర్ రోగులు

author img

By

Published : Mar 19, 2023, 7:18 PM IST

State Cancer Institute: కర్నూలులో తలపెట్టిన స్టేట్ క్యాన్సర్ ఇన్​స్టిట్యూట్​ పనులకు జబ్బు చేసింది. నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సంస్థ నిర్మాణం ఇప్పటికి పూర్తి కాలేదు. ఇసుక దగ్గర్నుంచి బిల్లుల చెల్లింపు వరకు.. అన్ని సమస్యలు చుట్టుముట్టడంతో.. ఈ ఇన్​స్టిట్యూట్ ఎప్పటికి ప్రారంభానికి నోచుకోనుందోనని.. జిల్లా వాసులు ఎదురు చూస్తున్నారు.స్టేట్ క్యాన్సర్ ఇన్​స్టిట్యూట్ నిర్మాణ స్థితిగతులపై ఈటీవీ భారత్ కథనం..

State Cancer Institute
స్టేట్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్

State Cancer Institute: క్యాన్సర్ రోగులకు వరప్రదాయినిగా భావించిన... స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం పనులు నత్తను తలపిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లైనా, ఈ ఆసుపత్రి పనులు పూర్తి చేయలేక ఆపసోపాలు పడుతోంది. ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేని దయనీయ స్థితిలో ప్రస్తుత పరిస్థితి నెలకొంది.స్టేట్ క్యాన్సర్ ఇన్​స్టిట్యూట్​ పనులపై ఈటీవీ భారత్ పరిశీలనాత్మక కథనం.

రాయలసీమ ప్రాంతంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు క్యాన్సర్ లాంటి భయంకర జబ్బులు వస్తే.. వైద్యం చేయించుకోలేని పరిస్థితులో మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం అధికారంలో ఉండగా స్టేట్ క్యాన్సర్ ఇన్​స్టిట్యూట్​ ను కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని కోసం కర్నూలు మెడికల్ కళాశాల ఆవరణలో 9.5 ఎకరాల విస్తీర్ణంలో 120 కోట్ల వ్యయంతో 200 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2019 జనవరి 8వ తేదీన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 13 నెలల్లో పూర్తి కావాలని ఆదేశించారు.

మొదటిదశలో కేంద్ర ప్రభుత్వం 54 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 36 కోట్లు కేటాయించడంతో పనులు ప్రారంభించారు. 2020 నాటికి ఆసుపత్రిని పూర్తి చేయాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆసుపత్రి పనులు పూర్తిగా మందగించాయి. మొదట్లో ఇసుక అందుబాటులో లేకపోవటం, ఆ తర్వాత నిధులు కేటాయించకపోవడంతో పనులు నత్త నడకన సాగాయి. ప్రస్తుతం 3 కోట్ల పనులకు సంబంధించి బిల్లులు రాకపోవటంతో, గుత్తేదారు పనులు మరింత ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు 84 కోట్ల రూపాయల పరికరాలు తీసుకురావాల్సి ఉంది. అవి కూడా అమెరికా నుంచి రావాల్సి ఉండటంతో ఆలస్యమవుతోందని అధికారిక వర్గాలు తెలిపాయి.

ఏటా కర్నూలు నగరంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో 10 వేల మందికి పైగా క్యాన్సర్ రోగులు చికిత్స చేయించుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వీరి కోసం ఆరోగ్య శ్రీ ద్వారా గత రెండేళ్లలో 40 కోట్లకుపైగా ఖర్చు చేశారు. క్యాన్సర్ ఆసుపత్రి పూర్తి అయ్యి ఉంటే... ఈ డబ్బులు తిరిగి ప్రభుత్వానికి వచ్చేవి. మరింత మంది క్యాన్సర్ రోగులకు మేలు జరిగేది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పనులు మందగించాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. స్టేట్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ ను పూర్తి చేసి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

'కర్నూలు నగరంలోని 120 పడకల క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణంపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించే నిధులు విడుదల చేసినా.. కింది స్థాయిలో నాయకులు కాంట్రాక్టర్​కు డబ్బులు చెల్లించే విషయంలో ఇబ్బందులు పెడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే పాలకులకు ఈ ఆసుపత్రిపై ఎలాంటి ప్రేమ ఉందో అర్థం అవుతుంది. గతంలో కన్నా ఈ మధ్య కాలంలో క్యాన్సర్ వ్యాధి వ్యాప్తి ఎక్కువైంది. అందుకు తగ్గట్టుగా ఆసుపత్రి సేవలు అందుబాటులోకి రావడం లేదు. ఈ ఆసుపత్రి 2020కే పూర్తి కావల్సి ఉన్నా ఇప్పటికీ పనులు నత్త నడకన కొనసాగుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రారంభించిన పనులు ఇప్పటివరకు పూర్తి కాలేదు. ఆసుపత్రి పనులు త్వరగా పూర్తి చేయాలి. ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి '- కర్నూలు నగర వాసులు

కర్నూలు జిల్లాలోని స్టేట్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.