ETV Bharat / state

గౌరవమర్యాదలను మరచిన అధికార పార్టీ.. స్వాతంత్య్ర సమరయోధుడ్ని సైతం

author img

By

Published : Feb 5, 2023, 2:10 PM IST

Bhogaraju Pattabhi Sitaramaiah : మచిలీపట్నం కేంద్రంగా 1923లో ఆంధ్రాబ్యాంకును స్థాపించిన, అంతకుముందు ఆంధ్రా జాతీయ కళాశాలను నెలకొల్పడంలో కీలకపాత్ర నిర్వహించిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్యను తలుచుకుంటే ఆంధ్రులెవరికైనా గౌరవంతో ఒళ్లు పులకరిస్తుంది. కానీ వైసీపీ నాయకులకు మాత్రం ఇదేది పట్టనట్టుగా ఉంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Bhogaraju Pattabhi Sitaramaiah
భోగరాజు పట్టాభి సీతారామయ్య

Bhogaraju Pattabhi Sitaramaiah : రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్ని.. పార్టీ కార్యాలయాలకు తీసుకుంటున్న వైసీపీ నాయకులు.. మచిలీపట్నం నడిబొడ్డున సుమారు 60-65 కోట్ల రూపాయల విలువచేసే రెండెకరాల స్థలాల్ని లీజు పేరుతో హస్తగతం చేసుకున్నారు. ఆగమేఘాల మీద నగరపాలక సంస్థలో తీర్మానం చేయించి, శనివారం భూమిపూజ కూడా చేసేశారు. అంతేకాకుండా అక్కడ పట్టాభి జ్ఞాపకార్థం నిర్మించాలనుకుంటున్న.. ఆడిటోరియానికి స్థలం కేటాయింపుపై కార్పొరేషన్‌లో తీర్మానం చేయకుండా అడ్డుకుంటున్నారు. రాష్ట్రప్రభుత్వం, ముఖ్యమంత్రి చొరవ తీసుకుని స్థలం కేటాయించినా.. కార్పొరేషన్‌లో తీర్మానం చేయకుండా అడ్డుపడుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం సముపార్జించిన, తెలుగుజాతి కీర్తిపతాకాన్ని వినువీధుల్లో ఎగరవేసిన మహానుభావులంటే వైసీపీ నాయకులకు ఎంత మాత్రం గౌరవం లేదనడానికి ఇదే నిదర్శనం. వైసీపీ కార్యాలయానికి స్థలం కేటాయించేలా చేయడంలోనూ, పట్టాభి జ్ఞాపకార్థం తలపెట్టిన ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడంలోనూ స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సహకారించాల్సింది పోయి అడ్డుపడుతున్నారు : ఆంధ్రాబ్యాంకును కేంద్రప్రభుత్వం మూడేళ్ల క్రితం యూనియన్‌ బ్యాంకులో విలీనం చేయడంతో.. ప్రతి ఆంధ్రుడి గుండె తల్లడిల్లింది. ఆంధ్రుల అస్తిత్వాన్ని చెరిపేస్తారా అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అప్పుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరు చిరస్థాయిగా నిలిచేలా ఆయన జ్ఞాపకార్థం మచిలీపట్నంలో రూ.40 కోట్లతో ఆడిటోరియం నిర్మించేందుకు, బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాన్ని అక్కడే ఏర్పాటుచేసేందుకు యూనియన్‌ బ్యాంకు ముందుకొచ్చింది. తమకు రెండు ఎకరాలు కేటాయించాలని జిల్లా కలెక్టరును బ్యాంక్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ కోరారు. స్థానిక వైసీపీ ఎంపీ బాలశౌరి చొరవ తీసుకుని.. భోగరాజు జ్ఞాపకార్థం ఆడిటోరియంతో పాటు, లైబ్రరీ, మ్యూజియం, కన్వెన్షన్‌హాలు నిర్మాణానికి ఐదు ఎకరాలు కేటాయించాలని ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు. దానిపై జిల్లా కలెక్టర్‌ సీసీఎల్‌ఏకు ఒక ప్రతిపాదన పంపారు.

నగరం నడిబొడ్డున ఈడేపల్లిలో 5.45 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని, దానిలో 3.45 ఎకరాల్ని కేటాయించవచ్చని సిఫారసు చేయగా.. చివరకు రెండు ఎకరాలే కేటాయిస్తూ 2022 ఏప్రిల్‌ 25న సీసీఎల్‌ఏ ఉత్తర్వులిచ్చారు. అదే నెలలో ఆ భూమిని యూనియన్‌ బ్యాంక్‌ సీజీఎంకి అప్పగిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులిచ్చారు. దానిపై మచిలీపట్నం నగరపాలక సంస్థ పాలకమండలి సమావేశంలో తీర్మానం చేయాల్సి ఉంది. ఎజెండాలో ఆ అంశాన్ని చేర్చకుండా స్థానిక ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడి గౌరవార్థం, ప్రజలందరికీ ఉపయోగపడేలా ఆయన జ్ఞాపకచిహ్నాన్ని నిర్మించేందుకు, రూ.40కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వరంగ బ్యాంకు ముందుకొస్తే స్వాగతించి, సహకరించాల్సిందిపోయి అలా అడ్డుపడటాన్ని ఏమనుకోవాలి? విచక్షణ ఉన్నవారెవరైనా చేసే పనేనా అది? కార్పొరేషన్‌లో ఎందుకు తీర్మానం చేయడం లేదని ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో కార్పొరేషన్‌ కమిషనర్‌ చంద్రయ్యను కొందరు నిలదీశారు. ఆ తర్వాత ఆయన 15 రోజులు సెలవుపెట్టి వెళ్లిపోయారు.

విలువైన భూమికి నామమాత్రపు లీజేంటని విమర్శ : ఈడేపల్లిలో రెండెకరాల స్థలాన్ని పట్టాభి స్మారక భవనానికి ఇస్తున్నారని తెలియగానే, స్థానిక వైసీపీ నేతల కన్ను దానిపై పడింది. అదే సర్వేనంబరులో రెండెకరాలు పార్టీ కార్యాలయానికి కేటాయిస్తూ ఆగమేఘాల మీద నగరపాలక సంస్థ పాలకమండలితో తీర్మానం చేయించారు. దానిలో భవన నిర్మాణ కాంట్రాక్టరుతో శనివారం భూమిపూజ చేయించేశారు. జిల్లా మంత్రి, అధికారపార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ సహా ఎవరికీ సమాచారం లేకుండానే ఆ కార్యక్రమం నిర్వహించడం విశేషం. వైసీపీ నాయకులు హాజరైతే వివాదాస్పదం అవుతుందన్న ఉద్దేశంతోనే వారెవరూ వెళ్లలేదని సమాచారం. ఆ స్థలం నగరం నడిబొడ్డున ఉంది. దానికి పక్కనే రైతుబజారు, ఎమ్మార్వో కార్యాలయం, కొన్ని మీటర్ల దూరంలోనే జిల్లా కోర్టు, ఆ స్థలానికి ఎదురుగా జిల్లా జడ్జి నివాస భవనం ఉన్నాయి. ఇప్పుడక్కడ చదరపు గజం విలువ రూ.70వేల వరకు ఉంటుందని అంచనా. అంటే ఎకరం రూ.33 కోట్ల పైమాటే. అంత విలువైన స్థలాన్ని, అంత కీలకమైన ప్రాంతంలో పార్టీ కార్యాలయానికి నామమాత్రపు లీజుకు ఇవ్వడమేంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వైసీపీ కార్యాలయానికి భూమి పూజ
వైసీపీ కార్యాలయానికి భూమి పూజ

లీజు వివరాలు బయటకు రాకుండా : పార్టీ కార్యాలయం అంటే నాయకులు, కార్యకర్తలు, సభలు, సమావేశాలతో నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఉన్నచోట, నిత్యం వేలమంది జనం సంచరించే ప్రాంతంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరమేంటి? జిల్లాల విభజన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి జిల్లా కేంద్రాల్లో తగినంత స్థలాలు లేవు. అలాంటప్పుడు నగరం నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వస్థలాన్ని ప్రభుత్వ, ప్రజా అవసరాలకు అట్టిపెట్టకుండా ఒక రాజకీయ పార్టీ కార్యాలయానికి ఎలా ఇచ్చేస్తారు? పైగా ఆ స్థలాన్ని వైసీపీ కార్యాలయానికి ఎన్నేళ్లకు, ఏ ప్రాతిపదికన లీజుకిచ్చారన్న వివరాలేవీ బయటకు రాకుండా గోప్యత పాటిస్తున్నారు. మిగతాచోట్ల మాదిరిగానే ఎకరానికి సంవత్సరానికి రూ.వెయ్యి చొప్పున, 99 ఏళ్లకు లీజుకిచ్చి ఉంటారని భావిస్తున్నారు. అసలు పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయిస్తూ సీసీఎల్‌ఏ ఉత్తర్వులు ఇచ్చారా.. లేదా అన్న విషయంలోనూ స్పష్టత లేదు.

భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారకంగా ఆడిటోరియానికి కేటాయించిన స్థలం
భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారకంగా ఆడిటోరియానికి కేటాయించిన స్థలం

తీవ్ర ఆందోళనలో అభిమాన సంఘం : భోగరాజు పట్టాభి సీతారామయ్య జ్ఞాపకార్థం ఆడిటోరియం నిర్మించేందుకు తొమ్మిది నెలల క్రితమే స్థలం కేటాయించినా.. ఎలాంటి కదలికా లేకపోవడంపై ఆయన అభిమాన సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సంఘం ప్రతినిధులు, హిందూ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్‌ ఏఆర్‌కే మూర్తి, వేమూరి రాధాకృష్ణారావు తదితరులు స్పందనలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ‘భోగరాజు పట్టాభి సీతారామయ్య జ్ఞాపకార్థం తలపెట్టిన ఆడిటోరియం నిర్మాణం మొదలవకుండా అడ్డుకోవడం చాలా తప్పు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని అడ్డంకులు తొలగేలా చూడాలి. ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా చూడాలి’ అని అభిమాన సంఘం ప్రతినిధి పి.వి.ఫణికుమార్‌ పేర్కొన్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.