ETV Bharat / state

రాజకీయ విభేదాలతో ఆగిన జగనన్న ఇళ్ల స్థలాల పంపీణీ - నిరుపయోగంగా 100 ఎకరాల ప్రభుత్వ స్థలం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2023, 2:57 PM IST

Updated : Dec 2, 2023, 2:32 PM IST

YSRCP Government Not Distributing Jagananna Housing Lands: ఆ ప్రాంతంలో 100 ఎకరాల స్థలాన్ని జగనన్న ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం కేటాయించింది. ఇకనైనా సొంతింటి కల నెరవేరుతుందని ఆ నిరుపేదలు సంబరపడ్డారు. కానీ ఆశలన్నీ ఆవిరయ్యాయి. అదిగో పట్టాలు.. ఇదిగో ఇళ్లు అంటూ హడావుడి చేస్తున్నారే తప్ప లబ్ధిదారులకు అందించడం లేదు. దీంతో స్థలం మొత్తం నిరుపయోగంగా మారి పిచ్చిమొక్కలతో చిన్న అడవిని తలపిస్తోంది. పాలకులు, అధికారుల అలసత్వంతో ఇళ్లు అందని ద్రాక్షగానే మారాయి.

YSRCP_Government_Not_Distributing_Jagananna_Housing_Lands
YSRCP_Government_Not_Distributing_Jagananna_Housing_Lands

YSRCP Government Not Distributing Jagananna Housing Lands : టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుతో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రస్తుత వైఎస్సార్సీపీ పాలనలో ఒక్కరంటే ఒక్కరికీ ఇంటి స్థలం దక్కని ప్రాంతంగా కూడా మిగిలి పోయింది. భూమి అందుబాటులో ఉండి, అర్హుల జాబితా సిద్ధం చేసి రెండేళ్లు దాటినా, లబ్దిదారులకు పట్టాలు మంజూరు చేయడం లేదు. ప్రతి తెల్లరేషన్ కార్డు దారుడికి స్థలం ఇవ్వాలని ప్రజాప్రతినిధులు.. అర్హులకు మాత్రమే ఇవ్వాలని అధికారులు భీష్మించడంతో ప్రతిష్టంభన నెలకొంది.

100 Acres of unused Government Land in Krishna District : 2016 సంవత్సరం పారిశ్రామికవాడ ఏర్పాటు సమయంలో భూ సేకరణ సమయంలోనే మల్లవల్లిలో 100 ఎకరాల భూమిని సామాజిక అవసరాల నిమిత్తం అప్పటి టీడీపీ ప్రభుత్వం కేటాయించింది. వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీకి వీలుగా 2020లో ఇందులోనే 40 ఎకరాల్లో లేఔట్​కు రూపకల్పన చేసింది. మల్లవల్లి గ్రామంలో ఉన్న లబ్దిదారులతో పాటు, మండలంలో భూ సేకరణ ఇబ్బందిగా మారిందనే కారణంతో కాకులపాడు, దంటగుంట్ల, ఆర్ఎ పేట, కొయ్యూరు, మడిచర్ల, బిళ్లనపల్లి, పెరికీడు తదితర గ్రామాలకు చెందిన అర్హులకు ఇక్కడే స్థలాలు ఇవ్వాలని తొలుత అధికారులు కార్యాచరణ చేపట్టారు. కానీ ఆ తర్వాత మల్లవల్లి లబ్దిదారులకు మాత్రమేనని ప్రకటించారు. కానీ నేటి వరకు లేఔట్​ను సిద్ధం చేయలేదు.

జగనన్న కాలనీల పేరిట మోసం - వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెపుతామన్న లబ్ధిదారులు

Mallavaram People Waiting For Jagananna Housing Lands : జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీలో భాగంగా అన్ని గ్రామాల్లో ఎంపిక చేసినట్లుగానే మల్లవల్లిలోనూ లబ్దిదారుల జాబితా రూపొందించారు. 570 మందిని అర్హులుగా గుర్తించి పట్టాలు సిద్ధం చేశారు. 2020 డిసెంబరు 29న పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టగా.. రాజకీయ విభేదాలు, తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ స్థలం ఇవ్వాలనే డిమాండ్​తో కార్యక్రమం వాయిదా పడింది. అప్పట్నుంచి ఈ ప్రక్రియ ప్రతిపాదనలు, నివేదికలకు మాత్రమే పరిమితమైంది. ఇళ్ల స్థలాలు వస్తాయన్న ఆశతో ఎదురు చూస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. అద్దె ఇళ్లలో ఉండలేక నరకం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉన్నతాధికారులు తర్జనభర్జన : ఓ పక్క రాష్ట్రంలో అందరూ పక్కా ఇళ్లు నిర్మించుకుంటుంటే తాము మాత్రం స్థలం వస్తుందో, లేదోనని పడిగాపులు పడుతున్నామని అంటున్నారు. ఏపీఐఐసీ భూ సేకరణకు అప్పట్లోనే 1,228 మందికి పరిహారం రాగా, మరో 400 మందికి పెండింగ్ లో ఉండిపోయింది. తెల్లకార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం రేషన్ కార్డుల సంఖ్య 1954కు చేరింది. దీనిపై ఉన్నతాధికారులు తర్జనభర్జనలు పడుతూ కాలయాపన చేస్తున్నారు.

ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగని జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలు - నరకయాతన అనుభవిస్తున్న లబ్ధిదారులు

ప్రభుత్వ భూముల్లో అక్రమార్కులు : అర్హులైనా ఇంటి స్థలం, పక్కా ఇల్లు దక్కకపోవడంతో మల్లవల్లిలో కొందరు ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొత్త మల్లవల్లిలో కొందరు జడ్పీ స్థలంలో లేఔట్ వేసేశారు. వచ్చే రెండు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్​కు అవకాశం ఉండటంతో.. ఎలాగైనా ఇంటి స్థలం ఏర్పర్చుకోవాలని పేదలు ఇలా ఆక్రమణలకు దిగుతున్నారు. పరిస్థితి మరింత జఠిలం కాకముందే ఉన్నతా ధికారులు స్పందించి స్థలాలు పంపిణీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇళ్ల స్థలాలు కేటాయించాలని వేడుకోలు : తాము సామాన్య, మధ్యతరగతి ప్రజలమని పెరిగిన ఖర్చులతో పాటు ఇంటి అద్దెలు చెల్లించాలంటే తలకు మించిన భారంగా మారిందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు కూడా అందరిలాగే ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతున్నారు.

Lack of Facilities in Jagananna Colonies: జగనన్న కాలనీలో కష్టాలెన్నో.. కనీస వసతులు లేకుండా దారుణమైన దుస్థితి..

రాజకీయ విభేదాలతో ఆగిన జగనన్న ఇళ్ల స్థలాల పంపీణీ - నిరుపయోగంగా 100 ఎకరాల ప్రభుత్వ స్థలం
Last Updated : Dec 2, 2023, 2:32 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.