ETV Bharat / state

Venkaiah Naidu: "ఛైర్మన్ అంటే...పిన్నమనేని కోటేశ్వరరావులా ఉండాలి"

author img

By

Published : Apr 18, 2022, 2:12 PM IST

Updated : Apr 19, 2022, 6:37 AM IST

రాజకీయాల్లో వారసత్వం కాదు... జవసత్వం కావాలని…. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఛైర్మన్ అంటే ఆయనే అనేలా పిన్నమనేని కోటేశ్వరరావు పని చేశారని చెప్పారు. పార్టీ మారకుండా, పార్టీలకు అతీతంగా పనిచేయాలని.. నేటి రాజకీయ నాయకులు నేర్చుకోవాలని సూచించారు. రాజకీయ నాయకులు మాట్లాడే భాష సమీక్షించుకోవాలని సూచించారు.

Vice President Venkaiah Naidu
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

రాజకీయ పక్షాలు బాధ్యతారాహిత్యంగా, ఆచరణసాధ్యం కాని హామీలు గుప్పిస్తుండటంపై దేశవ్యాప్తంగా అన్ని స్థాయిల్లో చర్చించాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించి చట్టసభలకు పంపిన ప్రజాప్రతినిధులు అక్కడ వాడుతున్న భాష, ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర ఆక్షేపణీయంగా ఉండడం బాధాకరమన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు అవసరమని హితవు పలికారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో జిల్లాపరిషత్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జడ్పీ మాజీ ఛైర్మన్‌ దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నమ్ముకున్న సిద్ధాంతాలు, పార్టీని విడవకుండా అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ఆదర్శవంతమైన రాజకీయాలకు ప్రతిరూపంగా నిలిచిన పిన్నమనేని విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. స్థానిక సంస్థలకు అధికారం ఇస్తే ఏం చేయవచ్చో చూపించిన కార్యదక్షుడు పిన్నమనేని అంటూ కొనియాడారు. రెండు దశాబ్దాలకు పైగా జడ్పీ ఛైర్మన్‌గా పనిచేసిన ఆయన ఛైర్మన్‌ అనే పదానికి ప్రత్యామ్నాయంగా నిలవడం సాధారణ విషయం కాదన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, పరిపాలన తీరుకు సంబంధించి ఆయన వ్యవహారశైలిని నేటి రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని ఉద్బోధించారు. పదవులు, హోదాలను బట్టి గుర్తింపు రాదని.. గుణాన్ని బట్టే ప్రజల మనస్సుల్లో స్థానం దక్కుతుందని అందుకు పిన్నమనేని లాంటి వారే ఉదాహరణ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆయనపై ఉన్న గౌరవమే తనను విగ్రహావిష్కరణకు వచ్చేలా చేసిందన్నారు. స్వాతంత్రోద్యమ కాలం నుంచి మచిలీపట్నానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రస్తుతం రాజకీయాలతో పాటు ఇతర వ్యవస్థల్లో వేళ్లూనుకుంటున్న కుల, మత, ప్రాంతీయ తత్వాలు దేశానికి చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. వారసత్వంతో కాకుండా జవసత్వంతో రాజకీయాల్లో రాణించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ నాయకులు రోజూ పడుకునే ముందు ఆ రోజు తాను చేసిన కార్యక్రమాలను సమీక్షించుకుని లోటుపాట్లు, తప్పొప్పులను సవరించుకునేలా ప్రయత్నించాలని సూచించారు. అప్పుడే మెరుగైన భవిష్యత్తు సాధ్యమవుతుందన్నారు. రాజకీయాలతో పాటు ఇతర అంశాల్లోనూ గుణం, సామర్థ్య యోగ్యత, నడతకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా వాటి స్థానంలో కులం, మతం, డబ్బు, నేర స్వభావాలకు పెద్దపీట వేయడం ఆక్షేపణీయమన్నారు. మహనీయుల విగ్రహాలు, చిత్రపటాల ఆవిష్కరణ వల్ల వారికేమీ ప్రయోజనం ఉండదని..వారి నిజాయతీ,నడవడిక, వంటి అంశాల స్ఫూర్తి భావితరాలకు కల్పించేందుకు అన్న విషయాన్ని గురించాలన్నారు. ప్రసార మాధ్యమాలు సైతం సత్యానికి దగ్గరగా, సంచలనాలకు దూరంగా ఉండాలని కోరారు.

విలువలకు ప్రతిరూపం పిన్నమనేని: పిన్నమనేని కోటేశ్వరరావు రాజకీయాలు, ప్రజాసేవలో విలువలకు నిలువెత్తు ప్రతిరూపమని వక్తలు కొనియాడారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక మాట్లాడుతూ జిల్లాలో కాకాని వెంకటరత్నం, చల్లపల్లి రాజా, ఎంఆర్‌ అప్పారావు వంటి నాయకులున్న కాలంలో 33 సంవత్సరాల వయసులో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా పిన్నమనేని ఎంపిక కావడం ఆయనలోని నాయకత్వ లక్షణాలకు నిదర్శనమన్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ ప్రసంగిస్తూ కేవలం జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఛైర్మన్‌ అనగానే పిన్నమనేనే గుర్తుకువస్తారన్నారు. మచిలీపట్నం శాసనసభ్యుడు పేర్ని వెంకట్రామయ్య మాట్లాడుతూ తనకు రాజకీయగురువైన పిన్నమనేని విగ్రహావిష్కరణ చేసి ఆయన గౌరవాన్ని పెంపొందింపజేసిన ఉప రాష్ట్రపతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 1959లో మండవల్లి సమితి కో-ఆప్షన్‌ సభ్యునిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 1964 నుంచి 1976 వరకూ, 1981 నుంచి 1983 వరకూ ఛైర్మన్‌గా పనిచేశారని, మూడోసారి 1987లో ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్టీఆర్‌ గాలిలోనూ గెలుపొంది 1992 వరకూ ఛైర్మన్‌గా వ్యవహరించారన్నారు.

గ్రామీణాభివృద్ధి, ఆర్థికాభివృద్ధికి కృషి: కేంద్ర విజిలెన్స్‌ మాజీ కమిషనర్‌ కె.వి.చౌదరి మాట్లాడుతూ పిన్నమనేని ప్రాథమిక విద్య, సమగ్ర గ్రామీణాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారన్నారు. చేపల చెరువుల సాగును ప్రోత్సహించడం ద్వారా జిల్లాలో ఆక్వా అభివృద్ధికి బీజం వేశారనీ.. ఆయన ప్రేరణతో నేడు జిల్లా ఆక్వా కల్చర్‌లో దేశంలోనే ప్రముఖ స్థానంలో నిలిచిందనీ కొనియాడారు. దళితులకు పక్కా ఇళ్ల అవసరాన్ని గుర్తించి 1967లోనే అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి చేతుల మీదగా రుద్రపాక సమీపంలోని గాజులపాడులో పక్కా ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ప్రారంభించిన దార్శనికుడంటూ ప్రశంసించారు. ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, విజయవాడ ఎంపీ కేశినేని నాని, నగర మేయర్‌ వెంకటేశ్వరమ్మ, మండలి బుద్ధప్రసాద్‌, వసంత నాగేశ్వరరావు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పిన్నమనేని కుటుంబసభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.


ఇదీ చదవండి: Governor: "అది గొప్ప పథకం... పేదోడి మెరుగైన వైద్యానికి భరోసా..!"

Last Updated : Apr 19, 2022, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.