ETV Bharat / state

Private degree colleges: 'విశ్వవిద్యాలయాల పరిధిలోనే డిగ్రీ కళాశాలల ఫీజులు నిర్ణయించాలి'

author img

By

Published : May 2, 2023, 5:55 PM IST

Private degree colleges : విశ్వవిద్యాలయాల పరిధిలోనే డిగ్రీ కోర్సుల ఫీజులు నిర్ణయించాలని ఏపీ ప్రైవేటు డిగ్రీ కళాశాలల మేనేజ్​మెంట్​ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు తాడేపల్లిలోని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కార్యాలయం వద్ద నిరసన తెలపగా.. ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు అడ్డుకోవడంతో పరస్పరం వాగ్వాదం చోటు చేసుకుంది. సమస్యలు విన్నవించేందుకు ఐదుగురు సభ్యులను మాత్రమే పోలీసులు లోపలికి అనుమతించగా చైర్మన్​తో చర్చించారు.

Etv Bharat
Etv Bharat

Private degree colleges : తాడేపల్లిలోని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఫీజుల విషయంలో సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 10 విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల యాజమాన్యాలు కమిషన్ కార్యాలయానికి చేరుకున్నాయి. విశ్వవిద్యాలయాల పరిధిలోనే డిగ్రీ కళాశాలల ఫీజులు నిర్ణయించాలని ఏపీ ప్రైవేటు డిగ్రీ కళాశాలల మేనేజ్​మెంట్​ అసోసియేషన్ నిరసన తెలిపింది. ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ నుంచి ఫీజు విధానం తొలగించాలని డిమాండ్ చేశారు.

కమిషన్ కార్యాలయం వద్ద కళాశాల యాజమాన్యాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరస్పరం వాగ్వాదం చోటు చేసుకుంది. సమస్యలు విన్నవించేందుకు ఐదుగురు సభ్యులను మాత్రమే పోలీసులు లోపలికి అనుమతించారు. గతంలోనే మా సమస్యలపై విన్నవించామని ఏపీ ప్రైవేటు డిగ్రీ కళాశాలల మేనేజ్​మెంట్​ అసోసియేషన్ అధ్యక్షుడు కనుమర్ల గుండారెడ్డి తెలిపారు. తాము చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఫీజు రెగ్యులేటరీ కమిషన్ వచ్చాక వారి ఇష్టం వచ్చిన విధంగా నిర్ణయాలు చేస్తున్నారు... అసలు ప్రైవేటు డిగ్రీ కళాశాలలపై నిర్ణయం చేసే అధికారం వారికి లేదని ఏపీ ప్రైవేటు డిగ్రీ కళాశాలల మేనేజ్​మెంట్​ అసోసియేషన్ కార్యదర్శి జె.రమణాజీ స్పష్టం చేశారు. యూనివర్శిటీలే మా ఫీజులు నిర్ణయం చేయాలని కోరుతున్నామన్నారు. ఏ,బీ,సీ కేటగిరీ తొలగించి రూ.20-30వేలు ఫీజుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. వీటిపై సానుకూలంగా స్పందన రాకుంటే భవిష్యత్తు కార్యాచరణ పై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

ప్రైవేటు డిగ్రీ కళాశాలల అసోసియేషన్ తరఫున చైర్మన్ జస్టిస్ వెంకటరమణను కలిశాం. మాకున్న ప్రధాన డిమాండ్స్ గురించి చర్చించారు. గతంలో ఫీజు నిర్ణయించడంలో తేడాలున్నాయని చెప్పడంతో.. ఇకపై అలా జరగకుండా కచ్చితంగా న్యాయం చేస్తామని చైర్మన్ చెప్పారు. అలాగే ఫీజు నిర్ణయం విషయంలో ఫామ్ 16 పెట్టాం. దానిని అందరూ అప్లోడ్ చేయాలని చెప్పారు. మా డిమాండ్స్ పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తాం. - కనుమర్ల గుండారెడ్డి, ఏపీ ప్రైవేటు డిగ్రీ కళాశాలల మేనేజ్​మెంట్​ అసోసియేషన్ అధ్యక్షుడు

జాతీయ విద్యా విధానం ప్రకారం.. కరిక్యులమ్ దృష్టిలో పెట్టుకుని అనాలసిస్ రిపోర్టు చేయమని చెప్పాం. అన్ని కళాశాలల యాజమాన్యాలను పిలిపించి కోర్సుల ఆధారంగా ఫీజు నిర్ణయించాలని కోరడంతో సానుకూలంగా స్పందించారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆధారపడిన 20వేల కుటుంబాలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కోర్సుల వారీగా ఫీజులు ఇవ్వాలని కోరడంతో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. - జె.రమణాజీ, ఏపీ ప్రైవేటు డిగ్రీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ కార్యదర్శి

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.