ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా... కనువిందుగా కనుమ వేడుక

author img

By

Published : Jan 16, 2021, 6:31 AM IST

కనుమను ఘనంగా జరుపుకున్న ప్రజలు
కనుమను ఘనంగా జరుపుకున్న ప్రజలు

సంక్రాంతి సంబరాల్లో చివరి రోజైన కనుమను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. పశువులను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. వేర్వేరు సంప్రదాయాల్లో నిర్వహించిన పశువుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందమైన రంగవల్లులతో మహిళామణులు ఆకట్టుకున్నారు.

కనుమను ఘనంగా జరుపుకున్న ప్రజలు

కడప జిల్లా రాయచోటిలో కనుమను వైభవంగా చేసుకున్నారు. రైతులు పశువుల్ని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఊరి శివారు కాటమరాజు గుడి వద్ద ప్రసాదాలు వండి పూజలు చేశారు. ఆలయ సమీపంలో వేసిన చిట్లా కుప్పలకు శాస్త్రోక్తంగా నిప్పంటించారు. పశువుల్ని కుప్పల వద్దకు తీసుకొచ్చి పరుగలు పెట్టించారు. వాటికి అలంకరించిన డబ్బు నోట్లను తీసుకునేందుకు యువకులు పోటీపడ్డారు. చిట్లా కుప్పల్లో గుమ్మడికాయులు, కొబ్బరిచిప్పలు వేసి మహిళలు మొక్కులు తీర్చుకున్నారు. ఈ మొత్తం తంతును చూసేందుకు వచ్చినవారితో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. బద్వేలులో గొబ్బెమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. గొబ్బెమ్మను ఊరేగించి మహిళలు గొబ్బి పాటలు పాడారు.

కనుమ పండుగ సందర్భంగా నెల్లూరులో తెప్పోత్సవం కనువిందుగా సాగింది. భ్రమరాంభ సమేత మల్లేశ్వరస్వామి తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సకల దేవతలు కొలువుదీరే కనుమ పార్వేట ఉత్సవం ఈసారి కరోనా వల్ల భక్తులు లేక వెలవెలబోయింది.

కృష్ణా జిల్లా మైలవరంలో ఆర్యవైశ్య అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో 250 మంది మహిళలు పోటీపడ్డారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.

విశాఖ జిల్లా మాడుగులలో కనుమ సందర్భంగా... గొర్రెలు, మేకలకు వివాహం జరిపించారు. పూర్వీకుల నుంచి ఇది ఆనవాయితీగా వస్తోందని యాదవ కులస్తులు తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో బొడ్డెడ మురళికి చెందిన కుటుంబసభ్యులు... సుమారు 50 మంది ఒకచోట చేరి అరిటాకులో భోజనం చేశారు.

ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు..... ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో ఘనంగా సాగుతున్నాయి. శుక్రవారం సేద్యపు విభాగంలో జరిగిన పోటీల్లో 10 ఎడ్ల జతలు... హోరాహోరీగా తలపడ్డాయి. అన్నంబొట్లవారిపాలెం వచ్చిన అతిథులతో ప్రాంగణమంతా పండుగ శోభ సంతరించుకుంది. ఒంగోలు గద్దలగుంట సమీపంలో పార్వేట ఉత్సవాన్ని వైభవంగా జరిపారు. వివిధ రకాల వేషధారణల్లో దేవుళ్లను దర్శించుకునేందుకు ప్రజలు పోటెత్తారు. అద్దంకి మండలం సింగరకొండలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివార్ల తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది.

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం, పరచివరలో సంక్రాంతిని పురస్కరించుకొని బొండాడ కుటుంబసభ్యుల ఆత్మీయ కలయిక వేడుకగా సాగింది. దేశవిదేశాల్లో స్థిరపడిన బొండాడ కుటుంబీకులు పండుగకు స్వగ్రామం చేరి సందడిగా గడిపారు. వంటలు, ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. సామూహిక భోజనాలు చేశారు.

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులు.. పూర్వీకుల ఆచార వ్యవహారాలను స్ఫురణకు తెచ్చాయి.

ఇవీ చదవండి:

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గోపూజోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.