ETV Bharat / state

ఆగని వాన.. నిండా మునిగిన రైతన్న

author img

By

Published : Oct 14, 2020, 8:48 PM IST

ఎడతెరిపి లేని వర్షాలు కృష్ణా జిల్లాను ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల పంట నీటమునిగి రైతులు నష్టపోయారు.

roads-crops-damaged-with-heavy-rains-in-krishna-district
కృష్ణా జిల్లాను ముంచెత్తిన వాన

కృష్ణా జిల్లాలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో భారీవర్షాలతో... ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. జలాశయం నుంచి వరదనీరు దిగువకు విడుదల చేయటంతో.... విజయవాడ లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రాణిగారి తోట, కృష్ణలంక, రామలింగేశ్వర్ నగర్, రణవీర్ నగర్, బాలాజీనగర్‌ ప్రాంతాల్లో.... ఉద్ధృతంగా నీరు రావటంతో... ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఏళ్లుగా ఇదే సమస్య ఎదుర్కొంటున్నా... తమను ఆదుకునే నాథుడే కరవయ్యాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

కలెక్టర్ పరిశీలన...

ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాల వారి కోసం.... ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్‌ ఇంతియాజ్ పరిశీలించారు. బాధితుల కోసం సహాయ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

కృష్ణా జిల్లాను ముంచెత్తిన వాన

పొంగిన వాగులు...

విజయవాడలో కుండపోత వర్షానికి ఆంధ్రా లయోలా కళాశాల ప్రాంగణం జలమయమైంది. కృష్ణా జిల్లా బాపులపాడులోని అంగన్‌వాడీ కేంద్రంలోకి వరదనీరు చేరి సిబ్బంది ఇబ్బందిపడ్డారు. ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు వద్ద బుడమేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఏరుపై నిర్మించిన వంతెన ఇప్పటికే శిథిలావస్థకు చేరిందని... అధికారులు స్పందించకుంటే నష్టం తప్పదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. విస్సన్నపేట మండలం చండ్రుపట్ల వద్ద రేగతివాగు పోటెత్తటంతో... తిరువూరు- విస్సన్నపేట మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. చాట్రాయి మండలం సోమవారం గ్రామంలో కోళ్లఫాంలోకి వరదనీరు చేరి... 5వేల కోడిపిల్లలు మృత్యువాత పడ్డాయి.

వందల ఎకరాల్లో పంట మునక...

జిల్లాలో కురుస్తున్న వర్షాలు... రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. చందర్లపాడు మండలం చింతలపాడు, తోటరావులపాడులో 400 ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. జగ్గయ్యపేట పరిధిలో వేల ఎకరాలు ముంపులో ఉన్నాయి. పాతకంచలలో మున్నేరు నల్లవాగు పోటెత్తటంతో.... వేల ఎకరాల్లో వరి పంట వరదపాలైంది. కంచికచర్ల, నూజివీడు మండలాల్లో పత్తి, వరి, పసుపు, కంద, అరటి పంటలకు నష్టం వాటిల్లటంతో... రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. వర్షాల కారణంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని... వరద బాధితులు, రైతులు వేడుకుంటున్నారు.

ఇదీచదవండి.

విశాఖ జిల్లాలో భారీ వర్షాలు... నిండుకుండల్లా జలాశయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.