ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమదాలు.. ఐదుగురు మృతి

author img

By

Published : Feb 2, 2021, 2:29 PM IST

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రోడ్లు రక్తసిక్తమయ్యాయి. అనంతపురం జిల్లాలో ప్రమాదానికి ఇద్దరు మరణించగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. శుభకార్యానికి వెళ్లివస్తూ తూర్పుగోదావరిలో ఆటో కారు ఢీకొనటంతో మహిళ మృతిచెందింది. పాఠశాలకు వెళ్తున్న పదోతరగతి యువకుడు రోడ్డు దాటుతుండగా చనిపోయాడు.

road accidents in different places in state
వేర్వేరు జిల్లాల్లో రోడ్డు ప్రమదాలు.. ఐదుగురి మృతి

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి.

అనంతపురం జిల్లా మడకశిరలో....

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం బైరేపల్లి గ్రామ సమీపంలోని మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తిప్పేస్వామి అనే యువకుడు మరణించగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వీరిని 108 వాహనం ద్వారా మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

కనగానపల్లి మండలం బద్దలాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో.. వీఆర్వో మద్దిలేటి మృతి చెందాడు. ఆదివారం రాత్రి కనగానపల్లి నుంచి స్వగ్రామమైన బద్దలాపురం ద్విచక్ర వాహనంపై.. వెళ్తుండగా వాహనం అదుపుతప్పి వీఆర్ఓ మద్దిలేటి కిందపడ్డాడు. తలకు బలమైన గాయాలు తగలడంతో స్పృహ కోల్పోయాడు. స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు.

మంత్రాలయం వద్ద...

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామ సమీపంలో కారు, ఆటో ఢీ కొన్నాయి. ఆటోలో ప్రయాణిస్తున్న15 మహిళ కూలీలతో సహా ఆటో డ్రైవర్ సైతం గాయపడ్డాడు. మాధవరం గ్రామానికి చెందిన వీరంతా.. పక్క గ్రామం సూగురులో మిరప పంటలో పనుల కోసం వెళ్తుండగా ఘటన జరిగింది.

తూర్పుగోదావరి జిల్లాలో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా..

తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పరిధిలోని చినబొడ్డు వెంకట పాలెంకు చెందిన ముగ్గురు మహిళలు.. ఆదివారం రాత్రి మట్లపాలెంలోని బంధువుల ఇంటికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తున్నారు. పడవల వద్ద జాతీయ రహదారిపై కాకినాడ వైపు వెళ్తున్న కారు.. వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఆటో డ్రైవర్ తో సహా మహిళలను సైతం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శేరు కామేశ్వరి అనే మహిళ మృతిచెందగా.. శేరు లక్ష్మి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారి కుటుంబాలకు న్యాయం చేయాలని బంధువులు.. కామేశ్వరి మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు ఎఫ్ఐఆర్​లో తప్పులు నమోదు చేశారని.. నిందితులను వదిలేశారని ఆరోపిస్తున్నారు.

జమ్మలమడుగులో నీటిగుంటలో మునిగి యువకుడు మృతి

కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని గండికోటలో విషాదం నెలకొంది. 19ఏళ్ల యువకుడు నీటి గుంటలో మునిగి మరణించాడు. ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు స్నేహితులు సరదాగా గండికోటను చూసేందుకు వెళ్లారు. కోటలోపల జలపాతం వద్ద ఈత కోసం అందులో దిగారు. స్నేహితులు జలపాతం వద్ద ఉండగా సుభాన్ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న నీటి గుంటలో మునిగి మృత్యువాత పడినట్లు పోలీసులు తెలిపారు.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో...

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో గౌరవరం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట నుంచి హైదరబాద్ వెళ్తున్న కారు అటుగా వెళ్తున్న ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

పాఠశాలకు వెళ్తుండగా ప్రమాదం.. చిత్తూరులో విద్యార్థి మృతి

చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం జడ్పీ హైస్కూల్ ఎదుట రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాలకు వెళుతూ రోడ్డు దాటుతున్న సమయంలో.. పదోతరగతికి చెందిన శామ్యూల్ అనే విద్యార్థి మృతి చెందాడు. పాఠశాల ముందు రోడ్డు దాటుతుండగా.. ప్రైవేట్ కళాశాలకు చెందిన వాహనం ఢీకొని విద్యార్థి కిందపడిపోయాడు. స్థానికులు వెంటనే సామ్యూల్​ను జిల్లా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి విద్యార్థి అప్పటికే మృతిచెందినట్లు నిర్థరించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:

సిద్ధార్థ దేవేందర్‌ హత్యకేసు నిందితుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.