ETV Bharat / state

అకాల వర్షం.. ఆందోళనలో మిర్చి రైతు

author img

By

Published : Mar 7, 2020, 6:54 PM IST

అన్నీ అనుకూలించి మేలైన పంట చేతికొచ్చిందనే సమయానికి మిర్చి రైతుల్లో ఆందోళన నెలకొంది. కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా కర్షకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన ధరలు లేని సమయంలో దాదాపు పంట మొత్తం తడిసిపోవటంతో తీరని నష్టం కలుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అకాల వర్షాల కారణంగా మిర్చి రైతుల్లో ఆందోళన
అకాల వర్షాల కారణంగా మిర్చి రైతుల్లో ఆందోళన

అకాల వర్షాల కారణంగా మిర్చి రైతుల్లో ఆందోళన

కృష్ణా జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో మిర్చి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కల్లాల్లో ఆరబోసిన మిరప పంటను కాపాడుకునేందుకు రైతుల వద్ద పట్టాలు లేకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, వత్సవాయి, చందర్లపాడు మండలాల్లో సుమారుగా 40 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించటంతో మేలైన దిగుబడులు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. కానీ అకాల వర్షాలు వచ్చి పంటకు తీరని నష్టాన్ని కలిగిస్తుందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ధరలు సగానికి పడిపోయిన తరుణంలో ఈ వర్షాలు మరింత ముంచివేసిందని వాపోయారు.

పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్

కల్లాల్లో ఆరబోసిన మిరప కాయలను వర్షం నుంచి కాపాడుకునేందుకు ప్రభుత్వం తక్షణమే నూరు శాతం రాయితీపై పట్టాలు అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు. గత ఏడాది తెదేపా ప్రభుత్వం రాయితీపై పట్టాలు అందజేసిన విషయాన్ని ఈ సందర్భంగా రైతులు గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యానవన శాఖ ద్వారా పట్టాల పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: అకాల వర్షంతో నష్టపోయిన మిర్చి రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.