ETV Bharat / state

HC: 'లోకాయుక్తకు ఆ పరిధి ఎక్కడిది?'.. అశోక్​బాబు అరెస్టుపై హైకోర్టులో విచారణ

author img

By

Published : Feb 11, 2022, 3:28 PM IST

Updated : Feb 12, 2022, 3:46 AM IST

అశోక్‌బాబు అరెస్టుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్
అశోక్‌బాబు అరెస్టుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

15:26 February 11

కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లకు ఆదేశం

High Court on Ashok Babu Arrest: తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు సర్వీసు రికార్డు తారుమారు చేశారన్న అభియోగంపై సీఐడీతో దర్యాప్తు చేయించాలని ఏపీ లోకాయుక్త వాణిజ్య పన్నుల శాఖను ఆదేశించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఆ తరహా ఆదేశాలివ్వడానికి లోకాయుక్తకున్న అధికారాలేమిటని ప్రశ్నించింది. దాని విచారణాధికార పరిధి ఏమిటో అర్థం కావడం లేదని పేర్కొంది. ఇలాంటి చర్యలు జీర్ణించుకోవడం కష్టంగా ఉందని ఘాటుగా వ్యాఖ్యానించింది. లోకాయుక్తను వ్యాజ్యంలో ప్రతివాదిగా ఎందుకు చేర్చలేదని ఎమ్మెల్సీ అశోక్‌బాబు తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లును ప్రశ్నించింది. అధికారాలపై లోకాయుక్త వాదనలు వినాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మరోవైపు ఎలాంటి ప్రాథమిక విచారణ చేయకుండా కేవలం లోకాయుక్త ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ అశోక్‌బాబుపై కేసు నమోదు చేసినట్లుందని సీఐడీ తీరును ఆక్షేపించింది. సర్వీసు రిజిష్టర్‌లో విద్యార్హతలను ఎప్పుడు, ఎవరు తప్పుగా నమోదు చేశారనే ప్రాథమిక సమాచారం లేకుండా కేసు నమోదు చేయడమేంటని సీఐడీని నిలదీసింది. కేసు నమోదు చేసే ముందు అందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలున్నాయా? లేదా? పరిశీలించారా? అని ప్రశ్నించింది. అధికారుల విచక్షణాధికారం మేరకు కేసులు నమోదు చేస్తారా? అంటూ సీఐడీపై మండిపడింది.

వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని, ప్రస్తుతానికి బెయిలు మంజూరు చేయవద్దని సీఐడీ తరఫు న్యాయవాది చైతన్య కోర్టును అభ్యర్థించారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. కేసు నమోదుకు ప్రాథమిక ఆధారాలేమిటి? నమోదు చేసిన సెక్షన్లు ఎలా వర్తిస్తాయి? బెయిలు ఎందుకు మంజూరు చేయకూడదు? తదితర వివరాలపై కౌంటర్‌ వేయాలని ఆదేశించింది. లోకాయుక్తను ప్రతివాదిగా చేర్చాలని అశోక్‌బాబు తరఫు న్యాయవాదికి సూచించింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ శుక్రవారం ఈమేరకు ఆదేశాలిచ్చారు. సర్వీసు రిజిష్టర్‌లో విద్యార్హతను మార్చారనే ఆరోపణతో తెదేపా ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబుపై సీఐడీ ఇటీవల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో పోలీసులు అశోక్‌బాబును అరెస్టు చేశారు. సీఐడీ తనపై తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు చేసిందని, బెయిలు మంజూరు చేయాలంటూ అశోక్‌బాబు శుక్రవారం హైకోర్టులో అత్యవసరంగా బెయిలు పిటిషన్‌ వేశారు.

41 నోటీసును తప్పించుకోవడానికే పెద్ద సెక్షన్లు: అశోక్‌బాబు తరఫు న్యాయవాది వాదనలు
'ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ డి.రమేశ్‌ విచారించారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదిస్తూ.. సర్వీసు సంబంధ వ్యవహారంలో పిటిషనర్‌పై క్రిమినల్‌ చర్యలు ప్రారంభించాలని ఆదేశించే అధికారం లోకాయుక్తకు లేదన్నారు. ఏడేళ్లలోపు శిక్షకు వీలున్న సెక్షన్లు నమోదు చేస్తే సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ ప్రకారం నోటీసివ్వాల్సి ఉందన్నారు. ఆ నోటీసును తప్పించుకునేందుకు పదేళ్ల వరకు శిక్షకు వీలున్న పెద్ద సెక్షన్లను నమోదు చేశారన్నారు. ఎమ్మెల్సీగా ఉంటూ ఉద్యోగుల సమస్యలపై ఆయన పోరాడుతున్నారన్నారు. ఆయన గొంతునొక్కేందుకే సీఐడీ తప్పుడు కేసు నమోదు చేసిందన్నారు. గుండె శస్త్రచికిత్స చేసుకున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బెయిలివ్వాలని కోరారు.

సీఐడీ తరఫు న్యాయవాది చైతన్య వాదనలు వినిపిస్తూ.. వాణిజ్య పన్నులశాఖ సంయుక్త కమిషనర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. నకిలీ బీకాం ధ్రువపత్రాన్ని సీజ్‌ చేశామన్నారు. తాము నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటవుతాయన్నారు. మధ్యంతర బెయిలు మంజూరు చేయవద్దని కోరారు.

వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘బెయిలు ఎందుకు మంజూరు చేయకూడదో చెప్పండి. పిటిషనర్‌ ప్రస్తుతం సర్వీసులో లేరు. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం లేదు. లోకాయుక్త ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లుంది తప్ప మరో ఇతర ఆధారాలు లేవు. ఎప్పుడు విద్యార్హతను మార్చారు, ఎవరు మార్చారు అనే ప్రాథమిక విషయాన్ని సీఐడీ చెప్పలేకపోతోంది. పైఅధికారి వద్ద ఉన్న రికార్డులో పిటిషనర్‌ ఎలా మారుస్తారు? మరోవైపు ఈ ఆరోపణ కొత్తగా వెలుగులోకి వచ్చిందికాదు. పిటిషనర్‌ నేరానికి పాల్పడినట్లు పూర్వ చరిత్ర లేదు. శాఖాపరమైన విచారణలో పిటిషనర్‌ పాత్ర లేదని తేలింది. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఏమి చెబుతారు’ అని ప్రశ్నించారు. సీఐడీ తరఫు న్యాయవాది పూర్తి వివరాలను కౌంటర్‌ రూపంలో కోర్టు ముందుంచుతామని, సమయం కావాలని కోరారు.

ఇదీ చదవండి

Chandrababu: ప్రభుత్వ అరాచకాలకు అడ్డుకట్ట పడాలంటే..ప్రజల్లో చైతన్యం రావాలి: చంద్రబాబు

Last Updated : Feb 12, 2022, 3:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.