ETV Bharat / state

ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ షెడ్యూల్ ఇదే..

author img

By

Published : Jan 17, 2023, 7:32 PM IST

KHAMMAM BRS PUBLIC MEETING SCHEDULE: ఖమ్మం నగరంలో ఈనెల 18న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ మంత్రులు, నాయకులు, అధికారులు చకచకా సిద్దం చేస్తున్నారు. సభ ద్వారా అమలయ్యే లక్ష్యాలు ఏమిటి?, సభలో ఎంతమంది ముఖ్యమంత్రులు పాల్గొనబోతున్నారు?, ఏయే మంత్రులు.. ఎవరెవరికీ స్వాగతం పలకనున్నారు? అనే పూర్తి వివరాలు, సభ షెడ్యూల్‌ను.. మంత్రి హరీశ్‌రావు ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు.

KHAMMAM BRS PUBLIC MEETING
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ సభ

KHAMMAM BRS PUBLIC MEETING SCHEDULE: ఖమ్మంలో రేపు నిర్వహించే బీఆర్​ఎస్​ తొలి బహిరంగ సభ జాతీయ రాజకీయాలను మలుపు తిప్పనుందని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై సభా వేదికగా సమరభేరి మోగిస్తామని అంటున్నారు. దేశమంతటా తెలంగాణ విధానాల అమలే లక్ష్యంగా నిర్వహిస్తోన్న ఈ సభలో 4 జాతీయ పార్టీల నేతలు, నలుగురు ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారని తెలిపారు.

ఈ క్రమంలో సభకు సంబంధించిన వివరాలను మంత్రి హరీశ్‌రావు.. ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... '' ఈ ఖమ్మం సభ ఒక చారిత్రాత్మక సభ. ఇందులో నాలుగు జాతీయ పార్టీలు పాల్గొంటున్నాయి. ఈ మధ్యకాలంలో ఇన్ని జాతీయ పార్టీలను, ఇంతమంది నాయకులను వేదికపై తీసుకువచ్చిన సందర్భమయితే లేదు. ఇదే మొదటి సారి. ఆప్ పార్టీ వ్యవస్థాపకులు, ముఖ్యమంత్రి కేజ్రీవాల్, యూపీ సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఐ అధ్యక్షుడు డీ.రాజా, సీపీఎం తరఫున కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాల్గొంటున్నారు. నాలుగు జాతీయ పార్టీలను ఒక వేదికపైకి తీసుకురావడంతో కేసీఆర్ తొలి విజయం సాధించారు.'' అని తెలిపారు.

ఈ రోజు రాత్రికి జాతీయ పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు హైదరాబాద్‌ చేరుకుంటారు. వారిని ప్రోటోకాల్ ప్రకారం.. మంత్రులు స్వాగతం పలకనున్నారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కి, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్‌కి హోంమంత్రి మహమూద్‌ అలీ స్వాగతం పలుకుతారు. వారి ప్రొటోకాల్ మొత్తం మంత్రి మహమూద్ అలీ పర్యవేక్షిస్తారు. కేరళ సీఎం పినరయి విజయన్‌కి మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, సీపీఐ జాతీయ నేత డి.రాజాకు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్‌ స్వాగతం చెబుతారు.

జాతీయ స్థాయి నేతలంతా బుధవారం ఉదయం సీఎం కేసీఆర్‌తో కలిసి అల్పాహారం తీసుకుంటారు. అనంతరం వారంతా దేశ రాజకీయాలపై చర్చిస్తారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌తో కలిసి... యాదాద్రికి వెళ్లి అక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రెండు హెలీకాప్టర్లలో ఖమ్మం బయల్దేరతారు.

సీఎం కేసీఆర్ తో పాటు ఖమ్మం చేరుకున్న జాతీయస్థాయి నాయకులు కలెక్టరేట్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం తెలంగాణలో చేపట్టే రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అక్కడికి వచ్చిన ఆరుగురికి ఈ నేతలు అద్దాలు అందజేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బహిరంగ సభ జరుగుతుంది. ఆ తరువాత హెలీక్యాప్టర్లలో జాతీయ స్థాయి నేతలంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం జాతీయ నేతలు తమ ప్రాంతాలకు చేరుకుంటారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.