ETV Bharat / state

HC Serious on Rawat: ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్​పై హైకోర్టు ఆగ్రహం.. వారెంట్ జారీ

author img

By

Published : Jun 21, 2023, 10:38 PM IST

contempt of court case: కోర్టు ధిక్కరణ కేసులో గైర్హాజరైన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌పై హైకోర్టు ఆగ్రహించింది. మలి విచారణను జులై 12కు వాయిదా వేస్తూ.. రావత్​పై బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మరోవైపు ప్రాసిక్యూషన్స్‌ డైరెక్టర్​గా జల్లా సుదర్శన్‌రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ ప్రాసిక్యూషన్స్‌ అదనపు డైరెక్టర్‌ బి.రామకోటేశ్వరరావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

Etv Bharat
Etv Bharat

contempt of court case: కోర్టు ధిక్కరణ కేసులో విచారణకు గైర్హాజరైన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌పై హైకోర్టు కన్నెర్ర చేసింది. ఆయనపై బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తూ.. విచారణను జులై 12కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్డు ఏర్పాటుకు సంబంధించి ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌(ఈఎండీ), ఫ్యూచర్‌ సెక్యూర్టీ డిపాజిట్‌(ఎఫ్‌ఎస్‌డీ) సొమ్మును తిరిగి తనకు విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించినా అధికారులు ఆ మేరకు వ్యవహరించలేదని పేర్కొంటూ గుత్తేదారు జే.వెంకటేశ్వరరెడ్డి హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు విచారణకు హాజరుకావాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రావత్‌ను ఆదేశించింది.

రావత్ రాకపోవడంతో మరో రోజుకు వాయిదా వేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి.. హాజరు నుంచి మినహాయింపు కోరుతూ అనుబంధ పిటిషన్‌ వేసుకోవాలని సూచిస్తూ మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం 2.45 సమయంలో మళ్లీ విచారణ చేపట్టగా.. ప్రభుత్వ న్యాయవాది హాజరు కాలేదు, హాజరు నుంచి మినహాయింపు కోసం అనుబంధ పిటిషన్‌ వేయలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి.. ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌పై బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు.

ఆ నియామకం చెల్లదంటూ.. ప్రాసిక్యూషన్స్‌ డైరెక్టర్‌ గా జల్లా సుదర్శన్‌రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ ప్రాసిక్యూషన్స్‌ అదనపు డైరెక్టర్‌ బి.రామకోటేశ్వరరావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మే 22న జారీ చేసిన జీవో 552ను రద్దు చేయాలని కోరారు. మరోవైపు సుదర్శన్‌రెడ్డి నియామకానికి హైకోర్టు పరిపాలనపరమైన సమ్మతి తెలియజేయడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని అభ్యర్థించారు. నిబంధనల ప్రకారం ఆ పోస్టుకు తాను అర్హుడనని తెలిపారు. పదోన్నతి కల్పించడం ద్వారా ప్రాసిక్యూషన్స్‌ డైరెక్టర్‌గా తనను నియమించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ తరఫున న్యాయవాది వివేక్‌ చంద్రశేఖర్‌ హాజరు అయ్యేందుకు విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ఓ జూనియర్‌ న్యాయవాది అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది.

చట్టవిరుద్ధం.. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది రవీంద్రనాథ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఏపీ ప్రాసిక్యూషన్‌ సర్వీసు నిబంధనలు, సీఆర్‌పీసీ, ఏపీ విభజన చట్టంలోని సెక్షన్‌ 78కి విరుద్ధంగా ప్రాసిక్యూషన్స్‌ డైరెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిందన్నారు. సుదర్శన్‌రెడ్డి నియామకానికి రాష్ట్ర హైకోర్టు పరిపాలనాపరమైన సమ్మతి ఇవ్వడం చట్టవిరుద్ధమన్నారు. సుదర్శన్‌రెడ్డి అన్నమయ్య జిల్లా గాలివీడు మండల పరిషత్‌ అధ్యక్షుడిగా పని చేస్తున్నారన్నారు. ఆ పదవికి రాజీనామా చేసి ప్రాసిక్యూషన్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారన్నారు. డైరెక్టర్‌గా నియమితులయ్యేందుకు పిటిషనర్‌కు అన్ని అర్హతలున్నాయన్నారు. క్రిమినల్‌ లాలో 31 ఏళ్లకు పైగా ప్రాక్టీసు చేస్తున్నారన్నారు. వివిధ హోదాల్లో పని చేశారన్నారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శి, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్, ప్రాసిక్యూషన్స్‌ డైరెక్టర్, వ్యక్తిగత హోదాలో జల్లా సుదర్శన్‌రెడ్డిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. వైఎస్సార్‌ ఉమ్మడి కడప జిల్లా (ప్రస్తుతం అన్నమయ్య జిల్లా) గాలివీడు వైఎస్సార్సీపీ మండల పరిషత్‌ అధ్యక్షుడు(ఎంపీపీ), గాలివీడు గ్రామానికి చెందిన న్యాయవాది జల్లా సుదర్శన్‌రెడ్డిని రాష్ట్ర ప్రాసిక్యూషన్స్‌ డైరెక్టర్‌గా నియమిస్తూ మే 22న హోంశాఖ ముఖ్యకార్యదర్శి హరీష్‌కుమార్‌ గుప్త జీవో జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వం లోతైన పరిశీలన అనంతరం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమ్మతి తీసుకొని ఈ నియామకం చేపట్టినట్లు జీవోలో పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.