ETV Bharat / state

Reservoirs: నిండుకుండలా జలాశయాలు..నీటిమట్టం ఎంతంటే..

author img

By

Published : Jul 23, 2021, 10:45 AM IST

Updated : Jul 23, 2021, 11:33 AM IST

ఉపరితల ఆవర్తనం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటితో ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Heavy flood  flows in  reservoirs
జలాశయాల్లోకి భారీగా వరదనీరు

ఉపరితల ఆవర్తనం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రవాహానికి.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రాజెక్టులలోకి వరద భారీగా వచ్చి చేరుతోంది. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

జలాశయాల్లోకి భారీగా వరదనీరు

పులిచింతల ప్రాజెక్టులోకి..

గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 62వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోంది. ప్రస్తుతం మూడు గేట్లు ఎత్తి 52వేల 393 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తి కోసం 10 వేల క్యూసెక్కుల నీరు మళ్లించారు. జలాశయం పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుతం ప్రాజెక్టులో 44.03 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నదిలోకి నీరు విడుదల చేస్తున్నందున.. కృష్ణా పరివాహక ప్రాంత గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు

శ్రీశైలానికి వరద ప్రవాహం

ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలానికి 87,521 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద పెరగడంతో శ్రీశైలం జలాశయ నీటిమట్టం క్రమంగా పుంజుకుంటుంది. జలాశయ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 847.60 అడుగులుగా నీరు ఉంది. గరిష్ఠ నీటి నిల్వ 215 అడుగులు కాగా.. ప్రస్తుత నీటినిల్వ 74.9770 టీఎంసీలుగా నమోదైంది. ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసి..నాగార్జున సాగర్​​కు 28,252 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో ఎడమ జల విద్యుత్ కేంద్రంలో 10.540 మిలియన్ యూనిట్ల విద్యుత్​ను ఉత్పత్తి చేశారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద పెరిగిన వరద

కృష్ణా జిల్లాలో పొంగుతున్న వాగుల ద్వారా.. ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. దీనితో ప్రకాశం బ్యారేజీలో పెరిగిన నీటిమట్టం పెరిగింది. పులిచింతల, మున్నేరు, పాలేరు, కట్లేరువాగు నుంచి భారీగా వరద ప్రవాహం వస్తోంది. 44,250 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి సుమారు లక్ష క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం ఉంటుందని కలెక్టర్‌ నివాస్‌ తెలిపారు. బ్యారేజీ ఇన్‌ఫ్లో 33,061 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 31,500 క్యూసెక్కులుగా ఉంది. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

పొంగిపొర్లుతున్న నాలుగు వాగులు..

మున్నేరులో ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తోంది. పోలంపల్లి ఆనకట్ట వద్ద 12.5 అడుగుల నీటిమట్టం ఉండగా..50 వేల క్యూసెక్కుల నీరు కిందకి వెళుతోంది. పులిచింతల నుంచి 52,393 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. 55 గేట్లు.. అడుగు చొప్పున తెరిచి నీటిని కిందకి పంపిస్తున్నారు. వత్సవాయి మండలం లింగాల వద్ద వంతెన నీట మునగటంతో తెలంగాణకు రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. పెనుగంచిప్రోలు వద్ద వంతెనను ఆనుకొని వరద నీరు ప్రవహిస్తోంది. పోలంపల్లి ఆనకట్ట వద్ద 12.5 అడుగుల నీటిమట్టం నమోదయ్యింది. వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు వద్ద కట్టలేరు వాగు వరద నీరు దేవినేని వెంకట రమణ వారధిపై ప్రవహిస్తుంది.

గోదావరిలో పెరిగిన వరద ప్రవాహం

ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటి ఉద్ధృతి పెరిగింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 8.5 అడుగుల నీటిమట్టం ఉంది. పంట కాల్వలకు 2 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. లక్షా 10 వేల క్యూసెక్కులకు పైగా నీరు సముద్రంలోకి వెళుతోంది. వరద ప్రవాహం ఎక్కువ అవడంతో.. పోలవరం నిర్వాసిత ప్రాంతాల ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికో దేవిపట్నంలోని పరిసర గ్రామాలు నీటమునిగాయి.

ఇదీ చూడండి. RAINS: రాష్ట్రంలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Last Updated : Jul 23, 2021, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.