ETV Bharat / state

బాధితులైన తెలుగుదేశం నేతలనే.. నిందితులుగా చేర్చారు..!

author img

By

Published : Dec 27, 2022, 7:44 AM IST

YCP, TDP clash: చంపేందుకు వచ్చిన వారిపై హత్యాయత్నం కేసుల్లేవు..! ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితులపై రివర్స్ కేసులు..! తెలుగుదేశం నేతలైతే రెండేసి కేసులు.. వైసీపీ వర్గీయులైతే బెయిలబుల్‌ సెక్షన్లతోనే సరి. గుడివాడ ఘర్షణకు సంబంధించి పోలీసులు ఉపయోగిస్తున్న ఫార్ములా ఇది. బొమ్మను తిమ్మి చేసి.. తిమ్మిని బొమ్మ చేసి, ఉల్టా కేసులు పెడుతున్న పోలీసుల తీరు విస్మయం కలిగిస్తోంది.

YCP TDP clash
గుడివాడ లో ఘర్షణ

Andhras Gudivada tense: తెలుగుదేశం నేతలైతే రెండేసి కేసులు, వైసీపీ నేతైతే ఒక నామమాత్రపు కేసు.. గుడివాడ లో ఘర్షణకు సంబంధించి పోలీసులు అనుసరిస్తున్న ఫార్ములా ఇది. ఉల్టా కేసులతో పోలీసుల వైఖరి విస్తుగొలిపిస్తోంది. చంపేస్తానంటూ టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుని వైసీపీ నేత కాళీ బెదిరించారు. అన్నట్లుగానే పోలీసుల సమక్షంలోనే పెట్రోలు ప్యాకెట్లు, కత్తులతో దాడి చేయడానికి వచ్చారు. బాధితుడు స్వయంగా ఈ విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు మాత్రం ఎఫ్‌ఐఆర్‌లో హత్యాయత్నం సెక్షన్లు నమోదు చేయలేదు. కారణం.. నిందితుడు అధికార వైసీపీకి చెందిన వ్యక్తి కావడమే. తూతూమంత్రంగా తేలికపాటి, త్వరగా బెయిల్‌ వచ్చేవి, తక్కువ శిక్షలు పడే సెక్షన్లతోనే కేసు కట్టారు.

గుడివాడలో రావిపై దాడి ఘటనలో పోలీసుల తీరుపై విమర్శలు

టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు, అతని కార్యాలయంపై దాడి చేసిన వైసీపీ వర్గీయులపై ఒక కేసుతోనే సరిపుచ్చారు. బాధితులు అయిన టీడీపీ నేతలపై మాత్రం రెండు కేసులు కట్టారు. వైసీపీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఒకటి, రెండో పట్టణ హెడ్‌ కానిస్టేబుల్‌ ఫిర్యాదు ఆధారంగా మరొక కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి గుడివాడ పట్టణంలో జరిగిన వైసీపీ నేతల దాడి ఘటనపై పోలీసుల వైఖరి అందరినీ విస్తుగొలుపుతోంది. పోలీసులు పక్షపాతం చూపుతున్నారని టీడీపీ నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ కేసుల్లో ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు.

తనను చంపుతానని వైసీపీ నాయకుడు మెరుగుమాల కాళీ, అతని అనుచరులు ఫోన్‌లో బెదిరించారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత రావి.. ఆదివారం రాత్రి గుడివాడ ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. పోలీసుల సమక్షంలోనే పెట్రోలు ప్యాకెట్లతో దాడులు చేసినా పోలీసులు మాత్రం నామమాత్రంగా ఐపీసీలోని 143, 144, 146, 188, 427, 506 రెడ్‌ విత్‌ 149 సెక్షన్ల కింద వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. దొమ్మీ, ఆస్తులు ధ్వంసం, దాడికి వర్తించే సెక్షన్లను వర్తింపజేశారు. ఈ కేసుకు సంబంధించి వైసీపీ నేతలు మెరుగుమాల కాళీ, నీరుడు ప్రసాద్‌తో పాటు మరో 20 మంది అంటూ నిందితులుగా పేర్కొన్నారు. వైసీపీ, టీడీపీ వర్గాల బాహాబాహీలో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌కు కర్ర తగిలితే టీడీపీ నేతలపై కేసు పెట్టడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

రావి టెక్స్‌టైల్‌ కాంప్లెక్స్‌ వద్ద విధుల్లో ఉన్న రెండో పట్టణ పోలీసు స్టేషన్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ అబ్దుల్‌ హకీమ్‌కు ఎవరో విసిరిన కర్ర తగిలి చెవికి, తలకు గాయాలయ్యాయి. దీనికి టీడీపీ నేతలే కారణమంటూ హెడ్‌ కానిస్టేబుల్‌ ఇచ్చిన ఫిర్యాదుపై టీడీపీ నేతలు రావి వెంకటేశ్వరరావు, గోకవరపు సునీల్, నిమ్మగడ్డ సత్యసాయి, దేవరాపల్లి కోటి, చల్లగుల్ల ఆదిత్య, కొడాలి వినోద్, గోవాడ శివ, సయ్యద్‌ జమీల్, ఏసుపోగు సాగర్, కొడాలి రామరాజుతో పాటు మరో 20 మందిని నిందితులుగా చేర్చి 143, 144, 146, 188, 332 రెడ్‌విత్‌ 149 సెక్షన్ల కింద కేసు కట్టారు. ఇదే సంఘటనలో కాళీ అనుచరులు సాక్షాత్తు ఒకటో పట్టణ సీఐ గోవిందరాజును, కానిస్టేబుల్‌ బన్నును నెడుతూ, దురుసుగా ప్రవర్తించినా పోలీసులు కేసులు ఎందుకు నమోదు చేయలేదో సమాధానం చెప్పాలని టీడీపీ శ్రేణులు నిలదీస్తున్నాయి.

టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావును చంపేస్తానని బెదిరించి, పెట్రోలు వచ్చి దాడి కాళీ దాడి చేశారు. కానీ.. కాళీపైనే టీడీపీ వర్గీయులు దాడి చేశారని వైసీపీ కార్యకర్త భట్టు నరేంద్ర ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తెలుగుదేశం నేతలపై కేసు నమోదు చేయడం విశేషం. వైసీపీ కార్యాలయం అయిన శరత్‌ టాకీస్‌కు కాళీ వెళ్తుండగా.. టీడీపీ కార్యాలయం వద్దకు రాగానే అతనిపై మారణాయుధాలపై దాడి చేశారని నరేంద్ర ఫిర్యాదు మేరకు రావి వెంకటేశ్వరరావు, గోకవరపు సనీల్, నిమ్మగడ్డ సత్యసాయి, రమేష్, దేవరపల్లి కోటి, చల్లగుళ్ల ఆదిత్య, కొడాలి వినోద్, గోవాడ శివ, సయ్యద్‌ జమీల్, కొడాలి రామరాజులపై 143, 144, 146, 188, 341, 506 రెడ్‌ విత్‌ 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.