ETV Bharat / state

'కుర్రాణ్ణి చూసి ముఖ్యమంత్రి ఎందుకు అంతలా వణికిపోతున్నారు'

author img

By

Published : Jan 25, 2023, 7:36 PM IST

varla ramaiah
వర్ల రామయ్య

varla ramaiah comments on yuvagalam : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ చేపట్టనున్న యువగళం మహాపాదయాత్రను ఏ రకంగానైనా అడ్డుకొనేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. పాదయాత్ర నిర్వహణపై ప్రభుత్వం.. ఎందుకు అన్ని నిబంధనలు పెడుతోందని ఆయన ప్రశ్నించారు. కుర్రాణ్ణి చూసి ముఖ్యమంత్రి ఎందుకు అంతలా వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు.

varla ramaiah comments on yuvagalam : తెదేపా యువనేత లోకేశ్ పాదయాత్ర సజావుగా, సక్రమంగా జరిగేలా చూడాలన్న ఆలోచన పోలీస్ శాఖకు లేనట్టుందని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. లోకేశ్ పాదయాత్రకే ఎందుకిన్ని నిబంధనలు.. ఆంక్షలు పెడుతున్నారని ప్రశ్నించారు. ఆ కుర్రాణ్ణి చూసి ముఖ్యమంత్రి ఎందుకు అంతలా వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. డీఎస్పీ సుధాకర్ రెడ్డి పాదయాత్రకు మూడు రోజులు అనుమతిస్తూ పెట్టిన కండిషన్లు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆక్షేపించారు. పాదయాత్ర చేసేవారు అంబులెన్సులు పెట్టుకుంటారా సుధాకర్ రెడ్డి అని నిలదీశారు.

జగన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఎన్ని అంబులెన్సులు పెట్టుకున్నాడన్నారు. యూనిఫామ్డ్ వాలంటీర్లే రోప్ పార్టీగా వ్యవహరిస్తే పోలీసులేం చేస్తారని ప్రశ్నించారు. గతంలో రోప్ పార్టీలన్నీ పోలీసులే చూసేవారు.. ఇప్పుడు చట్టం మార్చారా ఏంటని మండిపడ్డారు. పాదయాత్రలో ఎవరికీ చీమకుట్టకుండా చూడాల్సింది నిర్వాహకులా... మరి లక్షల జీతాలు తీసుకుంటున్న పోలీసులేం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పిన దానికంటే జనం ఒక్కరు కూడా ఎక్కువ రాకూడదా, సౌండ్ సిస్టమ్​లో సింగిల్ మైక్ మాత్రమే పెట్టాలా..? అని దుయ్యబట్టారు.

5.30 గంటలకే పాదయాత్ర ముగించాలా... జనం రోడ్లపైకి వచ్చే సమయానికి లోకేశ్ కనిపించకూడదా అని నిలదీశారు. పాదయాత్రలో లోకేశ్ ఎవరిని కలుస్తారో ముందే చెప్పాలా అని విమర్శించారు. జగన్ రెడ్డి పాదయాత్రలో సింగిల్ మైకే పెట్టారా డీజీపీ గారు అని ప్రశ్నించారు. జగన్ పాదయాత్రలో మూడు పెద్దపెద్ద సౌండ్ వెహికల్స్ పెట్టిన విషయం మీరు మర్చిపోయారా అని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి నాన్న రాజశేఖర్ రెడ్డి, చెల్లి షర్మిల, ముఖ్యమంత్రి చేసిన పాదయాత్రల్లో ఈ నిబంధనలన్నీ పాటించారా డీజీపీ గారూ.. అని వర్ల ప్రశ్నించారు. ట్రాఫిక్ రెగ్యులేషన్, క్రౌడ్ కంట్రోల్, శాంతిభద్రతల నిర్వహణ, అంబులెన్సుల ఉపయోగం, ఫైర్ సర్వీస్ ల వినియోగం అన్నీ పాదయాత్ర నిర్వాహకులే చేస్తే, మరి పోలీసులు, ప్రభుత్వం చేసేదేంటి డీజీపీ అని నిలదీశారు.

పలమనేరు డీఎస్పీ మూడు రోజులు అనుమతిస్తే, ప్రతి మూడు రోజులకోసారి పాదయాత్రకు అప్లికేషన్ పెట్టాలా అని ప్రశ్నించారు. ఇలా 400రోజుల పాదయాత్రలో 120 మంది డీఎస్పీలను కలిసి, పర్మిషన్ కోసం దేబిరించాలా అని మండిపడ్డారు. గతంలో డీజీగా ఉన్న సాంబశివరావు ఇచ్చిన పర్మిషన్ మాదిరే, మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు రాజేంద్రనాథ్ రెడ్డిగారు అని అన్నారు. డీజీపీ వెంటనే, అందరు జిల్లా అధికారులకు లోకేశ్ పాదయాత్రకు తగురీతిలో భద్రతాఏర్పాట్లు చేయమని, ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మరో లేఖ ద్వారా కోరారు. చిత్తూరు ఎస్పీకూడా పలమనేరు డీఎస్పీ ఇచ్చిన కండిషన్లతో కూడిన పర్మిషన్ ను సమీక్షించాలని మరోలేఖ రాాశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.