ETV Bharat / state

కోతలు ముగిసి పది రోజులైనా లేని కొనుగోళ్లు.. రైతుల ఆందోళన

author img

By

Published : Dec 7, 2022, 9:36 PM IST

Paddy Farmers Tension: అహర్నిశలు శ్రమించి పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలని కృష్ణాజిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు. వరికోతలు పూర్తై పదిరోజులు గడుస్తున్నా రేపు మాపు అంటూ అధికారులు ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుఫాను హెచ్చరిక నేపథ్యంలో పొలాలు, రహదారులపై ఆరబెట్టిన ధాన్యం దెబ్బతింటుందేమోనన్న ఆలోచన కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని రైతులు వాపోతున్నారు.

Farmers Agitation
రైతుల ఆందోళన

ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని కృష్ణాజిల్లా రైతుల ఆందోళన

Paddy Farmers Tension: ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం లభించకపోయినా.. కృష్ణాజిల్లా రైతులు అప్పు చేసి మరీ వరి సాగు ప్రారంభించారు. ప్రతికూల పరిస్థితుల్లో కంటికి రెప్పలా పంటను కాపాడుకున్నారు. మంచి దిగుబడి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. సకాలంలో కోతలు కూడా పూర్తి చేశారు. హమ్మయ్య ఈ ఏడాదికి ఎలాంటి నష్టం లేదని ఊపిరిపీల్చుకున్నారు. కానీ పది రోజులు దాటినా ధాన్యం కోనుగోళ్లు జరగకపోవడంతో దిగాలు పడ్డారు. తాజాగా తుఫాను హెచ్చరికతో రైతుల నెత్తిన పిడుగుపడినట్లైంది.

"గతంలో ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్న సమయంలో ఇన్ని ఇబ్బందులు లేవు. నగదు తక్కువగా చెల్లించిన.. వరి కొసిన వెంటనే కొనుగోళ్లు సాగేవి. ఇప్పుడు ఆరబోయండి అంటూ.. వడ్లను కొనుగోలు చేయటం లేదు. మబ్బులు పడుతుంటే భయంగా ఉంది." - రైతు

"గతంలో ఇన్ని సమస్యలు లేవు. ఈ సంవత్సరం పడినా బాధలు ఇంతా అంతా కాదు. రైతులు, కౌలుదారుల పరిస్థితి దయనీయంగా ఉంది. నాశనం చేస్తున్నారు రైతులని. నగదు ఎక్కువగా చెల్లిస్తామని చెప్పి ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు."- రైతు

కృష్ణాజిల్లాలోని మోపిదేవి మండలంలోని వెంకటాపురం, శివరామపురం, పెదకళ్ళేపల్లి, మేరకనపల్లె, బోడగుంట, రావివారిపాలెం, అన్నవరం, మోపిదేవి గ్రామాల్లో వరి కోతలు అయిపోయాయి. ధాన్యాన్ని వారం రోజులు అరబెట్టినప్పటికీ.. తేమ పేరు చెప్పి కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సంచులు రాలేదని, మిల్లులు ఖాళీగా లేవని కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు బరోసా కేంద్రాల వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని మండిపడ్డారు.

"వాతావరణం బాగా లేదు. కొనుగోలు కేంద్రం నుంచి వడ్లను ఎత్తటం లేదు. సొంతంగా వాహనాలను, హమాలీని మేమే ఏర్పాటు చేసుకుంటున్నాము." - రైతు

అధికారులు చెప్పినప్పుడే కోతలు కోయాలంటే ఎలా సాధ్యమవుతోందని అన్నదాతలు నిలదీస్తున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండంతో వాన గండం పొంచి ఉన్న నేపథ్యంలో..ప్రభుత్వం వెంటనే ధాన్యం కోనుగోళ్లకు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.