ETV Bharat / state

YSR వైఎస్సార్ చేయూత పథక లబ్ధిదారులకు విద్యుత్ నిబంధన షాక్‌

author img

By

Published : Aug 28, 2022, 8:34 AM IST

YSR చేయూత పథక లబ్ధిదారులకు విద్యుత్తు నిబంధన షాక్‌ తప్పేలా లేదు. ఆరు నెలల సరాసరి 300 యూనిట్లలోపు విద్యుత్తు వాడకం నిబంధన.... చాలా మంది లబ్ధిదారులకు ప్రతిబంధకంగా మారింది. ఎక్కువ విద్యుత్తును వినియోగించారనే కారణంతో ఈ దఫా చాలా మంది లబ్ధిదారుల్ని ప్రభుత్వం పునఃపరిశీలన జాబితాలో చేర్చింది.

ysr
ysr

చేయూత పథకం కింద 45-60 ఏళ్ల మధ్య ఉన్న SC, ST, BC, మైనార్టీ మహిళలకు ఏడాదికి 18 వేల 750 చొప్పున నాలుగేళ్లకు 75 వేలు ప్రభుత్వం అందించనుంది. ఇప్పటికే రెండు విడతల సాయాన్ని అందించగా...... వచ్చే నెల 22వ తేదీన మూడో విడత సాయాన్ని విడుదల చేయనున్నారు. గతేడాది రెండో విడత కింద 23.14 లక్షల మందికి ఆర్థిక సాయాన్ని అందించారు. మూడో విడత సాయాన్ని అందించేందుకు 10 దశల తనిఖీ ప్రక్రియ ఆధారంగా గతేడాది లబ్ధిదారులను ప్రభుత్వం తనిఖీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా రెండు జాబితాలు రూపొందించి క్షేత్రస్థాయికి పంపింది. తాత్కాలిక అర్హుల జాబితా, పునఃపరిశీలన జాబితాను సచివాలయాల్లోని సంక్షేమ కార్యదర్శులకు పంపింది.

300 యూనిట్ల వినియోగ నిబంధనతోపాటు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, ఆదాయపన్ను చెల్లింపుదారుడు, వ్యవసాయ భూమి, నాలుగు చక్రాల వాహనం, పట్టణాల్లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణం కంటే పెద్ద ఇల్లు ఉండటం తదితర కారణాలతో చాలా మంది పునఃపరిశీలన జాబితాలో చేరారు.YSR జిల్లాలోని ఓ మండల పరిధిలో 20 మంది గతేడాది చేయూత లబ్ధిదారులు పునఃపరిశీలన జాబితాలో ఉంటే అందులో 10 మంది 300 యూనిట్ల కంటే ఎక్కువగా వినియోగించిన వారే ఉన్నారు. ప్రకాశం జిల్లా పరిధిలోని ఓ సచివాలయంలోఆరుగురిని పునఃపరిశీలన జాబితాలో చేర్చితే అందులో ముగ్గురిది అదనపు విద్యుత్తు వాడకమే కారణం. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలంలోని ఒక సచివాలయంలో పునఃపరిశీలన జాబితాలోని ఏడుగురిలో నలుగురిది ఇదే సమస్య. కర్నూలు జిల్లా ఆలూరు మండల పరిధిలోని ఓ సచివాలయ పునఃపరిశీలన జాబితాలో 15 మంది ఉంటే ఆరుగురు లబ్ధిదారుల కుటుంబ సభ్యుల్లో పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు.

చేయూత పథక లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించేందుకు జీఎస్టీ చెల్లింపులపైనా ప్రభుత్వం నిఘా పెట్టింది. లబ్ధిదారుల కుటుంబంలో జీఎస్టీ చెల్లింపుదారులున్నారంటూ ఈ దఫా కొంతమంది పేర్లను పునఃపరిశీలన జాబితాలో చేర్చారు. అర్హత ఉన్నా... పునఃపరిశీలన జాబితాలో పేరు ఉంటే...లబ్ధిదారులు సరైన ధ్రువపత్రాలను మళ్లీ సమర్పించాల్సిందే. ఆయా శాఖల అధికారుల నుంచి ధ్రువీకరణ తీసుకుని సంబంధిత పత్రాలు సచివాలయ వెబ్‌సైట్‌లో నమోదు చేసి గ్రీవెన్స్‌ పెట్టాలి. రాష్ట్రస్థాయిలో మళ్లీ తనిఖీ చేసి అర్హత ఉన్నట్లు తేలితే పథకం అమలు చేస్తారు. లేదంటే అనర్హులుగా మిగిలిపోవాల్సిందే.


ఇవి చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.