ETV Bharat / state

Kesarapalli Garden: అప్పుడు పరుగులు.. ఇప్పుడు జాడ లేని పనులు

author img

By

Published : Apr 26, 2023, 8:58 PM IST

Updated : Apr 27, 2023, 11:51 AM IST

Kesarapalli Garden Situation: ప్రజలకు ఆహ్లాదాన్ని పంచాల్సిన ఉద్యానవనం అసాంఘిక చర్యలకు అడ్డాగా మారుతోంది. ఉదయం సమయంలో వాకింగ్ చేద్దామని వస్తున్న వారికి మద్యం సీసాల గాజు పెంకులు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఇది గన్నవరం విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఉన్న కేసరపల్లిలోని ఉద్యానవనం పరిస్థితి. గత ప్రభుత్వం దీని అభివృద్ధి కోసం చర్యలు చేపట్టినప్పటికీ వైఎస్సార్సీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక పూర్తిగా గాలికొదిలేసింది.

Udyanavanam
అసాంఘిక శక్తులకు అడ్డాగా ఉద్యానవనం

అసాంఘిక శక్తులకు అడ్డాగా ఉద్యానవనం

Kesarapalli Garden Situation : గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ వెళ్లే వారికి మార్గ మధ్యలో ఆహ్లాదాన్ని పంచే విధంగా గత ప్రభుత్వం కేసరపల్లి వద్ద ఉన్న చెరువును ఉద్యానవనంగా అభివృద్ధి చేసింది. ఉదయం, సాయంత్రం వేళల్లో యువకులు, వృద్ధులు వాకింగ్ చేయడం కోసం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. చెరువు అభివృద్దికి సంబంధించి సీఆర్​డీఏ అధికారులు నిధులు కేటాయించారు. కానీ, పనులు పూర్తి స్థాయిలో మాత్రం జరగలేదు. చెరువు అభివృద్దిని తూతుమంత్రంగా చేసి వదిలేశారు. సెలవు దినాల్లో కుటుంబంతో సహా సంతోషంగా ఉద్యానవనంలో సంతోషంగా గడుపుదామని భావించిన కేసరపల్లి గ్రామస్తుల ఆశలు అడియాశలు అయ్యాయి.

ప్రజా ప్రతినిధుల హామీ : ఈ చెరువు సుందరీకరణ చేసేందుకు దాదాపు రూ.4 కోట్ల నిధులను కేటాయించారు. అయితే, ప్రారంభంలో చెరువు చుట్టూ ఉన్న ఇళ్లను రెవెన్యూ అధికారులు తొలగించారు. తొలగించిన ఇళ్ల బాధితులకు న్యాయం చేస్తామని అధికారులు, ప్రజా ప్రతినిధులు హామీ ఇచ్చారు. చెరువు అభివద్ధి పనులను గుత్తేదారు ఆరంభంలో వేగంగా చేయించారు. చెరువు పూడిక తీయడంతో పాటు చుట్టూ కట్టలు వేసి రోడ్డు పరిచారు. ఊర్లో మురుగు చెరువులోకి రాకుండా బయటకు వెళ్లేలా తూములు ఏర్పాటు చేశారు.

70 శాతం పనులు పూర్తి.. రోజులు గడుస్తున్నా ఎక్కడి పనులు అక్కడే.. చెరువు చుట్టూ రోడ్డు వేసి వాకింగ్, సైక్లింగ్​కు రెండు ట్రాక్​ల నిర్మాణం చేపట్టారు. పనులు దాదాపు 70 శాతం పూర్తయ్యాయి. ఆ తర్వాత మిగిలిన పనులు నత్తనడకన సాగాయి. నేటికీ పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేశారు. ఆధునిక హంగులతో చెరువుని సుందరీకరణ చేసి, అందులో బోటింగ్ ఏర్పాటు చేస్తామని, పిల్లలు ఆడుకునేందుకు వసతులు, పెద్దలు వాకింగ్ చేయడానికి ట్రాక్ నిర్మిస్తామని చెప్పడంతో స్థానికులు చెరువు రూపురేఖలు మారిపోతాయని ఆశించారు. ఏళ్లు గడిచిపోతున్నా పనులు పూర్తి చేయలేదు. ఎందుకిలా జరిగిందో అర్ధం కావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీఆర్​డీఏ అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచన... సీఆర్​డీఏలో నిధులు పుష్కలంగా ఉన్నా పనులు సక్రమంగా చేయించకపోవడం పట్ల గ్రామస్థులు అభ్యంతరం చెబుతున్నారు. గ్రామం నడిబొడ్డున ఉన్న చెరువుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకుండా వదిలేస్తే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. నాలుగు కోట్ల రూపాయల ప్రాజెక్టుని సగంలో ఆపేయడం సరికాదని గ్రామస్థులు పేర్కొంటున్నారు. చెరువు సుందరీకరణ విషయంలో సీఆర్​డీఏ అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలని, చెరువు సుందరీకరణ పనులు పూర్తి చేయడంలో వారే స్పందించాలని కోరుతున్నారు. పనులు నిలిపివేసిన గుత్తేదారునితో మాట్లాడి పూర్తి చేయించాలని తెలిపారు. చెరువు లోతు చేయడంతో సుడిగుండలా మారిందని, దాంట్లో ఎవరైనా పిల్లలు పడితే అంతే సంగతులని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చెరువు గట్టు పక్కనే స్కూలు ఉందని, ఎప్పుడేం జరుగుతుందో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిర్లక్ష్యం వహిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం : ప్రజలకు ఆహ్లాదాన్ని అందించాలన్న సంకల్పంతో గత ప్రభుత్వం కేసరపల్లి గ్రామాంలో చేపట్టిన చెరువు అభివృద్దిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి చెరువును ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ది చేయాలని వారు కోరుతున్నారు.

"వాకింగ్ ట్రాక్​ను చంద్రబాబు నాయుడు సమయంలో కట్టారు. ఇప్పుడు దానిని పట్టించుకునే వారు లేరు. పిచ్చి మొక్కలు ఉన్నాయి. దానిలో పాములు, పురుగులు వస్తున్నాయి" - స్థానికుడు

"వాకింగ్​కి వెళ్లడానికి దారి బాగాలేదు. తాగుబోతులు తాగి సీసాలు అక్కడే పడేస్తున్నారు. వాటిని చిన్న పిల్లలు పగలకొట్టడం వల్ల కాళ్లకు గుచ్చుకుంటున్నాయి" - స్థానికురాలు

ఇవీ చదవండి

Last Updated : Apr 27, 2023, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.