ETV Bharat / state

CM Jagan : జీవో నెం.1ను పకడ్బందీగా అమలు చేయాలి : సీఎం జగన్​

author img

By

Published : May 4, 2023, 10:44 PM IST

Updated : May 5, 2023, 6:24 AM IST

CM Jagan Review : ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. హోం మంత్రి తానేటి వనిత, సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, తాజా పరిస్థితులపై చర్చించారు. జీవో నంబర్‌ 1ను సమర్థవంతంగా అమలు చేయాలని డీజీపీని ఆదేశించారు.

Etv Bharat
Etv Bharat

CM Jagan Review : రాష్ట్రంలో జీవో నంబర్‌ 1 ను సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డీజీపీకి సూచించారు. మహిళలపై సైబర్‌ వేధింపుల నివారణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని, ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న అత్యుత్తమ విధానాలను పరిశీలించాలని చెప్పారు. దిశ యాప్‌ పైనా సమీక్షించిన సీఎం... దిశ యాప్‌ మీద మరోసారి డ్రైవ్‌ నిర్వహించాలని నిర్దేశించారు. దిశపై అవగాహనా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని అన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఒక దిశ పోలీస్‌స్టేషన్‌ ఉండాలని, మే 9న నిర్వహించే జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. మహిళలపై సైబర్‌ వేధింపుల నివారణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని, మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడొద్దని సూచించారు.

భద్రతపై రాజీ పడొద్దు.. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడొద్దని, సైబర్, సోషల్‌ మీడియా ద్వారా మహిళలు, చిన్నారులపై జరుగుతోన్న వేధింపులకు అడ్డుకట్ట పడాలని సీఎం స్పష్టం చేశారు. మహిళలపై సైబర్‌ వేధింపుల పట్ల కఠినంగా ఉండాలన్న సీఎం.. వీటిపై ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని, వీటిని అరికట్టడానికి మంచి విధానాలను తీసుకురావాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అత్యుత్తమ విధానాలను పరిశీలించి వాటిని రాష్ట్రంలో అమలు చేయాలని సూచించారు. ఈ కేసులను తీవ్రంగా తీసుకునేందుకు వీలుగా మంచి న్యాయ నిపుణులనూ ఏర్పాటు చేసుకోవాలన్నారు. బాధితురాలికి భరోసా నిచ్చేలా ఈ కార్యక్రమాలు ఉండాలన్నారు. సోషల్‌ మీడియా ద్వారా వేధింపులు పోలీసులకు ఛాలెంజ్‌గా నిలుస్తాయని, రాబోయే రోజుల్లో మరింత ఎక్కువుగా ఈ వేధింపులు పెరుగుతాయన్నారు. వీటిని డీల్‌ చేయడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి కఠినంగా ఉండాలని సీఎం నిర్దేశించారు. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాలన్నారు. ఎస్‌ఈబీ తరహాలో ఈ విభాగం ప్రత్యేకంగా నడవాలన్నారు. సోషల్‌మీడియా ద్వారా వేధింపుల నుంచి బాలికలు, మహిళలకు రక్షణ కల్పించడంలో ఎలాంటి రాజీ వద్దన్నారు. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో వాటిని గుర్తించాలని, ఈ ఈ అంశాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకోవాలన్నారు. డ్రగ్స్, నార్కోటిక్స్‌ పంపిణీ లాంటివి సైతం సోషల్‌మాధ్యమాల ద్వారానే జరుగుతున్నాయన్న ముఖ్యమంత్రి.. ప్రత్యేక విభాగాల ఏర్పాటు వల్ల ఇలాంటి వాటిని గుర్తించే వీలుంటుందన్నారు. ఈ విభాగానికి అడిషనల్‌డీజీ స్థాయి అధికారిని అధిపతిగా పెట్టాలని సీఎం నిర్దేశించారు.

సమన్వయంతో పని చేయాలి.. పౌరుల నుంచి నిర్భయంగా రిపోర్ట్‌ చేసేలా ఉండాలని, దీనివల్ల ఫిర్యాదులు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పరిస్థితి పెరుగుతుందన్నారు. మహిళలపై, బాలికలపై వేధింపులు, ఇతరత్రా నేరాల నివారణకు విద్యాశాఖ, మహిళా శిశుసంక్షేమ శాఖతో పోలీసు శాఖ సమన్వయం చేసుకోవాలని, మహిళా పోలీసులు దీంట్లో భాగం కావాలని సీఎం సూచించారు. గ్రామస్థాయిలో వీరు పకడ్బందీగా పనిచేయాలని, దీనివల్ల పోలీసు శాఖకు మంచి పేరు వస్తుందన్నారు.

దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి.. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఒక దిశ పోలీస్‌ స్టేషన్‌ ఉండాలని సీఎం ఆదేశించారు. ఇప్పటివరకూ 18 ఉన్నాయని అధికారులు తెలపగా.. మిగిలిన అన్ని చోట్ల దిశ పోలీస్‌స్టేషన్‌ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మహిళల రక్షణ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడొద్దని స్పష్టం చేసిన సీఎం... అత్యాధునిక ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ను ఒక దాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మాదకద్రవ్యాలను పూర్తిగా నివారించాలన్న సీఎం.. గంజాయి, డ్రగ్స్‌ నివారణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. రవాణా, పంపిణీ, వినియోగంపై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపాలన్నారు. రాష్ట్రంలో ప్రతి యూనివర్శిటీలో, కాలేజీల్లో డ్రగ్స్‌నివారణకు ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌ హోర్డింగ్స్‌పెట్టాలని సీఎం ఆదేశించారు. నార్కోటిక్స్‌ కేసుల్లో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ చాలా ముఖ్యమని, ఈ ప్రక్రియను సీరియస్ గా తీసుకోవాలన్నారు. స్పందన కింద వచ్చే అర్జీల పరిష్కారంలో నాణ్యత ముఖ్యమన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం కిందకు దీన్ని తీసుకు వస్తున్నామని, అర్జీలను, వినతులను అత్యంత నాణ్యంగా పరిష్కరించాలన్నారు.

ఇవీ చదవండి :

Last Updated : May 5, 2023, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.