ETV Bharat / state

డీజీపీ కార్యాలయం ముట్టడికి బీజేపీ పిలుపు.. ఎక్కడికక్కడ నేతల నిర్బంధం

author img

By

Published : Jan 21, 2021, 9:05 PM IST

డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన భాజపా నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కీలక నేతలను ఉదయం నుంచే గృహనిర్బంధంలో ఉంచారు. దేవాలయాల్లో దాడుల వెనుక తమ పార్టీ హస్తముందంటూ డీజీపీ చేసిన ఆరోపణలపై చర్చించేందుకు వెళ్తుంటే.. అడ్డుకోవటం అప్రజాస్వామికమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

bjp leaders house arrest at ap
భాజపా నేతల నిర్బంధం

గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం వద్ద ధర్నా చేసేందుకు వెళ్తున్న భాజపా నేతలను.. పోలీసులు అరెస్టులు చేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా కీలక నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. పలువురు కార్యకర్తలను అరెస్టు చేసి గుంటూరు, విజయవాడలోని స్టేషన్లకు తరలించారు. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేసి.. వాహనాలు తనిఖీలు చేశారు. భాజపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ను.. గన్నవరం విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వచ్చిన భాజపా నేతలు యామినీ శర్మ సహా ఐదుగురిని స్టేషన్‌కు తరలించారు. దైవదర్శనానికి వచ్చిన వాళ్లనూ అరెస్టు చేయటంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని యామినీశర్మ డిమాండ్‌ చేశారు.

జాతీయ రహదారి మీదుగా డీజీపీ కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించిన ఎమ్మెల్సీ మాధవ్‌, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. వైకాపా అధికార ప్రతినిధిగా డీజీపీ మారారని విమర్శించిన భాజపా కార్యకర్తలు విమర్శించారు. గౌతమ్‌ సవాంగ్‌ వెంటనే క్షమాపణ కోరాలని డిమాండ్‌ చేశారు.

సోము వీర్రాజు నివాసం వద్దకు వచ్చిన పోలీసులు.. ఆయన బయటకు రాగానే అడ్డుకుని గృహనిర్బంధంలో ఉంచారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీర్రాజు..డీజీపీ చేసిన ఆరోపణలపై చర్చించేందుకే మంగళగిరి వెళ్లేందుకు యత్నించామన్నారు. భాజపాపై చేసిన ఆరోపణలకు సంబంధించి గౌతమ్‌ సవాంగ్‌ వివరణ ఇవ్వాలని.. లేదంటే తీవ్రస్థాయిలో నిరసనకు దిగుతామని సోము వీర్రాజు హెచ్చరించారు.

భాజపా నేతల నిర్బంధం

ఇదీ చదవండి: షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తాం: ఎస్‌ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.