ETV Bharat / state

No facilities in the grounds: 'ఆటల్లేవ్.. ఆడుకోవడాల్లేవ్.. అయినా ఐపీఎల్ కల'

author img

By

Published : Jun 22, 2023, 3:42 PM IST

No facilities in the grounds: రాష్ట్రంలో క్రీడా మైదానాలు, శిక్షణ వసతులు, ప్రోత్సాహకాలు కరవయ్యాయని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్​లో రాష్ట్రం తరఫున జట్టును ఆడించాలన్న సీఎం నిర్ణయం గొప్పదే కానీ, అంతకుముందు క్షేత్రస్థాయిలో పోరాడుతున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. నాలుగేళ్ల పాలనలో క్రీడల అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోకపోవడాన్ని క్రీడారంగంలోని ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

ఏపీలో క్రీడలకు కొరవడిన ప్రోత్సాహం

No facilities in the grounds: అరకొర వసతులు.. అందుబాటులో లేని క్రీడా పరికరాలు.. వెరసి రాష్ట్రంలో క్రీడలు, క్రీడా మైదానాల పరిస్థితి అధ్వానంగా మారింది. గతంలో క్రీడలకు నిలయమైన ఏపీలో.. ఈ మధ్య ప్రచార ఆర్భాటమే తప్ప క్రీడాకారులకు ప్రోత్సాహాల్లేవు. ఏ మైదానాన్ని చూసినా సదుపాయాల లేమి వెక్కిరిస్తోంది. రుసుముల బాదుడుతో మైదానంలోకి అడుగు పెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి దాపురించింది. క్రీడావికాసం ఏమాత్రం పట్టని ముఖ్యమంత్రి జగన్‌... ఐపీఎల్ జట్టు ఉండాలని ఆశించడం "నేల విడిచి సాము" అన్నట్లు గా ఉందని క్రీడాకారులు, క్రీడాభిమానులు పేర్కొంటున్నారు.

మాటలకే పరిమితం.. 2023 మే 11న విశాఖలో క్రికెట్‌ స్టేడియం వద్ద వైఎస్సార్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌... క్రీడా రంగ అభివృద్ధి గురించి చెప్పుకొచ్చారు. జూన్‌ 15న క్రీడలు, యువజన సర్వీసుల శాఖపై నిర్వహించిన సమీక్షలోనూ ముత్యాల్లాంటి మాటలను పలికారు. "రాష్ట్రంలో క్రీడాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం. భవిష్యత్తులో జాతీయ స్థాయి క్రీడాకారులు మరింత మంది తయారయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఏపీ నుంచి కూడా ఒక ఐపీఎల్‌ టీం ఉండేలా చూడాలి. ప్రతి మండలంలోనూ మైదానాలు ఏర్పాటు చేయాలి. నియోజకవర్గానికో ఇండోర్‌ స్టేడియం ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలి అని వ్యాఖ్యానించారు. నిజమే క్రికెట్, చదరంగం, వెయిట్ లిఫ్టింగ్, టెన్నిస్ క్రీడల్లో అంతర్జాతీయ ఆటగాళ్లను అందించిన ఏపీలో క్రీడాకారులకు కొదవ లేదు. వీవీఎస్‌ లక్ష్మణ్‌, కరణం మల్లీశ్వరి, పీవీ సింధు, కోనేరు హంపి వంటి క్రీడాకారులు మరింత మంది తయారైతే ఏపీ క్రీడా ప్రతిష్ఠ మరింత ఇనుమడిస్తుంది. మరి ఆ దిశగా ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా అంటే శూన్యమే అనే సమాధానమే వినిపిస్తుంది.

సవాలక్ష సమస్యలు... క్రీడారంగంలో ఇతర రాష్ట్రాలు దూసుకెళ్తుంటే ఏపీ స్థాయి రోజురోజుకీ దిగజారిపోతోంది. మైదానాల్లో సదుపాయాల్లేవు. ఆపై కోచ్‌ల కొరత. కొత్త మైదానాల ఊసేలేదు. ఆటగాళ్లకు ప్రోత్సాహకాలూ అంతంత మాత్రమే. క్రీడా సంఘాలకూ సహకారం లేదు. క్రీడాభివృద్ధికి కృషి చేయాల్సిన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాప్‌) ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. వివిధ క్రీడాంశాల్లో శిక్షణను పలు జిల్లాల్లో ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించింది. నామమాత్రపు రుసుములతో శిక్షణ పొందే వారు మైదానాలకు దూరమవుతున్నారు. సీఎం కప్‌ పేరుతో క్రీడా పోటీల నిర్వహణ, జగనన్న స్పోర్ట్స్‌ క్లబ్‌ల ఏర్పాటు, ఆడుదాం ఆంధ్ర వంటి కార్యక్రమాల ఆర్భాటం తప్ప.. ఒరిగేదేమీ లేదని క్రీడాకారులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి క్రీడాకారులు ఎలా తయారవుతారు? ఉన్న స్టేడియాల్లో సదుపాయాలు మెరుగు పరచకుండా నియోజకవర్గానికో ఇండోర్‌ స్టేడియం సాధ్యమేనా? గత ప్రభుత్వ ప్రారంభించిన క్రీడా వికాస కేంద్రాల పనులను పూర్తి చేయమని క్రీడాకారులు కోరుతున్నా ఎందుకు పట్టించుకోరు..?

మైదానాల నిర్వహణ లోపం.. విశాఖలోని కొమ్మాది క్రీడా శిక్షణ కేంద్రం వెలవెలబోతోంది. క్రీడా పరికరాలు పాడై తుప్పుపట్టి పోతున్నాయి. కార్యకలాపాలు నిలిచిపోయి వసతిగృహంలోని సామగ్రి నిరుపయోగమైంది. పరుపులు బూజుపట్టిపోతున్నాయి. జిమ్‌లో విలువైన పరికరాలు దొంగలపాలయ్యాయి. ఉన్నవాటిలో కొన్ని పనిచేయడం లేదు.

ఘనచరిత్ర ఉన్న ఏలూరు ఇండోర్‌ స్టేడియం వసతుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. నిర్వహణ లేక విలువైన వ్యాయామ పరికరాలు మూలకు చేరాయి. బ్యాడ్మింటన్‌ కోర్టులోకి వర్షపు నీరు చేరుతోంది. స్కేటింగ్‌ రింక్‌ పగుళ్లు వచ్చి పెచ్చులు లేచిపోయి కనిపిస్తోంది. చిన్నపాటి వర్షానికే మైదానం బురదమయమవుతోంది. క్రీడాకారులే పారలు చేత పట్టుకుని మైదానాన్ని బాగు చేసుకుంటున్నారు.

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం.. క్రీడలకు తక్కువ, సర్కారీ కార్యక్రమాలకు ఎక్కువగా మారింది. ప్రభుత్వం ఏ ముఖ్యమైన కార్యక్రమానికైనా ఈ స్టేడియాన్నే వేదికగా చేసుకుంటుంది. మే నెలలో యాగం ఇక్కడే నిర్వహించింది. దీంతో క్రీడాకారులతోపాటు పోలీసు, సైనిక ఉద్యోగాలకు సిద్ధమయ్యే వారు అవస్థలు పడుతున్నారు.

విజయనగరం విజ్జీ మైదానంలో రూ.6 కోట్ల వ్యయంతో చేపట్టిన మల్టీ పర్పస్‌ స్టేడియం పనులు 90శాతం పూర్తయ్యాక నిధుల కొరతతో నిలిచిపోయాయి. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం కోటి రూపాయలు విడుదల చేయకపోవడంతో భవనం వృథాగా మారింది. రాజీవ్‌ మైదానంలో కోర్టులు ఉన్నా శిక్షకులు లేరు.

శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి క్రీడా మైదానం ఆధునీకరణ పనులు నత్తను తలపిస్తున్నాయి. జిల్లాల్లో శాప్‌ ఆధ్వర్యంలోని వివిధ మైదానాల్లో శిక్షణ కార్యకలాపాలను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాక రుసుములు భారీగా పెంచడంతో క్రీడాకారుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. కొందరైతే శిక్షణకు దూరమవుతున్నారు.

గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ప్రారంభించిన క్రీడా వికాస కేంద్రాల భవన నిర్మాణ పనుల పూర్తికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కర్నూలు జిల్లాలో నిర్మాణ పనులు 25 శాతమే పూర్తయ్యాయి. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్ నిరుపయోగంగా ఉంది. కిటీకీలు, తలుపులు, అద్దాలు పగులగొట్టారు. రాత్రయ్యేసరికి గంజాయి, మందుబాబులకు అడ్డాగా మారుతోంది.

  • రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఇలాంటి పరిస్థితుల్లో... ఏపీ నుంచి ఐపీఎల్‌ జట్టు ఉండాలని సీఎం అనడం అత్యాశే కదా?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.