AP BJP Criticizes on Power cuts విద్యుత్ ప్రాజెక్టుల దోపిడి ఫలితమే రాష్ట్రంలో ఎడాపెడా కోతలు, సామాన్యులపై బిల్లుల భారం: బీజేపీ అధికార ప్రతినిధి లంక

AP BJP Criticizes on Power cuts విద్యుత్ ప్రాజెక్టుల దోపిడి ఫలితమే రాష్ట్రంలో ఎడాపెడా కోతలు, సామాన్యులపై బిల్లుల భారం: బీజేపీ అధికార ప్రతినిధి లంక
AP BJP Criticizes on Power cuts విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ సరఫరా విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని బీజేపీ విమర్శించింది. మరోవైపు సామాన్యులపై విద్యుత్ బిల్లుల భారం మోపుతున్న ముఖ్యమంత్రి జగన్... తన అనుయాయుల జేబులు నింపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంక దినకర్ ఆరోపించారు.
BJP Criticizes State Government : రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రణాళిక లేక, అపార అవకాశాలు ఉన్నా డిమాండ్‌కు తగ్గ స్థాయిలో విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో విఫలమైందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. విద్యుత్తుశాఖ తీరుతో ప్రజల జేబులకు చిల్లు పడుతుంటే... ముఖ్యమంత్రి అస్మదీయుల జేబులు నింపుకొంటున్నారని ఆక్షేపించింది. ప్రభుత్వం గత నాలుగేళ్లలో రెండు నుంచి మూడు రెట్లు విద్యుత్తు ఛార్జీల భారం మోపిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంక దినకర్ పేర్కొన్నారు. ఈ నెల నుంచి వినియోగదారులపై వేస్తున్న అదనపు భారం దాదాపు 700 కోట్ల రూపాయల పైమాటే ఉందని విమర్శించారు.
ప్రభుత్వం పూర్తిగా విఫలం.. జగన్మోహనరెడ్డి తన అస్మదీయులకు అన్ని రకాల విద్యుత్తు ప్రాజెక్టులన్నీ దోచిపెడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్తు అవసరం, ఉత్పత్తి అంచనా వేయడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని దుయ్యబట్టారు. వాన కాలంలో కూడా తీవ్రమైన కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, నాలుగు సంవత్సరాల్లో 8 సార్లు విద్యుత్ చార్జీలు(Electricity charges) పెంచారని తెలిపారు. ఒక్కో యూనిట్ 26 రూపాయిల చొప్పున మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారని, ఇందులోనూ వేల కోట్ల రూపాయల అవినీతి ఉందని లంక దినకర్ ఆరోపించారు.
బొగ్గు నిల్వల కొరత.. 2022 - 23 సంవత్సరానికి రాష్ట్ర విద్యుత్ వినియోగం దాదాపు 65,830 మిలియన్ యూనిట్లు ఉందన్న దినకర్.. రోజుకు సగటున 180 యూనిట్ల వరకు వినియోగించారన్నారు. 2023 - 24 సంవత్సరానికి ప్రస్తుతం సగటున ప్రతి రోజు రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 258 మిలియన్ యూనిట్లు వినియోగమవుతోందని చెప్పారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు సాధారణంగా విద్యుత్ వినియోగం పెరిగి డిమాండ్ పెరుగుతుందని, ఈ పరిస్థితులలో థర్మల్ పవర్ ఉత్పత్తి పెంచాల్సిన సమయంలో అవసరమైన మేరకు బొగ్గు నిల్వలు ఉంచకపోవడం వల్లే ఆగస్టు మాసం ఉత్పత్తి 67.43 శాతానికి తగ్గిందన్నారు. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద 2 నుండి ౩ రోజులు మాత్రమే బొగ్గు నిల్వలు ఉండడం బాధాకరమని తెలిపారు. వాస్తవానికి థర్మల్ విద్యుత్ కేంద్రం (Thermal power station) వద్ద 17 రోజుల మేరకు బొగ్గు నిల్వలు ఉంచాలని దినకర్ అన్నారు. జల విద్యుత్ ఉత్పత్తి (Hydroelectricity generation) దాదాపు అత్యల్పంగా ఉందన్నారు. అవకాశాలు ఉన్న, ప్రాజెక్టుల కేటాయింపులో NHPC కి అందించాల్సిన ప్రాజెక్టులను పక్కకు మళ్లించి సొంతవారికి కట్టబెట్టే ప్రయత్నంలో సకాలంలో 6,600 మెగావాట్ల ఏడు ప్రాజెక్టులు ఉత్పత్తికి రాకుండా ఆగిపోయాయని ధ్వజమెత్తారు. సౌర విద్యుత్(Solar power) విషయంలో ఒక్కొక్క యూనిట్ 4 రూపాయిలకు కొనుగోలుకు గతంలో ప్రైవేట్ కంపెనీలతో ఉన్న ఒప్పందాలను... జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రద్దు చేసి, మళ్లీ అవే కంపెనీలకు మూడేళ్ల తర్వాత ఇవ్వడం అనేక అవినీతి, అక్రమాలకు తెరలేపినట్లుగా అందరికీ అర్థమవుతోందని దినకర్ పేర్కొన్నారు.
పీపీఏల రద్దు ప్రభావం.. ఎప్పుడో ఉత్పత్తిలోకి రావాల్సిన ప్రైవేట్ సంస్థల విద్యుత్ ఉత్పత్తి (Electricity generation) పీపీఏ ల రద్దుతో ఆలస్యం కావటం వల్ల కూడా విద్యుత్తు కొరత ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. అందుబాటులోకి రావాల్సిన సౌరవిద్యుత్తు రాకపోవటం వల్ల దాదాపు 10 వేల పైగా మెగా వాట్ల విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. ఈ ప్రభావంతోనే యూనిట్ 26 రూపాయిల చొప్పున కొనుగోలు చేసి ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని.... వినియోగదారులకు వస్తున్న విద్యుత్ బిల్లులూ తప్పుల తడకగా ఉంటున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల విద్యుత్ సంస్థల అప్పులు, నష్టాలు ఆకాశాన్ని అంటుతున్నాయని... రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ లోపంతో రూ. 84,183 కోట్ల రూపాయిలకు పైగా అప్పులు, రూ. 29,928 కోట్ల రూపాయిల పైగా నష్టాలు చవిచూస్తున్నాయని దినకర్ తెలిపారు.
