అర్హత ఉన్నా అమ్మ ఒడి పథకానికి నోచుకోలేకపోయానని.. అధికారులు తనకు న్యాయం చేయాలని కృష్ణా జిల్లా కైకలూరు మండలం దొడ్డిపట్ల జడ్పీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని చిన్నం లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని సీతనపల్లి గ్రామానికి చెందిన ఈ బాలిక తల్లిదండ్రులు నిరుపేదలు. దినసరి కూలికి వెళితే తప్ప పూట గడిచే స్థితిలో ఉన్నా.. కుమార్తెకు తమ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారు. గత ఏడాది రేషన్ కార్డు సాంకేతిక లోపంతో జారీ కాకపోవడంతో ప్రస్తుత ఏడాది అన్ని ధ్రువ పత్రాలు అందించారు.
మంజూరు పత్రంలో తొలి వరసలోనే పేరు నమోదైంది. విద్యార్థినికి 92 శాతం హాజరు కూడా ఉంది. అధికారులు మాత్రం హాజరు సరిపోలేదనే కారణం చూపుతూ అమ్మఒడి నగదు జమ చేయలేదు. సమస్య పరిష్కారం తమ పరిధిలో లేదని పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు. స్పందనలో ఫిర్యాదు చేసినా ఇంతవరకూ పరిష్కారం లభించలేదంటున్నారు విద్యార్థిని తల్లి లలిత. ఉన్నతాధికారులు శ్రద్ధ చూపి పేదింటి విద్యాకుసుమానికి పథకం వర్తింపజేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: