ETV Bharat / state

Godavari floods గోదావరిలో మళ్లీ పెరుగుతున్న వరద, లంక గ్రామాల్లో భయం భయం

author img

By

Published : Aug 17, 2022, 7:40 PM IST

Updated : Aug 17, 2022, 8:47 PM IST

Godavari flood
గోదావరికి మళ్లీ వరద ఉద్ధృతి

Godavari River గోదావరిలో మళ్లీ వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వరద పోటెత్తుతుండటంతో కోనసీమ లంక గ్రామాల వాసును భయం వెంటాడుతోంది. ఇప్పటికే ఒక సారి తీవ్రంగా నష్టపోయిన బాధితులు ఇప్పుడు మళ్లీ వరద పెరుగుతుండడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు.

Godavari Flood: కొద్దిరోజులాగా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను నిద్రలేని రాత్రులు మిగిల్చిన గోదారమ్మ మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో... గోదావరికి మరోసారి వరద ఉద్ధృతి పెరిగింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీచేసినట్లు అధికారులు తెలిపారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యల కోసం ఎన్డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాలను సిద్ధం చేశారు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు.. ఇటీవలి వరదలకు అతలాకుతలమయ్యాయి. పలు గ్రామాల్లో ఇప్పటికీ పరిస్థితులు కుదుటపడలేదు. ముమ్మిడివరం మండలంలోని 8 లంక గ్రామాలలో.. వేల ఎకరాల్లోని కొబ్బరి, అరటి, బత్తాయి తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొబ్బరిలో అంతర పంటగా వేసిన బత్తాయి, నారింజ పూర్తిగా రంగు మారిపోయాయి. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ వరద ఉద్ధృతి పెరగుతుండడంతో.. లంక గ్రామాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం గోకవరపుడ గ్రామ ప్రజలు.. ముంపు పరిహారం అందించలేదని ఆందోళనకు దిగారు. వరద నష్టానికి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి పరిహారమూ ఇవ్వలేదని వాపోయారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన తమను.. పట్టించుకునే నాథుడే లేడంటూ గోదావరి నీటిలో దిగి నిరసన తెలిపారు. ఉప్పు, పప్పు, బియ్యం తమకు అవసరం లేదని.. పరిహారం అందిస్తే చాలని బాధితులు కోరుతున్నారు.

Bhadrachalam Flood: గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద 44 అడుగులకు చేరటంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. బుధవారం మధ్యాహ్నంకల్లా 55 అడుగులకు చేరే అవకాశాలు ఉన్నట్లు అక్కడి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అన్నట్లుగానే ప్రస్తుతం 54.6 అడుగుల నీటిమట్టం ఉంది.

గోదావరి ఎగువ ప్రాంతం తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, ఇంద్రావతి, ప్రాణహిత, కిన్నెరసాని, తాలిపేరు, శబరి వంటి ఉప నదులు పొంగిపొర్లుతుండటంతో నదిలో ప్రమాదకర స్థాయిని మించి ప్రవాహం కొనసాగుతోంది.

మళ్లీ జల దిగ్బంధంలోకి గ్రామాలు... వరద ప్రభావంతో విలీన మండలాల్లోని గ్రామాలు మళ్లీ జల దిగ్బంధనంలోకి చేరుకున్నాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని రహదారులు నీట మునగడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉద్ధృతి నుంచి ఇప్పుడిప్పుడే గ్రామాలు కోలుకుంటుండగా, మళ్లీ మరోసారి వరద పోటెత్తటం, బాధితులకు ఆందోళన కలిగిస్తోంది. రుద్రంకోట వరద బాధితులు 25 రోజులుగా గుట్టపై తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. ఈ సమయంలో తిరిగి వరద పెరుగుతుందన్న సమాచారం వారికి నిద్ర లేకుండా చేస్తోంది.

గోదావరికి మళ్లీ వరద ఉద్ధృతి

ఇవీ చదవండి:

Last Updated :Aug 17, 2022, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.