ETV Bharat / state

పాఠశాల బస్సుకు ప్రమాదం... ఊడిన ఆర్టీసీ బస్సు చక్రం

author img

By

Published : Oct 21, 2022, 12:24 PM IST

కోనసీమ జిల్లాలో వేరువేరు చోట్ల రెండు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఒకచోట పాఠశాల బస్సు, లారీ ఢీకొనగా.. మరో చోట ఆర్టీసీ బస్సు చక్రం ఊడిపోయింది. పాఠశాల బస్సు ఘటనలో ఐదుగురు విద్యార్థులకు గాయాలుకాగా.. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

Accidents to two buses
కోనసీమ జిల్లాలో బస్సు ప్రమాదాలు

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్​ కోనసీమ జిల్లా మలికిపురం మండలం దిండిలో నరసాపురానికి చెందిన ప్రైవేటు పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. స్థానిక రీసార్ట్ రోడ్డులో వేగంగా వచ్చిన పాఠశాల బస్సు వెనుక నుంచి ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్​ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ప్రయాణిస్తుండగా ఐదుగురు విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. బస్సులో సఖినేటిపల్లి, మలికిపురం మండలాలకు చెందిన విద్యార్థులున్నారు. వెంటనే స్థానికులు... విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసంకాగా ఇటుకల ట్రాక్టర్ బోల్తా కొట్టింది. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం శ్రీ కనకదుర్గమ్మ ఆలయ కూడలిలో ఆర్టీసీ బస్సు చక్రం ఊడిపోయి పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం రాజోలు నుంచి అంతర్వేది వెళ్తున్న ఆర్టీసీ బస్సు మలికిపురంలోని కనకదుర్గమ్మ గుడి సమీపంలో ముందు భాగంలోని చక్రం విరిగిపడింది. ప్రమాద సమయంలో ముగ్గురు ప్రయాణికులు మాత్రమే బస్సులో ఉన్నారు. ఎవరికి ఏమీ కాలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అధ్వానంగా ఉన్న రహదారులు...కాలం చెల్లిన బస్సులతో నిత్యం ఏదోఒక మూలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.