ETV Bharat / state

యూనివర్సిటీ వీసీల స్వామి భక్తి - విద్య కంటే వైసీపీ వీరవిధేయతకే ప్రాధాన్యం!

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2023, 9:02 AM IST

Updated : Dec 9, 2023, 11:20 AM IST

YSRCP Political Activities in Universities: రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు జగన్‌ ప్రభుత్వం రాజకీయ చెద పట్టించింది. సరస్వతి నిలయాలను రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చి భ్రష్ఠు పట్టించింది. అధికార పార్టీ నాయకుల పైరవీలతో ఉపకులపతులను నియమించడం అలా వచ్చిన వీసీలు విద్యను, విద్యార్థులను పట్టించుకోకుండా స్వామిభక్తిని చాటుకునేందుకు పార్టీ నాయకుల్లా వ్యవహరించడం రాష్ట్రంలో పరిపాటిగా మారింది. కొందరు వీసీల ప్రవర్తనతో చివరికి విశ్వవిద్యాలయాల్లో చదివేందుకు విద్యార్థులు కూడా ఆసక్తి చూపని దుస్థితి రాష్ట్రంలో నెలకొంది.

YSRCP_Political_Activities_in_Universities
YSRCP_Political_Activities_in_Universities

యూనివర్సిటీ వీసీల స్వామి భక్తి - విద్య కంటే వైసీపీ వీరవిధేయతకే ప్రాధాన్యం!

YSRCP Political Activities in Universities : ఆయన గ్రేటర్‌ విశాఖపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపిక కోసం విద్యార్థులతో సర్వేలు చేయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని అన్ని డిగ్రీ కళాశాలల కరస్పాండెంట్లు, కార్యదర్శులు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ అభ్యర్థికి ఓటు వేయాలన్నారు. ఈయన ఏదో పార్టీకి చెందిన నేత కావొచ్చనుకుంటున్నారామో కాదు, కాదు. ఆయన ప్రఖ్యాతిగాంచిన ఆంధ్రావర్సిటీ తాజా మాజీ ఉపకులపతి ప్రసాదరెడ్డి.

Universities Situation under CM Jagan Ruling : ఇంకొకాయన విద్యార్థులతో గొడవపడి విశ్వవిద్యాలయంలో వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటు చేశారు. వారం రోజుల్లో పదవి వీడతాననగా ఆగమేఘాలపై దాన్ని ప్రాంగణంలో ఆవిష్కరించారు. అడ్డువచ్చిన విద్యార్థులను అరెస్టు చేయించారు. ఈ పని చేసింది బయటి నుంచి వచ్చిన వైసీపీ నేత అనుకుంటారామో కానే కాదు. స్వయానా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పని చేసిన రామకృష్ణారెడ్డి.

Political Events at Andhra Pradesh Universities : ఈయన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వైసీపీ పాటకు విద్యార్థులతో నృత్యం చేయించారు. వైసీపీ ప్లీనరీ నిర్వహణ కోసమని విద్యార్థుల పరీక్షలను వాయిదా వేసి మరీ. వర్శిటీకి సెలవులు ఇచ్చారు. ఈ ఘనత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజశేఖర్‌ది.

Politics in AP Universities: విశ్వవిద్యాలయ పాలకవర్గాల స్వామిభక్తి.. ఏకంగా సీఎం పుట్టిన రోజు వేడుకలు

Andhra Pradesh Universities VCs Behavior Like Politicians : అందరికంటే ఘనుడు పుట్టినరోజులంటే వైఎస్సార్‌, జగన్‌లాంటి వారివేనా, అమకున్నారేమో, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు మోహిత్‌రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అభినయ్‌రెడ్డిల పుట్టిన రోజు వేడుకలనూ వర్సిటీలో ఘనంగా నిర్వహించారు. వర్సిటీల్లో పెద్దపెద్ద బ్యానర్లు కట్టి, భారీ కేకులు కోసి, బాణాసంచా కాల్చారు. ఈ వీరవిధేయుడు శ్రీ వేంకటేశ్వర వర్శిటీ ఉపకులపతి కుర్చీవీడిన రాజారెడ్డి. ఇదీ రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లోని పరిస్థితి. ప్రతిష్ఠాత్మక ఉపకులపతి పదవుల్లోని ఆచార్యుల దిగజారిన స్థితి.

వైసీపీ నేతల సూచనలతో వీసీలు నియామకం : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి ఇటీవలిదాకా వీసీగా చేసిన రామకృష్ణారెడ్డి పదవీకాలం పూర్తయి వెళ్లిపోతే వర్సిటీకి పట్టిన దరిద్రం వదిలిందంటూ విద్యార్థులు పరిపాలన భవనాన్ని పసుపు నీటితో శుద్ధి చేసి, బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆంధ్రా వర్శిటీ మాజీ వీసీ ప్రసాదరెడ్డికి మరోసారి పదవి ఇవ్వొద్దని డిమాండ్‌ చేస్తున్నారంటే ఆయన సాగించిన రాజకీయ దమనకాండ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

రాష్ట్రంలో ప్రధానమైన ఆంధ్రా వర్శిటీకి ఎంపీ విజయసాయిరెడ్డి సిఫార్సు చేసిన ప్రసాదరెడ్డిని, శ్రీవేంకటేశ్వర వర్సిటీకి మంత్రి పెద్దిరెడ్డి సూచించిన రాజారెడ్డిని, శ్రీకృష్ణదేవరాయకు సీఎం జగన్ సోదరుడు ఎంపీ ఆవినాష్ రెడ్డి సిఫార్సు చేసిన రామకృష్ణారెడ్డిని, విక్రమసింహపురికి సీఎం జగన్ బందువు క్రిస్టోఫర్ భార్య సుందరవల్లిని, ఆచార్య నాగార్జున వర్సిటికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచనతో రాజశేఖర్‌ను వీసీలుగా నియమంచారు. ప్రసాదరెడ్డి, రాజారెడ్డి, రామకృష్ణారెడ్డిల పదవీకాలం గత నవంబరు 24తో పూర్తయింది.

ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడం కాదు..! రాజకీయాలకు కేంద్రాలుగా.. యూనివర్సిటీలు..!

వీసీ వైసీపీ నేతగా అవతారం : ప్రొఫెసర్ PVGD ప్రసాదరెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీగా పని చేసిన సమయంలో వర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలుత ఆయనకు తాత్కాలిక వీసీగా బాధ్యతలు అప్పగించారు. ఎంపీ విజయసాయి రెడ్డి అండతో ఆయన వీసీగా కాకుండా పూర్తిస్థాయి వైసీపీ నాయకుడిగా వ్యవహరించారు. గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల ముందు ఆయన సామాజికవర్గం ప్రతినిధులు నిర్వహించిన సమావేశానికి ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ప్రసాదరెడ్డి హాజరయ్యారు. 2021లో GVMC ఎన్నికల సమయంలో వైకాపా అభ్యర్థులు ఎంపిక చేసేందుకు ప్రసాదరెడ్డి విద్యార్థులతో సర్వే చేయించారు. అనంతరం వర్సిటీలో వైసీపీ నాయకులు, అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు.

వర్సిటీలో వైఎస్సార్ ఫైబర్ విగ్రహం : ఏటా వర్సిటీలో వైఎస్ రాజశేఖరరెడ్డి, సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిల పుట్టినరోజు వేడుకలు, వైసీపీ ఆవిర్భాన దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రసాదరెడ్డి రెక్టార్​గా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించారు. కొద్దిరోజుల తర్వాత పరిపాలనా విభాగం పక్కన ప్రధాన ద్వారం వద్ద వైఎస్సార్ ఫైబర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. వర్శిటీ చరిత్రలో రాజకీయ నాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అదే తొలిసారి. వీసీగా పదవీకాలం పూర్తయ్యే ముందు పాత విగ్రహాన్ని తొలగించి వైఎస్‌ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు ఓ ప్రైవేట్‌ కళాశాలల అధినేత 20 లక్షల విరాళంగా ఇచ్చారు. మరోసారి వీసీ పదవిని దక్కించుకునే ప్రయత్నంలో భాగంగానే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారనే విమర్శలున్నాయి.

ప్రచార కర్తలుగా సిబ్బంది : ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ప్రసాదరెడ్డి, అప్పటి రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్‌తో కలిసి విశాఖలోని హోటల్లో ఉత్తరాంధ్రలోని అన్ని డిగ్రీ కళాశాల కరస్పాండెంట్లు, కార్యదర్శులు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. దీనికి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్, ఉత్తరాంధ్ర వైకాపా ఇన్‌ఛార్జ్‌ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. అన్ని కళాశాలల గ్రాడ్యుయేట్లు, సిబ్బంది సీతంరాజు సుధాకర్‌కు ఓటేయాలని వైసీపీ అభ్యర్థి తరపున ప్రసాదరెడ్డి, కృష్ణమోహన్ ప్రచారం చేశారు. దీనిపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రసాదరెడ్డిపై గవర్నర్‌కు పలుమార్లు ఫిర్యాదులు వెళ్లాయి.

వర్శిటీలో మృత్యుంజయ హోమం కోసం చందాలు : శ్రీకృష్ణదేవరాయ వర్శిటీ వీసీగా రామకృష్ణారెడ్డి అక్రమాలను న్యాయ విద్య విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని ఏకంగా ఆ కోర్సునే రద్దు చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో రద్దు నిర్ణయంపై వెనక్కి తగ్గారు. వర్శిటీలో మృత్యుంజయ హోమం నిర్వహించాలని ఉద్యోగులతో చందాలు వసూలు చేయించారు. విమర్శలు రావడంతో దీన్ని విరమించుకున్నారు. చందాల డబ్బులకు మాత్రం లెక్కలు లేకుండాపోయాయి.

వైసీపీ నాయకుల, వారి తనయుల పుట్టినరోజు వేడుకలు : వీసీగా రాజారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించి దిగిపోయేదాకా శ్రీవెంకటేశ్వర వర్శిటీని వైసీపీ నేతల పుట్టినరోజు వేడుకల ఫంక్షన్‌ హాల్‌గా మార్చేశారు. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ల తనయుల పుట్టినరోజు వేడుకలకు వర్సిటీని వేదికగా మార్చేశారు. వర్సిటీల్లో తాత్కాలిక, రోజువారీ వేతనంతో కూడిన నియామకాలను చేపట్టకూడదని ఉన్నత విద్యాశాఖ నవంబరు 11న ఉత్తర్వులు ఇచ్చింది. ఒకవేళ అవసరం అయితే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సూచించింది. ఈ ఆదేశాలను పక్కన పెట్చిన రాజారెడ్డి, రిజిస్ర్టార్‌ మహమ్మద్‌హుస్సేన్‌, వారి హయాంలో 100 మంది తాత్కాలిక ఉద్యోగులు, 150 మంది పొరుగు సేవల సిబ్బంది, 50 మంది అతిథి అధ్యాపకులను నియమించారు. వీరిలో చాలా మంది అధికార పార్టీ నాయకుల సిఫార్సు ఉన్న వారేనని ఆరోపణలున్నాయి.

స్వామి భక్తి చాటుకోవడం కోసం వర్సిటీకి సెలవులు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ రాజశేఖర్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అదికార పార్టీ నాయకుడిలా వర్శిటీల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వీసీగా స్వీకారోత్సవం సందర్భంగా జై జగన్‌ అంటూ ఆయనే నినాదాలు చేశారు. వర్సిటీలో వైఎస్సార్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వర్శిటీలో మూడు రాజధానులకు అనుహలంగా ర్యాలీ నిర్వహించారు. అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును ప్రభుత్వం 65 ఏళ్లకు పెంచిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, సీఎం జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా వర్సిటీలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి, సీఎం జగన్ ఫ్లెక్సీతో ర్యాలీ నిర్వహించారు.

ప్రధాన ద్వారం వద్ద సీఎం అనుకూలంగా నినాదాలు చేశారు. అక్కడే జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు తీసిపోని విధంగా నినాదాలు చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వైకాపా పాటకు విద్యార్థులతో నృత్యం చేయించారు. వైఎస్‌ వర్థంతి, జయంతి, జగన్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిల పుట్టినరోజులను పురస్కరించుకుని వర్సిటీ వద్ద భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైసీపీ ప్లీనరీ ANUను పార్కింగ్‌ స్థావరంగా మార్చేశారు. విద్యార్థుల పరీక్షలను వాయిదా వేసి, మరీ వర్సిటీకి సెలవులు ఇచ్చారు.

రాజకీయ వివాదాలకు నిలయంగా రిజిస్ట్రార్‌ : అధికార పార్టీ అండతో ద్రవిడ పర్సిటీ రిజిస్ట్రార్‌గా నియమితులైన వేణుగోపాలరెడ్డి ఆది నుంచి రాజకీయ వివాదాలకు నిలయంగా మారారు. అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును పెంచినందుకు జగన్‌ చిత్రపటానికి స్వయంగా రిజిస్ర్టారే క్షీరాభిషేకం చేశారు. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో ఎన్నికల నియమావళి అమలులో ఉండగా రిజిస్ట్రార్ వేణుగోపాలరెడ్డి ఏకంగా వైసీపీ ప్రచార సభావేదికపైకి వెళ్లి మంత్రి పెద్దిరెడ్డి చెవిలో గుసగుసలాడారు.

అంతేకాదు పొరుగు సేవల ఉద్యోగులను రెగ్యురల్‌ చేస్తామని నమ్మించి కుప్పం మున్సిపల్‌ ప్రచార సభకు తీసుకొచ్చి వారికి మంత్రి పెద్దిరెడ్డితో హామీ ఇప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రెండేళ్ల పాటు వర్సిటీలో గ్రానైట్ అక్రమ మైనింగ్ మైనింగ్ చేశారు. ఈ వ్యవహారం వెనుక నియోజకవర్గానికి చెందిన ఓ కీలక నేత నెలకు 3 లక్షల చొప్పున వసూలు చేసినట్లు అప్పట్లో ప్రచారం సాగింది.

పరిపాలన భవనానికి రాజశేఖరరెడ్డి పేరు : సీఎం జగన్ బంధువు విక్రమ సింహపురి వర్సిటీ వీసీ సుందరవల్లి ప్రతి ఏడాది వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి, వర్థంతిలను వర్సిటీలో నిర్వహిస్తున్నారు. ఏకంగా పరిపాలన భవనానికి రాజశేఖరరెడ్డి పేరును పెట్టారు. ఈ భవనాలపైన శిలువను పోలిన నిర్మాణం చేపట్టం పైనా విమర్శలున్నాయి.

అక్కడ కూడా వైఎస్సార్​ విగ్రహమే.. మరి ఎవరిది తీశారో తెలుసా??

Last Updated : Dec 9, 2023, 11:20 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.