ETV Bharat / state

బడుగు వర్గాలకు భారీ షాక్​.. ఉచితం నుంచి 3 లక్షల 93 వేల కనెక్షన్లు తొలగింపు

author img

By

Published : Dec 21, 2022, 6:51 AM IST

Updated : Dec 21, 2022, 12:51 PM IST

SC ST Electricity Charges Issue in AP: ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం విద్యుత్‌ షాక్‌ ఇచ్చింది. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకం నుంచి.. దాదాపు 3 లక్షల 93 వేల కనెక్షన్లు తొలగించింది. జగ్జీవన్‌ జ్యోతి పథకం నిబంధనల మేరకు అర్హతలున్న వారికీ కోత పెట్టేసింది. ఉచిత విద్యుత్‌ పథకం నుంచి ప్రభుత్వం తమను ఎందుకు తీసేసిందో తెలియడం లేదని.. కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నామని బాధితులు వాపోతున్నారు.

SC ST Electrical Bills
SC ST Electrical Bills

SC ST Electricity Charges Issue in AP: "బడుగు వర్గాలకు 50 యూనిట్ల వరకు విద్యుత్‌ను మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం ఉచితంగా ఇస్తోంది. దీనివల్ల కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్‌ కొడుతున్నాయి. చంద్రబాబు సీఎం కాకముందు నెలకు 150 బిల్లు వస్తుంటే.. ఇప్పుడు 500 దాటుతోంది. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. దీనికి నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేస్తున్నాం”.. ఇదీ 2017 మార్చి 7న ప్రతిపక్ష శాసనసభలో నేతగా జగన్‌ చేసిన వ్యాఖ్యలు. కానీ అధికారంలోకి వచ్చాక అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఉచిత విద్యుత్‌ పథకానికే తూట్లు పొడుస్తున్నారు.

జగ్జీవన్‌ జ్యోతి పథకం కింద రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు నెలకు 200 యూనిట్ల వరకు ఇచ్చే విద్యుత్‌ పథకంలోని లబ్ధిదారుల సంఖ్యకు.. ప్రభుత్వం భారీగా కోత పెట్టింది. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల 47 వేల కనెక్షన్లకు లబ్ధి చేకూరుతోంది. వీటిలో అనర్హమైనవి గుర్తించడానికి మే నెలలో సర్వే చేయించింది. వివిధ కారణాలతో 3 లక్షల 93 వేల కనెక్షన్లు అనర్హులవిగా తేల్చింది. దీనివల్ల మొత్తం లబ్ధిదారుల్లో పదిహేడున్నర శాతం ఉచిత విద్యుత్‌కు దూరమయ్యారు. ఆపై ప్రతినెలా వారు వాడిన కరెంటుకు బిల్లులు జారీ అవుతున్నాయి. తొలగించిన వారిలో నిజంగా అనర్హులుంటే.. ప్రభుత్వ చర్యలను తప్పుబట్టలేం. కానీ జగ్జీవన్‌ జ్యోతి పథకం నిబంధనల మేరకు అర్హతలున్న చాలా మంది.. ప్రతినెలా బిల్లు చెల్లించాల్సి వస్తోంది. దీన్నిబట్టి చూస్తే సర్వేలోనే లోపం ఉన్నట్లు అర్థమవుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం ఎస్టీ కాలనీలో పరిస్థితిని పరిశీలించగా.. ఐదారు నెలలుగా బిల్ల్లులు వస్తున్నాయని బడుగు జీవులు చెప్పారు. తమను ఎందుకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడం లోదే తెలియడం లేదని వాపోయారు.

బడుగు వర్గాలకు భారీ షాక్​.. ఉచితం నుంచి 3 లక్షల 93 వేల కనెక్షన్లు తొలగింపు

ఉచిత విద్యుత్‌కు అర్హతలున్నా కొందరికి బిల్లులు రావడాన్ని బట్టి.. సర్వే పారదర్శకత ప్రశ్నార్థకంగా మారింది. సర్వే పేరిట లబ్ధిదారులను ప్రభుత్వం ఎడాపెడా తొలగించిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు వెళ్లి సర్వే సిబ్బంది వివరాలు సేకరించకపోవడంతో.. ఏం జరిగిందన్నదీ చాలా మందికి తెలియలేదు. మంగళగిరి మండలం ఎస్టీ కాలనీలో ఓ ఇంటి కనెక్షన్‌కు ఆధార్‌ నెంబరు అనుసంధానం లేదని పథకం నుంచి తొలగించారు. ఆధార్‌ నెంబరు లేకుండా గతంలో కనెక్షన్‌ ఎలా ఇచ్చారో తెలియదు. ఆరు నెలల కిందటి వరకు రాని కరెంటు బిల్లు.. ఇప్పుడెందుకు వస్తుందని లబ్ధిదారుడు ఆవేదన చెందుతున్నారు.

కొన్నిచోట్ల పెళ్లయ్యాక తండ్రి ఇంట్లోనే వేరే కాపురం ఉంటున్న వారికీ పథకం వర్తించడం లేదు. నెలవారీ విద్యుత్‌ వాడకం 200 యూనిట్లలోపే ఉన్నవారికీ బిల్లు వస్తోంది. ఒక వ్యకి పేరిట ఉన్న విద్యుత్‌ కనెక్షన్‌కు.. అతని ఆధార్‌ నెంబరు మాత్రమే అనుసంధానించాలి. కానీ విద్యుత్‌ శాఖ నిర్వాకంతో ఎస్సీ, ఎస్టీల ఆధార్‌ నెంబర్లను ఇతరుల కనెక్షన్లకు లింకు పెట్టారు. అంతేకాదు.. మూణ్నాలుగు కనెక్షన్లతో ఒకే ఆధార్‌ నెంబరు ముడిపెట్టేశారు. ఇలా ఆధార్‌ అనుసంధానంలో దొర్లిన తప్పులతో.. నిజమైన అర్హులు కూడా ప్రభుత్వ ప్రయోజనాన్ని కోల్పోతున్నారు. ఈ విషయం తెలియని లబ్ధిదారులు.. 200 యూనిట్లలోపు కరెంటు వాడుకున్నప్పటికీ బిల్లులు చెల్లిస్తున్నారు.

సామాన్యుల ఇంట్లో ఒక ఫ్యాన్, రెండు-మూడు లైట్లు, టీవీ వాడకం సర్వసాధారణం. వీరికి నెలవారీ విద్యుత్‌ వినియోగం 150 నుంచి 170 యూనిట్ల మధ్య ఉంటుందని అంచనా. ఒకవేళ పెరిగినా, మీటర్‌ రీడింగ్‌ నమోదు ఆలస్యమైనా.. 200 యూనిట్లు దాటే అవకాశం ఉంది. దీనివల్ల రీడింగ్‌ 201 యూనిట్లుగా నమోదైతే.. ఆ ఒక్క యూనిట్ దెబ్బకు కరెంట్ బిల్లు ఏకంగా 945రూపాయలకు పెరుగుతుంది. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ను 200 యూనిట్లకు పెంచుతూ వైకాపా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనివల్ల 2లక్షల 82 వేల కనెక్షన్లకు అదనంగా లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. లబ్ధిదారుల ఆధార్, మొబైల్‌ నెంబరు, కుల ధ్రువీకరణ పత్రం ఆధారంగా జాబితా రూపొందించాలని.. 91, 94 జీవోల్లో పేర్కొంది. కానీ సర్వే చేసి 3 లక్షల 43 వేల కనెక్షన్లు తొలగించింది.

అర్హతలు ఉన్నా ఉచిత విద్యుత్‌ సదుపాయం వర్తించకుంటే.. సంబంధిత అధికారులను సంప్రదించాలని ఇంధనశాఖ కార్యదర్శి విజయానంద్‌ అన్నారు. అధికారులకు ఆధార్, కుల ధ్రువీకరణపత్రాలు అందించాలని సూచించారు. వాటిని పరిశీలించి ఎక్కడ లోపముందో గుర్తించి సవరిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో గుర్తించిన అనర్హులకు మాత్రమే ఉచిత విద్యుత్‌ నిలిపేసినట్లు వివరించారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 21, 2022, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.