ETV Bharat / state

Three Policemen Suspended: గంజాయి బస్తా మిస్.. ముగ్గురు పోలీసులపై వేటు

author img

By

Published : May 11, 2023, 12:24 PM IST

Three Policemen Suspended in the Case of Ganja Missing: పోలీసులు పట్టుకున్న గంజాయి మిస్ అవ్వడంతో.. గుంటూరు జిల్లా మంగళగిరిలో ముగ్గురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. అసలు గంజాయి బస్తా ఎలా మిస్ అయింది.. ఇంతకు ఏం జరిగింది..?

Policemen Suspended
పోలీసుల సస్పెన్షన్

Three Policemen Suspended in the Case of Ganja Missing: గంజాయిని ఎవరైనా అక్రమంగా తరలిస్తే.. ఎంతో అప్రమత్తంగా ఉండి వారిని పట్టుకోవలసిన పోలీసులే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దొంగ చేతికే ఇంటి తాళం ఇచ్చినట్టు.. పట్టుకున్న గంజాయిని మార్చేందుకు ఆ పనిని కాస్తా నిందితులకు అప్పజెప్పారు. ఇంకేం ఉంది వాళ్లు ఆ బస్తాలలో నుంచి ఒక దానిని పక్కకు తరలించారు. తీరా ఈ విషయం బయటకు రావడంతో విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారిని సస్పెండ్ చేశారు.

ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే?: పోలీసుల దాడులలో దొరికిన గంజాయిని రక్షించాల్సిన వారే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ముగ్గురు రక్షక భటులు సస్పెన్షన్​కు గురయ్యారు. గత నెలలో గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్​లో గంజాయి బస్తా స్థానికులకు దొరికింది. దీంతో మంగళగిరి పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. బస్తాపై క్రైమ్ నెంబర్ ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అంతలోనే ఈ వార్త సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ ప్రత్యేక దృష్టి సారించారు.

కొంత తగులబెట్టారు.. కొంత నిల్వ ఉంచారు: గత రెండేళ్లుగా మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో దాదాపు 2 వేల కిలోలకు పైగా గంజాయిని పట్టుకున్నారు. ఇటీవలే కొంత గంజాయిని తగులబెట్టారు. మరికొంత గంజాయిని స్టేషన్లో నిల్వ ఉంచారు. స్టేషన్​లో బస్తాలు మార్చేందుకు గానూ.. వివిధ కేసులలో స్టేషన్​లో ఉన్న కొంతమంది నిందితులకు ఈ పనిని అప్పగించారు. వీరిలో ముగ్గురు వ్యక్తులు.. ఇదే అదునుగా భావించి ఓ గంజాయి బస్తాను స్టేషన్ బయటకు తీసుకెళ్లారు. దీనిని వేరే ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆ నిందితులు.. బస్టాండ్ సమీపంలోకి వెళ్లిన తర్వాత పోలీసుల అలజడిని గమనించి ఆ గంజాయి బస్తాను అక్కడే వదిలేశారు. గంజాయి వాసన రావడంతో దానిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సామాజిక మాధ్యమాలలో వైరల్: బస్టాండ్ పట్టణ స్టేషన్ పరిధిలో ఉండటంతో ఇంత పట్టపగలు గంజాయి ఎక్కడ్నుంచి వచ్చిందంటూ పోలీసులు మళ్లగుల్లాలు పడ్డారు. ఈ గంజాయి విషయం కాస్తా.. సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. గంజాయి బస్తా మిస్సింగ్ వార్త సామాజిక మాధ్యమాలలో రావడంతో.. దీనిపై ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల 25వ తేదీన రెండు స్టేషన్​లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిదంటూ పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో బాధ్యులైన ఎస్సై రమేష్ బాబుతో పాటు హెడ్ కానిస్టేబుల్ బ్రహ్మయ్య, మరో కానిస్టేబుల్ సదాశివరావులను సస్పెండ్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.