ETV Bharat / state

కరోనా మృతుల కుటుంబాలకు ఎక్స్​ గ్రేషియా చెల్లించాలని.. రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నిరసనలు

author img

By

Published : Jun 18, 2021, 6:27 PM IST

కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, ఆక్సిజన్​ కొరతతో చనిపోయిన వారికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని తెదేపా నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పరిహారం అందిచలేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Tdp protests
తెదేపా నిరసనలు

కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నాయకులు నిరసన తెలిపారు. కరోనాతో చనిపోయిన వారికి రూ.10 లక్షలు, ఆక్సిజన్​ కొరతతో చనిపోయిన వారికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు.

గుంటూరు జిల్లా..

కరోనాతో మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబులు వినతి పత్రం అందజేశారు. పరిహారం అందిచలేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

కృష్ణా జిల్లా..

కరోనా బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ విజయవాడ సబ్ కలెక్టర్​కు తెదేపా నాయకులు వినతి పత్రం అందజేశారు. ఆక్సిజన్ మరణాలు అన్ని ప్రభుత్వ వైఫల్యాల కారణంతోనే జరిగాయన్నారు. చంద్రన్న బీమా పథకం అమలులో ఉంటే మరణించిన వారి కుటుంబాలకు రూ.ఐదు లక్షల నష్టపరిహారం వచ్చేదన్నారు. వైకాపా ప్రభుత్వం బాధితులకు నేటి వరకు కనీసం ఒక రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు.

నెల్లూరు జిల్లా

కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, ఆక్సిజన్​ కొరతతో చనిపోయిన వారికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని నెల్లూరు జిల్లాలో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. బ్లాక్ ఫంగస్ మృతుల కుటుంబాలకు 20లక్షలు.. కరోనాతో ఉపాధి కోల్పోయిన పేదలకు రూ.10 వేలు చెల్లించాలని ఆత్మకూరు ఆర్డివోకు నేతలు వినతి పత్రం అందజేశారు.

అనంతపురం జిల్లా..

కరోనా వైరస్ ప్రభావంతో మృతిచెందిన కుటుంబాలకు తక్షణమే రూ.పదిలక్షల పరిహారం అందజేయాలని అనంతపురం జిల్లాలో తెలుగుదేశం నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ మధుసూదన్​కు వినతి పత్రం ఇచ్చారు. కదిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

కడప జిల్లా..

కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కడప జిల్లాలో తెదేపా నాయకులు నిరసన తెలిపారు. కరోనా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం.. ఆక్సిజన్ కొరతతో మృతి చెందిన వారికి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

విశాఖ జిల్లా..

కరోనా వైరస్ కారణంగా సంభవించిన మరణాలన్నీ ప్రభుత్వ హత్యలు గానే పరిగణించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపి... వినతి పత్రాన్ని అందజేశారు. కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు ఎక్కడ ఇచ్చారో చూపాలని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.

పశ్చిమ గోదావరి జిల్లా...

కరోనా మృతులకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని పశ్చిమ గోదావరి జిల్లాలో తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సబ్ కలెక్టర్​కు వినతి పత్రం అందించారు. తెల్ల రేషన్​ కార్డు ఉన్న వారికి రూ.10 వేల ఆర్థిక సాయం చేయాలన్నారు.

తూర్పుగోదావరి జిల్లా

కరోనా బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు డిమాండ్ చేశారు. అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి... కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్​కు వినతి పత్రం అందజేశారు.

ఇదీ చదవండి: గుంటూరు మెడికల్ క్లబ్ ఎదుట వైద్యుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.