Supreme Court heard a case filed by AP government challenging High Court order: ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని నిలిపేస్తూ రాష్ట్ర హైకోర్టు ఆగస్టు 3న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇందులో ప్రతివాదులకు నోటీసులిస్తూ విచారణను నవంబరుకు వాయిదా వేసింది. ఇళ్ల నిర్మాణం వెయ్యి కోట్లతో ముడిపడి ఉన్నందున కేసును పూర్తిస్థాయిలో విచారించాల్సి ఉందని సుప్రీం తెలిపింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలుచేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన వ్యాజ్యంపై విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పంకజ్ మిత్తల్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఈ కేసులో తాము నోటీసులిస్తామని, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై హైకోర్టు సుదీర్ఘమైన ఉత్తర్వులిచ్చిందని, కారణాలనూ చెప్పిందని జస్టిస్ సంజీవ్ ఖన్నా గుర్తుచేశారు.
Supreme Court refused to stay High Court interim order on R-5 zone: తమ తుది ఉత్తర్వులకు లోబడి అన్నీ కొనసాగించుకోవచ్చని, ఎలాంటి ఈక్విటీలూ కోరడానికి వీల్లేదని మే 5న సుప్రీంకోర్టు చెప్పిందని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించేలా హైకోర్టు ఉత్తర్వులున్నాయని ఆయన వివరించగా.. ఈ విషయాలనూ పరిశీలిస్తామని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. పట్టాలను పంపిణీచేసుకోవచ్చని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ చెప్పారని, ఏపీ హైకోర్టు మాత్రం ఇళ్ల నిర్మాణంపై స్టే ఇచ్చిందని ధర్మాసనం దృష్టికి న్యాయవాది సింఘ్వీ తెచ్చారు.
పట్టాలు పొందినవారు ఊరకే పక్కన పెట్టలేరు కదా? అని పేర్కొన్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందిస్తూ.. అందుకే తాము నోటీసులిస్తున్నామని, తదుపరి వాదనలు వింటామని అన్నారు. ఇక్కడ 2, 3 విషయాలను పరిశీలించాల్సి ఉందని.. అందులో ఒకటి భూ యజమానులకు డబ్బులు చెల్లించలేదని, రెండోది ఇళ్ల నిర్మాణానికి వెయ్యి కోట్ల రూపాయలు వరకు వెచ్చించాల్సి ఉందన్నారు. ఈక్విటీ కోరకూడదని చెప్పిన కేసులో భారీగా ప్రజాధనం ముడిపడి ఉన్నందున అది వృథా కాకూడదని హైకోర్టు భావించి ఉండొచ్చని అన్నారు.
AP High Court stay on construction of Zone 5 houses: అనంతరం సింఘ్వీ వాదనలు కొనసాగిస్తూ.. ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కిందికి వస్తుందని, ఆ మేరకు రాష్ట్రం ఒప్పందం చేసుకుంటే తాము లబ్ధిదారులతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. జస్టిస్ ఖన్నా జోక్యం చేసుకుంటూ మీరు తొలిదశలో విజయవంతం కాలేదని నవ్వుతూ అన్నారు. కొంతకాలం వేచిచూడాలంటూ ప్రతివాదులకు నోటీసులిస్తూ విచారణను నవంబరుకు వాయిదా వేశారు. కౌంటర్ అఫిడవిట్లపై సమాధానాలను 3 వారాల్లోపు దాఖలు చేయాలన్నారు. తదుపరి విచారణను అక్టోబరుకు వాయిదా వేయాలని న్యాయవాది సింఘ్వీ కోరగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నిరాకరించారు. లేదంటే జనవరికి వాయిదా వేస్తామని నవ్వుతూ హెచ్చరించారు.
Amaravati Farmers: ప్రభుత్వం పేదలను మోసం చేయడం మానుకోవాలి: అమరావతి రైతులు
Justice Sanjeev Khanna questioned the lawyers: ఇది ఎందుకు సమస్యాత్మకమైంది? మరో కేసుకు దీంతో సంబంధముందా? అని జస్టిస్ సంజీవ్ ఖన్నా న్యాయవాదులను ప్రశ్నించారు. లేదని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు పేర్కొనగా, రైతుల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది శ్యాందివాన్ ఉందని చెప్పారు. రాజధాని అంశంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలను హైకోర్టు ఫుల్‌బెంచ్ కొట్టేసిందని, మాస్టర్‌ప్లాన్ ప్రకారం రాజధానిని యథాతథంగా కొనసాగించాలని ఆదేశించిందన్నారు. 3 రాజధానుల విషయం కాదా? అని జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆరాతీశారు. ఒకవేళ హైకోర్టు ఫుల్‌బెంచ్ ఉత్తర్వులను పక్కనబెడితే పరిణామాలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. శ్యాందివాన్ స్పందిస్తూ.. దాన్ని వెనక్కు తీసుకోలేరన్నారు. ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ చెప్పారు.