ETV Bharat / state

రాజధాని రైతులకు... రాష్ట్ర వ్యాప్త మద్దతు

author img

By

Published : Jan 5, 2020, 6:29 AM IST

statewide protests for supporting amaravati farmers agitation
రాజధాని రైతులకు... రాష్ట్ర వ్యాప్త మద్దతు

రాజధాని కోసం అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి రాజకీయపక్షాలు, ప్రజాసంఘాల మద్దతు కొనసాగుతోంది. తెలుగుదేశం, వామపక్షాల నేతలు రైతులకు సంఘీభావంగా దీక్షల్లో కూర్చుని నిరసన తెలియజేశారు. తమకు తోచిన సాయాన్ని రైతులకు అందిస్తూ వివిధ ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. రైతులకు సంఘీభావంగా పలు జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

రాజధాని రైతులకు... రాష్ట్ర వ్యాప్త మద్దతు

అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న నిరసనదీక్షలకు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దుతుగా నిలుస్తున్నాయి. కృష్ణా జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లిలో రైతులు చేపట్టిన దీక్షకు తెదేపా నేత దేవినేని ఉమ మద్దతు తెలిపారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే ఊరుకోమని హెచ్చరించారు. వీరులపాడు మండలం జుజ్జూరులో మూడో రోజు రిలే నిరాహార దీక్షలు చేసిన రైతులకు తెదేపా నేతలు నల్లగుట్ల స్వామిదాస్‌, తంగిరాల సౌమ్య సంఘీభావం తెలిపారు. మందడంలో మహిళలపై పోలీసుల చర్యలను తంగిరాల సౌమ్య ఖండించారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ వెలగపూడి నుంచి మందడం వరకు మహిళలు ర్యాలీ చేపట్టారు. దొండపాడులో రైతు మృతికి సంతాపం ప్రకటించారు. రాజధానిపై ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు హెచ్చరించారు.

చంద్రబాబుపై కక్షతోనే రాజధాని రైతులకు వేధింపులు

చంద్రబాబుపై కక్షతోనే ముఖ్యమంత్రి జగన్ అమరావతి రైతులను వేధిస్తున్నారని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు తెదేపా కార్యాలయంలో... జిల్లా నియోజకవర్గ సమావేశంలో అమరావతిపై చర్చించారు. ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నా సీఎం ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ గుంటూరులో అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయేతర ఐకాస నేతలు సమావేశం నిర్వహించారు. మనరాజధాని అమరావతి నినాదంతో తెనాలిలో అఖిలపక్ష ఐకాస ఆధ్వర్యంలో ఆరో రోజు దీక్షలు కొనసాగాయి. 2 వేల మంది విద్యార్థులు సంఘీభావ యాత్రగా వచ్చి ఐకాసకు మద్దతు తెలిపారు..

రహదారిపై వంటావార్పు

అమరావతి రైతులకు సంఘీభావంగా గుంటూరు జిల్లా నారాకోడూరు, చేబ్రోలు రైతులు 50 బస్తాల కూరగాయలు అందజేశారు. గుంటూరులో తెలుగు మహిళా సంఘం ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. రహదారిపై వంటావార్పు చేయడాన్ని పోలీసులు అడ్డుకోగా ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. కాకినాడలో అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఏర్పాటు చేసిన వంటావార్పు కార్యక్రమానికి సీపీఐ నేత నారాయణ హాజరయ్యారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పోలీసులు అమరావతి రైతులను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ అఖిలపక్ష ఐకాస నేతలు పోలీసు స్టేషన్‌ ఎదుట నిరసనకు దిగారు.

ప్రభుత్వ ఉద్యోగులు విధుల బహిష్కరణ

రాజధానిపై సర్కారు తీరును నిరసిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే విధులను బహిష్కరించనున్నారని తెలుగుశక్తి అధ్యక్షుడు బీవీ రామ్‌ తెలిపారు. త్వరలోనే వైకాపా ప్రభుత్వం కూలిపోనుందని జోస్యం చెప్పిన ఆయన... రాజధానిపై కేంద్రమంత్రులతో చర్చిస్తానన్నారు.

ఇదీ చదవండి : 'పథకం ప్రకారం... అమరావతిని చంపేందుకు ప్రయత్నం'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.