ETV Bharat / state

BANKERS MEETING:కౌలు రైతులకు రుణాలివ్వండి: సీఎం జగన్​

author img

By

Published : Sep 9, 2021, 1:10 PM IST

Updated : Sep 10, 2021, 5:44 AM IST

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,91,330 మంది కౌలు రైతులకు సీసీఆర్‌సీ ఇచ్చామని.. వారందరికీ వెంటనే పంట రుణాలివ్వాలని బ్యాంకర్లను సీఎం జగన్‌ కోరారు. వీరు ఎక్కడ భూమిని కౌలుకు తీసుకున్నారు. వాటి సర్వే నెంబర్లు.. ఏ పంట వేశారన్న వివరాలన్నీ ఈ-క్రాప్‌లో నమోదు చేశామన్నారు.మహిళా సాధికారతకు బ్యాంకర్లు తోడ్పడాలన్నారు.

cm jagan
సీఎం జగన్​

రాష్ట్రవ్యాప్తంగా 4,91,330 మంది కౌలు రైతులకు క్రాప్‌ కల్టివేటర్‌ రైట్‌ కార్డులను (సీసీఆర్‌సీ) ఇచ్చామని, వారందరికీ వెంటనే పంట రుణాలివ్వాలని బ్యాంకర్లను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. ‘కౌలు రైతులకు కార్డులివ్వడంతోపాటు వారి వివరాలన్నింటినీ ఈ-క్రాప్‌లో నమోదు చేశాం. వీరు ఎక్కడ భూమిని కౌలుకు తీసుకున్నారు. వాటి సర్వే నెంబర్లు.. ఏ పంట వేశారన్న వివరాలన్నీ అందులో ఉంటాయి. రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానించి, వారి వివరాల్ని ధ్రువీకరిస్తున్నాం’ అని సీఎం వివరించారు.
ఈ-క్రాపింగ్‌తో రైతులకు వడ్డీ లేని పంట రుణాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా అందించటంతోపాటు బ్యాంకులిచ్చే రుణాలకు భద్రత ఉంటుందని తెలిపారు. క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. 6,538 ఆర్‌బీకేల్లో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను నియమించటం ముదావహమని వ్యాఖ్యానించారు. వారితో ఆ కేంద్రాల్లోనే ఈ-క్రాపింగ్‌ ద్వారా పంట రుణాలిప్పించాలని సూచించారు. ‘రైతులు ఎరువులు, పురుగు మందులను కొనుక్కోవడానికి కియోస్కులను పెట్టాం. ఈ వ్యవస్థను బ్యాంకులతో అనుసంధానించాలి. ఆర్‌బీకేల్ని బ్యాంకులు తమవిగా భావించాలి. ఏటీఎం సదుపాయం, క్రెడిట్‌ కార్డులు ఇవ్వటం, ఆన్‌లైన్‌ సౌకర్యం కల్పించటం వంటివి కాకుండా ఇక్కడి నుంచే రుణాలను మంజూరు చేస్తేనే పూర్తి స్థాయి డిజిటలైజేషన్‌ జరిగినట్లుగా భావించాలి’ అని బ్యాంకర్లకు సూచించారు.

మహిళా సాధికారతకు తోడ్పడాలి

మహిళా సాధికారతకు బ్యాంకర్ల సాయం కావాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలిచ్చామని, వాటిలో పది లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని వివరించారు. ఒక్కో లబ్ధిదారుకు కనీసం 4-5 లక్షల రూపాయల ఆస్తి సమకూరుస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులైన మహిళలందరూ స్వయం సహాయక సంఘాల సభ్యులేనని, వారికి అవసరాల కోసం ఒక్కొక్కరికి కనీసం రూ.35 వేల చొప్పున రుణమివ్వాలని సీఎం కోరారు. రుణాలపై బ్యాంకులు 3 శాతం వడ్డీని వసూలు చేస్తే.. మిగిలిన వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. జగనన్న తోడు కింద ఆర్నెల్లకోసారి చిరు వ్యాపారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి రుణాలివ్వాలని కోరారు. కిందటి ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా దేశ జీడీపీ 7.25 శాతం తగ్గితే రాష్ట్రంలో ఇది 2.58 శాతానికే పరిమితమైందని తెలిపారు.ఇందులో కీలకపాత్ర పోషించిన బ్యాంకర్లను అభినందించారు. కిందటేడాది ఇదే సమయంతో పోలిస్తే పంట రుణాలు 10.49 శాతం అధికంగా ఇచ్చినా.. దీర్ఘకాలిక రుణాలు రూ.3,237 కోట్లు తక్కువగా ఉన్నాయని, మొత్తంగా వ్యవసాయ రంగానికి 1.32 శాతం తక్కువగా రుణ పంపిణీ జరిగిందని గుర్తు చేశారు.

ఏపీలో కార్యక్రమాలపై ఉత్తరాది రాష్ట్రాల ప్రశంసలు

రాష్ట్రంలో చేపడుతున్న మహిళా స్వయం ఉపాధి కార్యక్రమాలను ఉత్తరాది రాష్ట్రాలు ప్రశంసిస్తున్నాయని ఎస్‌ఎల్‌బీసీ కన్వీనరు వి.బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ముంబయిలో జరిగిన సమావేశంలో ఏపీలో అమలు చేస్తున్న కార్యక్రమాల్ని వారి రాష్ట్రాల్లోనూ చేపట్టేలా చూడాలని బ్యాంకర్లను కోరాయని తెలిపారు. చిరు వ్యాపారులకు రుణాలివ్వడంలో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ ఉందని వెల్లడించారు. మొత్తం 10,778 ఆర్‌బీకేల్లో ఇప్పటికే 6,538 చోట్ల బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను నియమించామని వెల్లడించారు. వైఎస్సార్‌ కడప జిల్లాలో డిజిటలైజేషన్‌ పూర్తయిందని.. గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని నాబార్డు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సుధీర్‌ కుమార్‌ జన్నావర్‌ చెప్పారు. సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కన్నబాబు, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, గృహ నిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి సునీత, ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ, యూబీఐ ఈడీ దినేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండీ.. MAA Elections: మోహన్​బాబుకు నాగబాబు చురకలు

Last Updated : Sep 10, 2021, 5:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.