ETV Bharat / state

Crop loss in AP: కుదిపేసిన వర్షాలు.. దిక్కుతోచని స్థితిలో అన్నదాత

author img

By

Published : May 6, 2023, 7:24 AM IST

Updated : May 6, 2023, 9:40 AM IST

Farmers Lost Crops due to Rains: అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంటలకూ భారీగా నష్టం వాటిల్లింది. వర్షాల ధాటికి పంటలు, ధాన్యం రాశుల్ని ఆరబెట్టుకోవడం రైతులకు కష్టసాధ్యంగా మారింది. కాస్త తెరిపి వచ్చిందని ఎండబెట్టుకునేలోగా మళ్లీ కురుస్తున్న వర్షాలతో.. ధాన్యాన్ని తడి వీడటం లేదు. రాశుల్లోనే ధాన్యం మొలకలొచ్చి.. పనికిరాకుండా పోతోంది. పసుపు, మొక్కజొన్న, మిరప పంటలూ.. రైతుకు కన్నీళ్లే మిగులుస్తున్నాయి. ఉద్యాన పంటలైన మామిడి, అరటి పంటలూ భారీగా దెబ్బతిన్నాయి.

Farmers lost due to rains
Farmers lost due to rains

Farmers Lost Crop due to Rains: తడిసిన పంటలు, ధాన్యాన్ని ఆరబెడదామంటే.. వాన..! టార్పాలిన్లను కప్పి కాపాడుకుందామంటే.. దెబ్బతింటోంది. ఇదీ ధాన్యం రైతుల దీనస్థితి. తడిసిన ధాన్యం నుంచి మొలకలొస్తున్నాయి. వరుస వానలతో వరి, మొక్కజొన్న, మిరప, పసుపు రైతులకు అపార నష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో భారీ వర్షాలకు అధిక నష్టం జరిగింది. సుమారు 4 నుంచి 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని ఉంటాయని ప్రాథమికంగా అంచనా కట్టారు. అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో.. పలుచోట్ల ఆరబెట్టిన ధాన్యం నీటిపాలైంది. కుప్పలుగా పోసిన ధాన్యం రాశుల కిందకు నీరు చేరి మొలకలొస్తున్నాయి.

గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న నీటిలో తడిసిపోయింది. ఉడికించి ఆరబెట్టిన పసుపు.. నీటిలో నానుతోంది. వానలకు తోడు.. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో.. అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో అరటి, బొప్పాయి వంటి పండ్ల తోటలు నేలవాలాయి. పలుచోట్ల మామిడి చెట్లకున్న కాయలన్నీ రాలిపోయాయి. మరోవైపు తుపాను ప్రమాదం పొంచి ఉందని.. రాబోయే మూడు రోజులు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ సూచిస్తుండటంతో.. రైతులకు కంటి మీద కునుకు కరవైంది.

భారీ వర్షాలతో వరి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆగకుండా కురుస్తున్న వానలు, గాలులతో.. కోతకు సిద్ధంగా ఉన్న వరి నేల కరిచింది. కొన్ని చోట్ల మొలకలు వస్తోంది. యంత్రాలతో కోయించాలన్నా.. నీరు నిలవడంతో పొలంలోకి దికే పరిస్థితి లేదు. నూర్పిడి చేయించిన ధాన్యాన్ని రోడ్ల మీద ఆరబోస్తే.. వానకు తడిసింది. వాటిపై టార్పాలిన్లు కప్పి ఉంచితే.. లోపలి ధాన్యం ఉడుకెత్తి దెబ్బతింటోంది. టార్పాలిన్లు తీస్తే.. వెంటనే వర్షార్పణమవుతోంది. ఒక్కో బరకానికి రోజుకు 25 రూపాయల చొప్పున అద్దె చెల్లించాలి. ఎకరంలో ధాన్యాన్ని ఆరబెట్టేందుకు 4 బరకాలకు రోజుకు 100 రూపాయల చొప్పున 5 రోజులకు 500 అవుతోంది. వానలు కురవడంతో మరిన్ని రోజులు నిల్వచేయాల్సి వస్తోంది. పైన కప్పే టార్పాలిన్లకు.. కొలతలకు అనుగుణంగా.. ఎకరాకు 2 వేల 500 నుంచి 10 వేల రూపాయల దాకా అవుతోంది.

రబీలో 16.41 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 50 శాతంపైనే కోతలు పూర్తయ్యాయి. రబీలో 30 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తామని పౌరసరఫరాలశాఖ చెబుతుండగా.. ఏప్రిల్ 1 నుంచి మే 5 వరకు.. 36 రోజుల్లో 5.83 లక్షల టన్నులే కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణకు గోతాలు ఇవ్వడంలో జాప్యంతో.. అధిక శాతం పంట రోడ్లపైనే ఉంది. నూక ఎక్కువ వస్తోందంటూ మిల్లర్లు వేధిస్తున్నారని.. బస్తాకు 200 నుంచి 300 రూపాయల వరకు ఎదురు సొమ్ము తీసుకుంటున్నారని.. అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే చెబుతున్నారు. మిల్లుకు ధాన్యం పంపినా.. తేమ, నూక పేరుతో.. దిగుమతి చేసుకోకకుండా రోజుల తరబడి నిలిపేయడమూ.. ధాన్యం రైతుల అవస్థలకు కారణమైంది. అయినా అధికారులు అంతగా పట్టించుకోలేదు. ఈలోగా వర్షాలు మరింత అధికమై.. తీవ్ర నష్టాలను మిగిల్చాయి..

అధికారుల్లో హడావుడి.. గురువారం నుంచి గోదావరి జిల్లాల్లోని అధికారుల్లో హడావుడి మొదలైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటించే గ్రామాలకు వెళ్లి.. అక్కడి ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. మిగిలినచోట్ల రైతులే వాహనాలు ఏర్పాటు చేసుకుని మిల్లులకు పంపాలని అధికారులు సూచిస్తున్నారు. ఎంత ధరకు కొంటున్నారనే విషయాన్ని మాత్రం చెప్పట్లేదు. వరి మినహా.. ఖరీఫ్, రబీలో సాగు చేసిన పంటల్లో అధికశాతం కోతలు పూర్తయ్యాయి. మిరప, మొక్కజొన్న, పసుపు, మినుము వంటి పంటలన్నీ కల్లాల్లోనే ఉన్నాయి. విడవకుండా కురుస్తున్న వర్షాలతో.. ఇవన్నీ తడవడంతో.. రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. అమ్ముకోవాలన్నా.. కొనే నాథుడు లేరు. పంట కోసిన తర్వాత సంభవించే నష్టానికి సాయం అందించలేమని... నిబంధనలు వర్తించవని అధికారులు అంటున్నారు. అంటే.. కల్లాల్లో ఆరబెట్టిన పంట దెబ్బతిన్న రైతులందరికీ రిక్తహస్తమే. ప్రభుత్వం నుంచి సాయం అందే పరిస్థితి లేదు.

అధికశాతం కౌలు రైతులే.. రాష్ట్రంలోని సాగుదారుల్లో అధికశాతం కౌలు రైతులే ఉన్నారు. గోదావరి జిల్లాల్లో 90 శాతం వరకు వీరే ఉన్నారు. గత కొన్నేళ్లుగా నష్టాల నేపథ్యంలో కొందరు ఖరీఫ్ సాగు చేయలేక.. రబీలోనే నాట్లు వేశారు. తీరా పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు కురవడంతో.. వారికి నష్టాలే మిగిలాయి. ఎకరాకు 35 వేలకు పైగా పెట్టుబడులు పెట్టామని.. ఇప్పుడు ధాన్యం మొలకలొచ్చిందని కన్నీటిపర్యంతమవుతున్నారు. ధాన్యం బాగుంటేనే... బస్తా 13 వందల 50 రూపాయలు చొప్పున దక్కుతోంది. మద్దతు ధర కంటే.. 180 రూపాయలు తగ్గుతోంది. నూక, తేమ పేరుతో రైతులకు 11 వందల నుంచి 12 వందలే ఇస్తున్నారు. దీంతో మరింత నష్టపోతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 6, 2023, 9:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.