ETV Bharat / state

నీటి కోసం నిరసన బాట.. ఆ వ్యక్తే కారణమంటూ ఆగ్రహం

author img

By

Published : Feb 28, 2023, 1:57 PM IST

Public Agitation for Water: గుంటూరులోని రత్నగిరి కాలనీవాసులు తాగునీరు సరిగా రావడం లేదని, రోడ్లు సరిగా లేవని ఆందోళనకు దిగారు. గుజ్జనగుండ్ల నుంచి పలకలూరు మార్గంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపడంతో.. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఓ వ్యక్తి కావాలనే ఇలా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Agitation for Water
నీటి కోసం ఆందోళన

నీటి కోసం పాట్లు.. రోడ్డెక్కిన రత్నగిరి కాలనీవాసులు

People Protest for Water: ఆరు నెలలుగా విద్యుత్, నీటి సరఫరా సరిగా లేదు. తమ సమస్యలపై పలుమార్లు అధికారులకు, నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. వీధి దీపాలు కూడా వెలగక పోవడంతో ప్రజలు రాత్రి సమయంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మహిళలు, చిన్నారులు రాత్రి పూట బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. నీటి సరఫరా కూడా అరకొరగా ఉందని కాలనీవాసులు అంటున్నారు. ఎండల తీవ్రత ఎక్కువ అవుతుండటంతో.. తాగునీరు సరఫరా సరిగా లేకపోవడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.

దీనికి తోడు.. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి.. కావాలనే కాలనీకి నీళ్లు, విద్యుత్, వీధి దీపాలు వంటి సౌకర్యాలను కల్పించడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఆ సదరు వ్యక్తి.. కాలనీకి నీళ్లు రాకుండా చేస్తానని చెప్పాడని అంటున్నారు. దీనిపై కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము ఆ వ్యక్తికి ఓటు వేయలేదా.. మేము ఓటు వేస్తేనే కదా ఆయన గెలిచారు అని ప్రశ్నిస్తున్నారు. అయినా సరే ఇలా చేయడం ఎంత వరకు సబబని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే: తాగునీటి సరఫరా సరిగా లేదంటూ గుంటూరు నగరంలో ప్రజలు రోడ్డెక్కారు. గుజ్జనగుండ్ల నుంచి పలకలూరు వెళ్లే మార్గంలో రత్నగిరి కాలనీవాసులు రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ మార్గంలో రోడ్డు విస్తరణ కోసం అధికారులు ఇళ్లు తొలగించారు. ఆ సమయంలో కొన్ని పైపు లైనులు కూడా పాడైపోయాయి. దీంతో తాగునీటి సరఫరా సజావుగా జరగడం లేదు. వారం రోజులకుపైగా మంచినీరు రాకపోవడంతో కాలనీవాసులు ఆగ్రహంతో రోడ్డెక్కారు.

ప్రభుత్వానికి, నగరపాలకసంస్థ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆరు నెలల నుంచి అరకొర తాగునీరు సరఫరా చేస్తున్నారని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. కరెంట్‌ సరఫరా కూడా సరిగా ఉండటం లేదని, వీధి దీపాలు వెలగడం లేదని ఆరోపించారు. ఆందోళన కారణంగా ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

బయట ప్రాంతాలకు వెళ్లే వారు ఇబ్బంది పడ్డారు. అయితే గత్యంతరం లేని పరిస్థితుల్లో తాము ఆందోళనకు దిగాల్సి వచ్చిందని రత్నగిరి కాలనీవాసులు చెబుతున్నారు. ఆందోళన చేస్తున్న వారితో నగరపాలక సంస్థ అధికారులు చర్చించారు. తాగునీటి సరఫరాలో ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. వాటర్‌ ట్యాంకుల ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

"మాకు నీళ్లని.. వ్యక్తి ఆపేశారు. ఆ వ్యక్తి మరి ఎందుకు ఆపారో మాకు తెలియదు. ఈ మాట ఆయనే అన్నారు. ఆయన ఎందుకు ఆ మాట అనాలి. మేము ఆయనకి ఓట్లు వేయలేదా. మేము కూడా ఓట్లు వేస్తేనే ఆయన గెలిచారు". - రత్నగిరి కాలనీవాసులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.