ETV Bharat / state

తపాలా సేవలు భళా ..

author img

By

Published : May 20, 2021, 5:13 PM IST

విపత్తు వేళ తపాలా సిబ్బంది ప్రజలకు సేవలు చేస్తున్నారు. ఇంటి వద్దకే వెళ్లి నగదు అందజేస్తున్నారు. పనివేేళలు ముగిసినా.. ఆసుపత్రిలకు వచ్చినా పార్శిళ్లనూ, మెడికల్ పరికరాలను ఇస్తున్నారు. కరోనా వస్తుందని తెలిసినా.. ధైర్యం చేసి మరీ పనులు నిర్వర్తిస్తున్నారు.

postal
కదల్లేని స్థితిలో ఉన్న మహిళ ఇంటికి వెళ్లి పార్శిల్‌ అందిస్తున్న పోస్టుమ్యాన్‌

కరోనా విజృంభణతో ఇంటి నుంచి బయటికి వెళ్లడానికే భయపడుతున్న వేళ తపాలా ఉద్యోగులు ఇంటికే వచ్చి సేవలు అందిస్తుండడంతో ఎంతో మందికి ఊరట లభిస్తోంది. బ్యాంకులకు వెళ్ల లేని వారు, కరోనాతో ఇంటి నుంచి కదల్లేనివారు, నడవలేని స్థితిలో ఉన్నవారు నగదు కావాలని కోరిన నిమిషాల వ్యవధిలో తపాలా సిబ్బంది ఇంటికే వచ్చి వారి ఖాతా నుంచి సొమ్ము ఇస్తున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన ఉత్తరాలు, మందులు, పెద్దాస్పత్రులకు వస్తున్న పీపీఈ కిట్లు, పరీక్షల కిట్లు, ఇతర వైద్య పరికరాలు, మందులు తదితరాలన్నీ కూడా తపాలా సిబ్బంది ద్వారా ఆయా ఆసుపత్రులకు అందుతున్నాయి. కార్యాలయం వేళలు కుదించినా అందుకు అనుగుణంగా ఉద్యోగులు, సిబ్బంది పని విభజన చేసుకుని అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అందించే సేవల్లో లోపాలు తలెత్తకుండా చూస్తున్నారు. కరోనా విపత్తు వేళ తపాలా ఉద్యోగులు కొందరు కరోనా బారినా పడినా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు.

ఫ్రంట్‌ లైన్‌ వారియర్లుగా గుర్తించాలి

తపాలాశాఖ సిబ్బంది ఉత్తర ప్రత్యుత్తరాలు, పార్శిళ్లు అందించడంలో భాగంగా ప్రజలను కలవాల్సి వస్తోంది. పార్శిళ్లు ఇచ్చిన తర్వాత వారితో సంతకం చేయించుకోవాలి. ఏఈపీఎస్‌ ద్వారా నగదు ఇచ్చే క్రమంలో లబ్ధిదారుని నుంచి వేలిముద్ర వేయించుకోవాలి. ఈ క్రమంలో తపాలా ఉద్యోగులు కరోనా బారిన పడే అవకాశం ఉంది. కార్యాలయాల్లో నగదు లావాదేవీలు, ఇతర పత్రాల ఇచ్చిపుచ్చుకోవడంలో కరోనా విస్తరించే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తపాలా ఉద్యోగులు, సిబ్బందిని ఫ్రంట్‌ లైన్‌ వారియర్లుగా గుర్తించి వ్యాక్సిన్‌ వేయాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 120 మంది ఉద్యోగులు కరోనా బారిన పడగా 35 మంది రికవరీ అయ్యారు. 8 మంది మృత్యువాత పడగా 77 మంది హోం ఐసొలేషన్‌, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అత్యవసరాలకు తొలి ప్రాధాన్యం

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు, మంగళగిరిలోని ఎయిమ్స్‌కు దిల్లీ, చెన్నై నుంచి ఐసీఎంఆర్‌, ఇతర సంస్థల నుంచి పీపీఈ కిట్లు, ఇతర వైద్య సామగ్రి విమానాల ద్వారా విజయవాడకు వస్తున్నాయి. వాటికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా గుంటూరు నుంచి వెంటనే సిబ్బంది, వాహనాన్ని పంపి ఆయా ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నారు. విజయవాడకు వచ్చిన సామగ్రిని గంటల వ్యవధిలోనే ఆస్పత్రులకు చేరవేస్తున్నారు. జిల్లాలోని ప్రజలకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులు, బంధువులు మెడికల్‌ కిట్లు, అత్యవసరాలకు సంబంధించిన సామగ్రి పంపుతున్నారు. పార్శిల్‌పై అత్యవసరం అని రాసినట్లయితే వచ్చిన వెంటనే వాటిని వేరు చేసి అదే రోజు అందేలా చూస్తున్నారు. ఒక్కొక్కసారి రాత్రి వేళ సైతం వారికి అందిస్తున్నారు.

ఇంటి వద్దే రూ.12.51కోట్ల సొమ్ము పంపిణీ

జిల్లాలో గుంటూరు, నరసరావుపేట, తెనాలి కేంద్రంగా తపాలా శాఖ డివిజన్‌ కార్యాలయాలు సేవలు అందిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (ఏఈపీఎస్‌) ద్వారా ఇంటి వద్దకే వెళ్లి ఆప్‌కా బ్యాంక్‌... ఆప్‌కే ద్వారా కింద లబ్ధిదారులకు నగదు అందిస్తున్నారు. ఈ విధానంలో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి మే 19 వరకు రూ.12.51 కోట్ల సొమ్ము పంపిణీ చేశారు. బ్యాంకు ఖాతాకు ఆధార్‌ అనుసంధానం చేసుకున్నవారు ఏటీఎం, బ్యాంకుకు వెళ్లి నగదు తెచ్చుకోలేని పరిస్థితిలో ఆ ప్రాంతం పోస్టుమ్యాన్‌, లేదా పోస్టుమాస్టర్‌ను నగదు కావాలని కోరితే నిమిషాల వ్యవధిలో ఇంటికి వచ్చి వేలిముద్ర వేయించుకుని గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.20వేలు నగదు అందిస్తున్నారు. బ్యాంకు ఖాతాకు ఆధార్‌ అనుసంధానం కావడం వల్ల సంబంధిత లబ్ధిదారుని ఖాతాలో నిల్వల ఆధారంగా ఇండియా పోస్టు పేమెంట్స్‌ బ్యాంకు ద్వారా సొమ్ము చెల్లిస్తారు. ఇందుకు తపాలా శాఖ ప్రతి పోస్టుమ్యాన్‌కు రోజువారీగా రూ.20వేల నగదు అందిస్తుంది. ఎవరైనా ఇంటి వద్దకే నగదు కావాలని కోరితే వెంటనే ఇచ్చేస్తారు. పోస్టుమ్యాన్‌ వద్ద సొమ్ము అయిపోతే మళ్లీ తపాలా కార్యాలయానికి వెళ్లి తీసుకొచ్చి ఇస్తున్నారు. కరోనా రావడంతో ఇంటి వద్ద సొమ్ము తీసుకునేవారి సంఖ్య పెరిగిందని తపాలా వర్గాలు తెలిపాయి. లబ్ధిదారులు సైతం ఇది తమకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటోందని చెబుతున్నారు.

జాగ్రత్తలు తీసుకుంటూ సేవలు

కరోనా విపత్తు వేళ తపాలా సేవలు అత్యంత కీలకంగా మారాయి. మందులు, వైద్యసామగ్రితో పాటు నిత్యావసరాలకు సంబంధించిన అనేక వస్తువులు తపాలా శాఖ ద్వారా సంబంధితులకు అందజేస్తున్నాం. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు సిబ్బందికి మాస్క్‌లు, శానిటైజర్లు అందించాం. ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ వస్తే సెలవులో పంపుతున్నాం. అవసరమైనవారికి మెడికల్‌ కిట్లు, వైద్యానికయ్యే ఖర్చులో 80శాతం ఆసుపత్రిలో ఉన్నప్పుడే అందజేస్తున్నాం. కార్యాలయ పనివేళలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నాం ఒంటి గంటకు కుదించాం. దీంతో రద్దీ పెరగడంతో కార్యాలయాల్లో అదనపు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రజలు కోరితే ఇళ్ల వద్దకే వెళ్లి ఆధార్‌ ఆధారంగా నగదు అందిస్తున్నాం. దీనికి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. ఇళ్ల నుంచి బయటికి వెళ్లలేని వారికి పోస్టుమ్యాన్‌ వెళ్లి నగదు అందిస్తే ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరింత మందికి అందించాలన్న లక్ష్యంతో సిబ్బంది ముందుకెళ్తున్నారు.

- శివనాగరాజు, పోస్టల్‌ సూపరింటెండెంట్‌, గుంటూరు డివిజన్‌

ఇదీ చూడండి.

బీసీలకు మరో పదేళ్లు రిజర్వేషన్లు.. ప్రభుత్వం ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.