ETV Bharat / state

బియ్యం వ్యాపారి హత్య.. అధికార పార్టీ నేతలకు వాటాలు ఇవ్వకపోవటమే.. కారణమా?

author img

By

Published : Oct 28, 2022, 11:49 AM IST

Updated : Oct 28, 2022, 12:25 PM IST

Murder: గుంటూరు జిల్లాలో బియ్యం వ్యాపారి హత్యకు గల కారణాలను పోలీసులు వెల్లడించారు. మొదట కిడ్నాప్ అయ్యాడని భావించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుహ్యంగా అతని మృతదేహం కాలువలో లభించింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. మృతికి గల కారణాలను వెలికి తీశారు.

Rice Merchant Murder Case
బియ్యం వ్యాపారి హత్య

Rice Merchant Murder Case: గుంటూరు జిల్లా పొన్నూరులో బియ్యం వ్యాపారి అంజి బర్నబాసు కిడ్నాప్, హత్యకేసులో 8మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అంజిని అపహరించిన నిందితులు.. అతడిని తాళ్లతో కట్టేసి బతికుండగానే నీళ్లలో తోసేసి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. రేషన్ బియ్యం వ్యాపారంలో వచ్చిన విభేదాలే హత్యకు దారితీశాయన్నారు. అయితే పోలీసులు అసలు నిందితులను తప్పించారని బర్నబాసు కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

బియ్యం వ్యాపారి హత్య కేసులో 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు

రేషన్ బియ్యం అక్రమ రవాణాలో తలెత్తిన అధిపత్య పోరు.. గుంటూరు జిల్లాలో వ్యాపారి హత్యకు దారి తీశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పొన్నూరుకు చెందిన అంజి బర్నబాసు రేషన్ బియ్యం కొని అక్రమంగా రవాణా చేస్తుంటారు. ఈ విషయంలో స్థానికంగా ఉండే వైకాపా నేతలకు, అంజికి మధ్య విభేదాలు వచ్చాయి. అంజి వ్యాపారం జోరుగా సాగుతుండడం, అధికార పార్టీ నేతలకు వాటాలు ఇవ్వకపోవడమే విభేదాలకు కారణంగా తెలుస్తోందని అన్నారు. ఈ క్రమంలోనే అంజి బర్నబాసును ఈనెల 18న అపహరించారు. ఆయన వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి కారుతో ఢీకొట్టి కింద పడగానే వాహనంలోకి బలవంతంగా ఎక్కించుకొని తీసుకెళ్లారు. కాళ్లు, చేతులు కదలకుండా ప్లాస్టర్‌తో చుట్టేశారు. తర్వాత అతని ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, ఉంగరాలు తీసుకున్నారని వివరించారు. కృష్ణా జిల్లా శివార్లలో చిన్నాపురం సముద్రపాయలో బతికి ఉండగానే అంజిని పడేశారు. నీటిలో ఊపిరాడక అతను మరణించాడు. భర్త కనిపించకపోవడంతో ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 22న అంజి మృతదేహం మచిలీపట్నం శివార్లలో దొరకగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే అసలు నిందితులను పోలీసులు కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని అంజి భార్య ఆరోపించారు. ఆమె మాలమాహానాడు నేతలతో కలిసి అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పొన్నూరుకు చెందిన వీరయ్యచౌదరి, వెంకట రమణ తన భర్తను కిడ్నాప్ చేయించి చంపించారని.. వారి పేర్లు కేసు నుంచి తప్పించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, కిడ్నాప్, హత్య వ్యవహారంలో జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత సోదరుడితో పాటు ఒక ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నట్లు తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. అంజి కాల్‌డేటా, నిందితుల కాల్ డేటాలను బయటపెడితే వాస్తవాలు తెలుస్తాయన్నారు.

ఇదీ జరిగింది: గుంటూరు జిల్లా పొన్నూరులో కిడ్నాపైన బియ్యం వ్యాపారి బర్నబాసు అంజి హత్యకు గురయ్యాడు. కృష్ణాజిల్లా మచిలీపట్నం శివారులోని గుండేరు కాలువలో ఓ వ్యక్తి మృతదేహం లభించగా.. మొదటగా గుర్తుతెలియని మృతదేహంగా అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఐతే మృతదేహంపై ఉన్న ఆనవాళ్ల ప్రకారం అది బర్మబాసు అంజిదని భావించి.. ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు మచిలీపట్నం వెళ్లి మృతదేహాన్ని అంజిగా గుర్తించారు. కిడ్నాప్‌ జరిగిన తర్వాత పోలీసులు సకాలంలో స్పందించకపోవటం వల్లే అంజి హత్యకు గురయ్యాడని బంధువులు ఆరోపించారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతల హస్తం ఉందని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 28, 2022, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.