ETV Bharat / state

పెనుమూలిపై 'చక్కెర' పంజా

author img

By

Published : Feb 29, 2020, 8:00 AM IST

penumuli village suffering from sugar disease
పెనుమూలిపై పంజా విసురుతున్న చక్కెర

వంశపారంపర్యంగా రావచ్చు.. ఆహారపు అలవాట్లు కావచ్చు... ఆ గ్రామంలో గతంతో పోల్చితే మధుమేహ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరిగింది. ఊహించని విధంగా పెరుగుతున్న బాధితుల సంఖ్య... అక్కడి జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చిన్నాపెద్దా వయసుతో సంబంధం లేకుండా... అందరిలోనూ లక్షణాలు కనిపిస్తుండడంపై అక్కడి ప్రజలు హడలిపోతున్నారు. కారణమేంటో... ఎలా నియంత్రించాలో తెలియక సతమతమవుతున్నారు.

పెనుమూలిపై పంజా విసురుతున్న చక్కెర

గుంటూరు జిల్లాలో ఓ గ్రామాన్ని మధుమేహం పీడిస్తోంది. దుగ్గిరాల మండలం పెనుమూలి జనాభా 3 వేల 500 వరకూ ఉంటుంది. అందరూ రైతులు, వ్యవసాయ కూలీలే. చుట్టూ పంటపొలాలు.. ఆహ్లాదకర వాతావరణం. ఈ చిన్నపల్లెపై మధుమేహం పంజా విసురుతోంది.

సాధారణంగా ప్రతి వెయ్యి మందిలో నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు 3.5 శాతానికి మించకూడదు. పెనుమూలిలో ఆ సంఖ్య 10 శాతం వరకు ఉండటం... అందులోనూ షుగర్ కేసులు అధికంగా ఉండటం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది. కారణాలేమైనా కావచ్చు. వ్యాధిగ్రస్థుల జాబితాలో చేరుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

పెనుమూలికి 3 కిలోమీటర్ల దూరంలో దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నప్పటికీ.... 104 వైద్యవాహనమే పెద్దదిక్కు. నెలానెలా వైద్య పరీక్షలూ దాని ద్వారానే చేయించుకుంటున్నారు. అందులో 80 శాతం మేరకు షుగర్ కేసులు బయటపడుతున్నాయని... అందునా కొందరిలో అధికస్థాయిలో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మరో ఆందోళనకర విషయం ఏంటంటే.... నిర్ధరణ పరీక్షలు చేయించుకోనివారు ఇంకా చాలా మందే ఉన్నారు.

మధుమేహం కేసులు అసాధారణంగా నమోదవుతున్నాయని ఆందోళన చెందుతూనే... కారణం తెలియక ఉక్కిరిబిక్కిరి గ్రామస్తులు అవుతున్నారు. తాగునీటి సమస్యనా... బీపీటీ రైస్ తినడమా... ఓ పరిశ్రమ నుంచి వస్తున్న వ్యర్థాలు భూగర్భజలంలో కలవడమా... అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పెనుమూలిలో అసాధారణరీతిలో నమోదవుతున్న మధుమేహ కేసులపై వైద్యారోగ్య శాఖ అధికారులు దృష్టి సారించాలని..... గ్రామస్తులు కోరుతున్నారు. సమగ్రంగా ఇంటింటి సర్వే చేసి వ్యాధి నియంత్రించాలని.. ప్రస్తుత పరిస్థితికి కారణాలను అన్వేషించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి:

మహిళ కడుపులో 8 కిలోల కణితిని తొలగించిన వైద్యులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.