ETV Bharat / state

NEET 2023: కఠిన నిబంధనల మధ్య ముగిసిన 'నీట్'

author img

By

Published : May 7, 2023, 8:54 PM IST

NEET 2023
నీట్ 2023

NEET 2023: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్‌ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థులను క్షుణ్నంగా పరిశీలించిన తరువాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. నిర్వాహకులు నిబంధనలను కఠినంగా అమలు చేశారు.

NEET 2023: కఠిన నిబంధనల మధ్య ముగిసిన 'నీట్'

NEET 2023: వైద్య విద్య ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌ పరీక్ష రాష్ట్రంలో కఠిన నిబంధనల మధ్య ముగిసింది. కొన్నిచోట్ల అమ్మాయిల కాలి పట్టీలు, చెవి రింగులు.. తీసేయించారు. అబ్బాయిల ఫుల్‌హ్యాండ్స్‌ చొక్కాలు అప్పటికప్పుడు కత్తిరించారు. రాష్ట్రంలోని 140 పరీక్షా కేంద్రాల్లో.. 68 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 20 నిమిషాల వరకూ నీట్‌ పరీక్ష నిర్వహించారు. ఉదయం పదకొండున్నర నుంచే విద్యార్థుల్ని పరీక్షా కేంద్రాల్లోకి.. అనుమతించిన నిర్వాహకులు.. మధ్యాహ్నం ఒకటిన్నర దాటాక గేట్లు మూసేశారు. ఫిజిక్స్ సులువుగా ఉన్నా.. కెమిస్ట్రీ, బయాలజీలో ప్రశ్నలు కొంత కష్టంగా ఉన్నాయని విద్యార్ధులు చెబుతున్నారు.

వాటికి మినహా.. వేటికీ అనుమతి లేదు: ప్రతీ విద్యార్థినీ క్షుణ్నంగా పరిశీలించాకే.. పరీక్షా కేంద్రంలోకి విద్యార్థుల్ని అనుమతించారు. హాల్ టికెట్, ఫొటో, ఆధార్ కార్డు మినహా..వేటినీ తీసుకెళ్లనీయలేదు. విజయవాడలోని నలందా విద్యానికేతన్‌ సెంటర్‌ వద్ద.. ఆధార్‌ కార్డు మర్చిపోయిన ఒక అభ్యర్థిని పోలీసులే వాహనంలో తీసుకెళ్లి..నిర్ణీత సమయానికల్లా మళ్లీ పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చారు.

అమ్మాయిల చెవి రింగులు, గొలుసులు: ఇక విద్యార్థుల చేతులకు ఉన్న కాశీ దారాలు, ఇతరత్రా బ్యాండ్‌లను నిర్వాహకులు.. తీసేయించారు. అమ్మాయిల చెవి రింగులు, గొలుసులు కూడా తీసేయించారు. వాటర్‌ బాటిళ్లకున్న లేబుళ్లనూ అనుమతించలేదు. విశాఖలోనూ నీట్‌ నిబంధనలు.. నిక్కచ్చిగా అమలు చేశారు.

అబ్బాయిల చొక్కాలకు కత్తెర: నంద్యాలలో ఫుల్‌హ్యాండ్స్‌ చేతుల చొక్కాలతో పరీక్షకు వచ్చిన అబ్బాయిలను.. అనుమతించలేదు. చివరకు అక్కడికక్కడే కత్తెరతో.. చొక్కా చేతులు సగం కత్తిరించారు. నిబంధనల ప్రకారం చొక్కాలు కత్తిరించిన తరువాత.. అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు.

దేశవ్యాప్తంగా ప్రశాంతంగా: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్‌ యూజీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పెన్ను, పేపర్‌ విధానంలో నిర్వహించే ఈ పరీక్ష.. దేశవ్యాప్తంగా 499 నగరాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరిగింది.

తెలుగు రాష్ట్రాల నుంచి: తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈ పరీక్షకు దాదాపు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు అప్లై చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షా 40 వేల మంది పరీక్షకు హాజరైనట్టు సమాచారం. తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌.. ఏపీలో విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ తదితర నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

నిమిషం నిబంధన: పరీక్షా కేంద్రాల వద్ద మెటల్‌ డిటెక్టర్లతో తనిఖీ చేసి విద్యార్థులను లోపలికి అనుమతించారు. ఎవరైనా అభ్యర్థులు లోహాలతో తయారు చేసిన ఉంగరాలు, ముక్కుపుడకలు ధరించి వస్తే.. వాటిని తీసివేసిన తరువాత లోపలికి పంపించారు. కొన్ని సెంటర్లలో నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులనూ సిబ్బంది అనుమతించలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.