ETV Bharat / state

KA Paul: 'స్టీల్ ప్లాంట్​ కోసం విరాళాలు తీసుకొస్తాను.. కేంద్రాన్ని ఆదేశించండి'

author img

By

Published : Apr 27, 2023, 9:52 AM IST

KA Paul on Vizag Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నామమాత్రపు ధరకు విక్రయించకుండా అడ్డుకోవాలని కోరుతూ.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్‌ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రైవేటీకరణ ప్రక్రియను నిలువరించాలని కోరారు.

KA Paul
కేఏ పాల్‌

KA Paul on Vizag Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నామమాత్రపు ధరకు విక్రయించకుండా అడ్డుకోవాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్‌ కేఏ పాల్‌ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రైవేటీకరణ ప్రక్రియను నిలువరించాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బ్యాలెన్స్‌ షీట్, లాభనష్టాలను చూసేందుతు తెలుగు తెలిసిన విశ్రాంత న్యాయమూర్తిని నియమించేలా ఆదేశించాలన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేఏ పాల్ కామెంట్స్.. కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు

స్టీల్‌ ప్లాంట్‌ కొనుగోలుకు గ్లోబల్‌ పీస్‌ ఆర్గనైజేషన్‌ ద్వారా విరాళాలను సేకరించేందుకు అనుమతి ఇవ్వాలని.. కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. కేంద్ర ఆర్థిక, ఉక్కు, గనులశాఖ కార్యదర్శులు, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ విశాఖ స్టీల్‌ ప్లాంట్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. పార్టీ ఇన్‌ పర్సన్​గా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వం ఆస్తులను విక్రయిస్తోందన్నారు. 17 వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఏపీలోని గంగవరం పోర్టును రూ.600 కోట్లకు విక్రయించారన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో నడవడం లేదన్నారు. 3.7 లక్షల కోట్ల రూపాయల విలువ ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ఆ విలువలోని కేవలం 3 శాతం ఖరీదుకే అమ్ముతున్నట్లు సమాచారం ఉందన్నారు. రాష్ట్ర ప్రజలతోపాటు అధికార వైసీపీ, అన్ని రాజకీయ పార్టీలు స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయన్నారు.

ప్లాంటుకు భూములు తీసుకునే సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతు కుటుంబాలకు చెందిన 8 వేల మందికి ఇంకా ఉద్యోగాలు కల్పించాల్సి ఉందన్నారు. అప్పట్లో రైతులు నామమాత్రపు ధరకు భూముల్ని ప్లాంట్‌ కోసం త్యాగం చేశారన్నారు. ప్లాంట్‌పై లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను నిలువరించేలా ప్రతివాదులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.

"చిత్తశుద్ధి ఉంటే.. మూడున్నర లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ 3500 కోట్లకు ఎందుకు అమ్ముతారు. స్టీల్ ప్లాంట్​కు ముందు నాలుగు వేల కోట్లు కావాలి. నాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేలా మీరు ఆదేశాలు ఇవ్వండి. ప్రైవేటీకరణ ఆపడానికి అవసరమైన విరాళాలను తీసుకొచ్చేందుకు నాకు అనుమతి ఇవ్వమని.. కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి. నేరుగా ఆ విరాళాలు కేంద్ర ప్రభుత్వ ఖాతాలోకే వస్తాయి. తరువాత కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్​ను కొనసాగించవచ్చు. అందులో ఉన్న 44 వేల మంది ఉద్యోగులు కూడా కొనసాగవచ్చు. నా జీవితంలో నేను చేతులు ఎత్తి ఎప్పుడూ ఏమీ కోరలేదు. కానీ ఈ రోజు న్యాయమూర్తిని కోరుతున్నాను. ఈ వ్యాజ్యాన్ని కోర్టు స్వీకరించకపోతే.. నేను నిరాహార దీక్ష చేస్తాను". - కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.