ETV Bharat / state

"చౌకబారు విమర్శలేనా.. శాఖలకు న్యాయం చేసేదేమైనా ఉందా"

author img

By

Published : Oct 27, 2022, 9:26 AM IST

JANASENA QUESTIONS TO YSRCP MINISTERS : ఏపీ సర్కార్‌పై జనసేన పార్టీ దూకుడును మరింత ఉద్ధృతం చేసింది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు, మంత్రుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతుండగా.. తాజాగా జనసేన పార్టీ పలువురు మంత్రులపై ప్రశ్నల బాణాల్ని సంధించింది. అవి ఏంటంటే??

JANASENA QUESTIONS TO MINISTERS
JANASENA QUESTIONS TO MINISTERS

"చౌకబారు విమర్శలేనా.. శాఖలకు న్యాయం చేసేదేమైనా ఉందా"

JANASENA QUESTIONS TO MINISTERS : రాష్ట్ర మంత్రులు చౌకబారు విమర్శలతోనే పదవీ కాలమంతా వెళ్లదీస్తారా లేక.. కేటాయించిన శాఖలకు న్యాయం చేసేదేమైనా ఉందా.. అని జనసేన పార్టీ ప్రశ్నించింది. ఈ మేరకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, విడదల రజిని, రోజా, గుడివాడ అమర్నాథ్‌, జోగి రమేశ్‌, దాడిశెట్టి రాజాకు.. జనసేన సోషల్‌ మీడియా విభాగం ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్ని దశాబ్దాలు పడుతుందో.. సామాన్యులకు అర్థమయ్యే భాషలో మంత్రి బొత్స వివరించగలరా అని ప్రశ్నించారు. సహచర మంత్రులు అనారోగ్యానికి గురైతే.. పక్క రాష్ట్రాలకు పారిపోతున్నారని.. వారికి ఏపీలో వైద్యం చేయించుకునే సౌకర్యాలు ఎప్పుడు కల్పిస్తారో.. మంత్రి విడదల రజిని చెప్పాలని డిమాండ్ చేశారు.

గుంతల రహదారులు ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటే.. మొద్దునిద్ర వీడతారో .. దాడిశెట్టి రాజా సమాధానం చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అప్పుల చిట్టా ఎంతో లెక్క చెప్పడంతోపాటు.. ఒక్కో పౌరుడిపై ఎంత భారం మోపారో.. మంత్రి బుగ్గన ప్రజలకు వివరించగలరా అని ప్రశ్నించారు. కొండలు, చెరువుల్లో కాకుండా.. నివాసయోగ్య భూముల్లో నాణ్యమైన ఇళ్లు ఎన్ని కట్టించారో.. జోగి రమేశ్‌ చెప్పాలన్నారు. రికార్డింగ్‌ డ్యాన్సులు అయ్యాక ఖాళీ సమయాల్లో కష్టపడి తెచ్చిన పరిశ్రమల గురించి శ్వేతపత్రం విడుదల చేస్తారా అని గుడివాడ అమర్నాథ్‌ను ప్రశ్నించారు. పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఇప్పటి వరకూ చేసిన బృహత్ కార్యాలేంటో.. ప్రజలకు సూటిగా చెప్పగలరా అంటూ మంత్రి రోజాను నిలదీశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.