ETV Bharat / state

తీర్పు వెలువరించే వరకు.. ఉద్యోగులపై చర్యలు వద్దన్న హైకోర్టు

author img

By

Published : Jan 31, 2023, 12:30 PM IST

Updated : Jan 31, 2023, 7:15 PM IST

hc
hc

12:26 January 31

మేము అనుచిత వ్యాఖ్యలు చేయలేదు: ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు

హైకోర్టు తీర్పుపై స్పందించిన ఉద్యోగ సంఘం నాయకులు

HC ON GOVT EMPLOYEES PETITION: షోకాజ్‌ నోటీసుల ఆధారంగా ఉద్యోగులపై చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జీతాల విషయంలో గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చిన ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. దీనిపై ఉద్యోగుల సంఘం నేత సూర్య నారాయణ హైకోర్టులో పిటిషన్‌పై దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది. తీర్పు వెలువరించే వరకు ఉద్యోగులపై చర్యలొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అనుచిత వ్యాఖ్యలు చేయలేదు: మేము ఎక్కడా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఉద్యోగుల సంఘం నేత సూర్య నారాయణ తెలిపారు.గవర్నర్‌కు వినతిపత్రం అందించిన వ్యవహారంలో తాము ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు. ఆర్థిక ప్రయోజనాల విషయంలో గవర్నర్‌ను కలవడం తప్పు కాదన్న ఆయన.. ప్రభుత్వం నోటీసులు ఎలా ఇచ్చిందో తెలియట్లేదని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వాన్ని మరో వారం రోజుల సమయం కావాలని కోరామని.. పొడిగింపుపై నిర్ణయాన్ని ప్రభుత్వం ఇంకా తెలపలేదన్నారు. తాము ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని.. నిబంధనలకు లోబడే పని చేసినట్లు అభిప్రాయపడుతున్నామని తెలిపారు.

ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం స్పందించాలని సూర్యనారాయణ కోరారు. చెల్లింపుల విషయంలో ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించాలన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఐక్య ఉద్యమాలకు అంతా కలిసి రావాలన్నారు. ఫిబ్రవరి 2న పెండింగ్ బిల్లులు.. చట్టబద్ధతపై సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సీఎఫ్ఎంఎస్ వద్ద రూ.12 వేల కోట్ల మేర ఉద్యోగుల బకాయిలున్నాయని.. అధికారులను వివరాలు అడిగినా చెప్పట్లేదని సూర్యనారాయణ తెలిపారు.

"ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసే అధికారం గవర్నర్​కు మాత్రమే ఉంది కాబట్టి ఆయనను కలిసాం. మేము ఎక్కడా అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ఆ సమావేశంలోని అంశాలను మాత్రమే మేము పత్రికలకు తెలియజేశాం. కానీ మేం ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదు". - సూర్యనారాయణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు

ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది: సకాలంలో జీతభత్యాలు ఇవ్వకుండా మోసగిస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ఎపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల ప్రభుత్వం పక్షపాతం చూపిస్తోందని ఆక్షేపించారు. తాడేపల్లిలో నిర్వహించిన ఆర్టీసీ ఎన్​ఎంయూ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఒకటో తేదీ జీతాలు వచ్చి సంవత్సరాలు అయిపోందన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెలాఖరుకు డిమాండ్లు పరిష్కరించకుంటే పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.

"మేము ఆల్రెడీ వాతలు పెట్టించుకుంటున్నాం. అయిదు డీఏలు లేవు.. ఇంకా రెండు డీఏలు ఇవ్వాల్సి ఉంది. ముఖ్యమంత్రి గారిని కలసి సంక్రాతికి అయినా ఒక డీఏ ఇవ్వాలని కోరాం. ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. కానీ అవి కూడా ఇప్పటి వరకూ పడలేదు. తరువాత మరోసారి అడిగితే.. ఏప్రిల్​లో ఇస్తాం అంటున్నారు.. కానీ ఏ ఏప్రిల్ అనేది చెప్పడం లేదు". -బండి శ్రీనివాస్, ఎపీఎన్జీవో అధ్యక్షుడు

ఇవీ చదవండి:

Last Updated : Jan 31, 2023, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.