ETV Bharat / state

ఆర్‌-5 జోన్‌ పిటిషన్​పై హైకోర్టులో విచారణ.. పెండింగ్‌ పిటిషన్‌తో జత చేసేవిధంగా చర్యలు

author img

By

Published : Apr 4, 2023, 9:06 AM IST

HC ON AMARAVATI R5 ZONE PETITION: అమరావతి భూములను రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లకు భూబదలాయింపు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టులో అత్యవసర వ్యాజ్యాలు దాఖలయ్యాయి. రాజధాని ప్రాంత రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారించిన ధర్మాసనం.. నేడు విచారణకు వచ్చేలా నిర్ణయం తీసుకునేందుకు ఫైలును ప్రధాన న్యాయమూర్తి వద్ద ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

HC ON AMARAVATI R5 ZONE PETITION
HC ON AMARAVATI R5 ZONE PETITION

HC ON AMARAVATI R5 ZONE PETITION: రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతిలో 11 వందల34 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేలా గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లకు భూబదలాయిపునకు సీఆర్డీఏ కమిషనర్‌కు అనుమతిస్తూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి మార్చి 31న జీవో 45 జారీ చేశారు. ఆ జీవోపై రైతులు అత్యవసరంగా వ్యాజ్యాలు వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపారు. రాజధానిలో ఇళ్లస్థలాల వ్యవహారం త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుత వ్యాజ్యాలు అక్కడే విచారణ జరపడం ఉత్తమం అని అభిప్రాయపడ్డారు. పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని రైతుల తరపు న్యాయవాదులు కోరుతున్నందున.. మంగళవారం విచారణకు వచ్చేలా నిర్ణయం తీసుకునేందుకు ఫైలును ప్రధాన న్యాయమూర్తి వద్ద ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

లబ్ధిదారులను గుర్తించి ఇళ్లస్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం హడావిడిగా అడుగులు వేస్తోందన్న పిటిషనర్ల తరపున న్యాయవాదులు.. సీఆర్డీఏ బృహత్‌ ప్రణాళికకు విరుద్ధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందన్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం ఉల్లంఘిస్తోందన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలు, తాడేపల్లి, దుగ్గిరాల, మంగళగిరి, పెదకాకాని మండలాల పరిధిలో ప్రజలకు నవరత్నాలు పేదలందరికి ఇళ్లు పథకం పేరుతో రాజధాని కోసం సమీకరించిన 12 వందల51 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో జీవో 107 జారీ చేసిందని వివరించారు.

ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు ఆ జీవోను సస్పెండ్ చేసిందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా అమరావతి బృహత్తర ప్రణాళికలో సవరణ చేసిందన్నారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మాస్టర్ ప్లాన్ మార్చడానికి వీల్లేదని, రాజధాని కోసం సమీకరించిన భూములను అన్యాక్రాంతం చేయవద్దని తుది తీర్పు ఇచ్చిందన్నారు. ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. హైకోర్టు ఇచ్చిన తుది తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ స్టే ఇవ్వలేదన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం తాజాగా జారీచేసిన జీవోపై స్టే ఇవ్వాలని కోరారు.

ప్రస్తుత జీవో జారీకి ముందు జరిగిన ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ పెండింగ్​లో ఉందని ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ప్రస్తుత వ్యాజ్యాలను అక్కడికే పంపాలన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రాజధానిలో ఇళ్లస్థలాల వ్యవహారంపై గతంలో త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపిన రీత్యా.. ప్రస్తుత వ్యాజ్యాలు అక్కడే విచారణ జరగడం ఉత్తమం అని అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.