ETV Bharat / state

అన్నం తిని పడేసిన ప్లేట్లే పట్టించాయి..

author img

By

Published : Dec 20, 2021, 8:44 AM IST

Updated : Dec 20, 2021, 9:37 AM IST

భోజనం చేసి పడేసిన ప్లేట్లు, సెల్​ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నేరస్థులను పట్టుకున్నారు పోలీసులు. పగలు కూలీ పనులు చేస్తూ... ఆర్ధరాత్రుళ్లు దారిదోపిడీలకు పాల్పడుతున్న వారు పాత నేరస్థులేనని పోలీసులు తెలిపారు.

guntur-police-arrested-robbers
అన్నం తిని పడేసిన ప్లేట్ల ఆధారంగా నిందితుల గుర్తింపు

అన్నం తిని పడేసిన ప్లేట్ల ఆధారంగా నిందితుల గుర్తింపు

నేరాలకు పాల్పడిన నిందితులను వారు భోజనం చేసి పడేసిన ప్లేట్లే పట్టించాయి. అసలు నేరానికి.. భోజనం ప్లేట్లకు సంబంధం ఏముందనుకుంటున్నారా...? వాటితోనే గుంటూరు జిల్లాలో కొన్ని కేసులను చేధిస్తున్నారు పోలీసులు. పగలు పొలం పనులు, రాత్రిళ్లు అఘాయిత్యాలకు పాల్పడుతున్న కర్నూలు నేరగాళ్లను పోలీసులు ఈవిధంగానే పట్టుకున్నారు. మేడికొండూరు సామూహిక అత్యాచారం వీరి పనేనని ప్రాథమికంగా తేల్చారు.

గుంటూరు రూరల్‌ జిల్లా పోలీసుల పరిధిలో ఇటీవల యడ్లపాడు, ఫిరంగిపురం మండలాల్లో వరుస దారిదోపిడీలు జరిగాయి. ఇవి పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఘటనా ప్రదేశాల్లో నిఘా కెమెరాలు లేకపోయినా నిందితులను పట్టుకోవటానికి పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. దర్యాప్తులో భాగంగా యడ్లపాడు మండలం కొండవీడు కొండ దిగువన ఓ పొలంలో భోజనం తిన్న ప్లేట్లు కనిపించాయి. వాటిపై వేలిముద్రలు తీస్తే అవి పాత నేరస్థులివిగా తేలాయి. నిందితులెవరో ఒక అంచనాకు వచ్చిన పోలీసులు వారిని పట్టుకోవటానికి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నేరుగా నిందితులకు ఫోన్లు చేసి ఎక్కడ ఉన్నారో గుర్తించే ప్రయత్నం చేస్తే వారు తప్పించుకుపోతారని భావించి వారి ఫోన్లకు కాల్స్‌ చేయలేదు. నేరం జరిగిన ముందు, తర్వాత రోజు ఆ ప్రాంతాల్లోని టవర్లకు 2 వేల 263 కాల్స్‌ రాగా... వాటిని విశ్లేషించి ఒక నిందితుడిని ట్రేస్‌ చేశారు. ఆ ఫోన్‌ నుంచే ఇతర నిందితులకు కాల్స్‌ వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. నేరాలకు పాల్పడిన తర్వాత కూడా నిందితుల ఫోన్ల సిగ్నళ్లు యడ్లపాడు, ఫిరంగిపురం మండలాల్లోనే వస్తున్నాయి. కానీ పోలీసులకు కనిపించటం లేదు.

ఆ ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నారో గుర్తించి పట్టుకోవటానికి గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆ ప్రాంతాల్లో ఎలాంటి హడావుడి లేకుండా పోలీసులను మఫ్టీలో తిప్పుతూ టవర్‌ లొకేషన్‌ తీసుకున్నారు. ఫిరంగిపురం మండలంలోని ఓ పొలంలో కీలక నిందితుడు ఉన్నట్లు అతని ఫోన్‌ సిగ్నల్‌ చూపింది. ఈ క్రమంలో నలుగురు నిందితులు పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. మరో ఇద్దరు పరారయ్యారు.లోతైన దర్యాప్తు చేపట్టగా దారి దోపిడీలతో పాటు ఈ ఏడాది సెప్టెంబరు 8న మేడికొండూరు పోలీసు స్టేషన్‌ పరిధిలో పాలడుగు వద్ద ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడింది వీరేనని ప్రాథమికంగా ధ్రువీకరించారు.

నిందితులు కర్నూలు జిల్లా ప్రాణ్యానికి చెందినవారిగా పోలీసులు నిర్ధరించారు. వీరిపై కర్నూలు, ప్రాణ్యం స్టేషన్లలో అనేక కేసులు ఉన్నాయి. పట్టుబడిన నిందితుల్లో ఒకరు శిక్ష అనుభవిస్తూ పరారై వచ్చినట్లు సమాచారం. జిల్లాలో మిరప కోతలు, ఇతర వ్యవసాయ పనుల కోసం భార్య, పిల్లలతో వచ్చి వీరు ఈ దారుణాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:

Gay marriage in Hyderabad: ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు.. సమంత విషెస్ చెప్పింది!

Last Updated :Dec 20, 2021, 9:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.