ETV Bharat / state

GMC: విలువ ఆధారంగా ఆస్తి పన్ను..నగర పాలక సంస్థ ఆమోదం

author img

By

Published : Aug 2, 2021, 5:05 PM IST

విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంచుతూ గుంటూరు నగరపాలక సంస్థ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రజలపై భారం పెంచే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కాగా..ఆస్తి పన్ను పెంపు ప్రభావం కొంతమందిపై మాత్రమే ఉంటుందని..నగర పరిధిలోని 39 వేల మందికి గతంలో కంటే పన్ను తగ్గుతుందని అధికార పక్షం అభిప్రాయపడింది.

guntur municipal corporation  passed the Property tax  bill
విలువ ఆధారంగా ఆస్తి పన్ను..నగర పాలక సంస్థ ఆమోదం

విపక్ష సభ్యుల ఆందోళనల నడుమ విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంచుతూ గుంటూరు నగరపాలక సంస్థ తీర్మానాన్ని ఆమోదించింది. ఆస్తి పన్ను పెంపుపై నగరపాలక సంస్థ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైంది. ప్రజలపై భారం పెంచే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని విపక్షాలు తెదేపా, జనసేన కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. అయితే ఆస్తి పన్ను పెంపు ప్రభావం కొంతమందిపై మాత్రమే ఉంటుందని..నగర పరిధిలోని 39 వేల మందికి గతంలో కంటే పన్ను తగ్గుతుందని అధికార పక్షం అభిప్రాయపడింది. విపక్ష సభ్యుల నిరసనల మధ్య ఆస్తి పన్ను పెంపు తీర్మానాన్ని నగరపాలక సంస్థ ఆమోదించింది.

కొత్త పన్ను విధానం వల్ల ప్రజలపై ఎక్కువ భారం పడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు మేయర్ కావటి మనోహర్ నాయుడు స్పష్టం చేశారు. నగరాభివృద్ధి కోసమే విలువ ఆధారిత పన్ను నిర్ణయం తీసుకున్నామన్నారు.

తెదేపా కౌన్సిలర్ల నిరసన

పాలకపక్ష వైఖరిని తప్పుబడుతూ తెదేపా కార్పొరేటర్లు కౌన్సిల్ హాలులో ఆందోళనకు దిగారు. కౌన్సిల్​ హాలులో నేలపై కూర్చొని తీర్మానానికి వ్యతరేకంగా నిరసన తెలిపారు. విలువ ఆధారిత ఆస్తి పన్నును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పన్నుల పెంపుపై సరైన చర్చ లేకుండానే ఆమోదం తెలపడాన్ని తెదేపాపక్ష నాయకుడు రవీంద్ర తప్పుబట్టారు. ప్రభుత్వం ఇష్టారీతిన పన్నులు పెంచుతూ ప్రజలపై భారం మోపుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కౌన్సిల్​​లో బలం ఉందని నచ్చినట్లుగా తీర్మానాన్ని ఆమోదించుకున్నారని ఆక్షేపించారు. ఆస్తిపన్నుపై అవగాహన సమావేశం ఏర్పాటు చేసి.. దొడ్డిదారిన తీర్మానాన్ని ఆమోదించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ ఆస్తిపన్నును తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రజా సంఘాల ఆందోళనలు

కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందు ప్రజాసంఘాలు, విపక్ష పార్టీల నేతలు గుంటూరు నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. నిత్యావసర ధరలు, పన్నుల పెంపుతో ప్రభుత్వం ప్రజల నడ్డివిరుస్తోందని ఆక్షేపించారు. కొవిడ్ కష్టకాలంలో పన్ను పెంపు నిర్ణయమేంటని ప్రశ్నించారు. ప్రజలు ఒకపక్క ఉపాధి లేక అల్లాడుతుంటే..ప్రభుత్వం పన్నుల పెంపుతో అదనపు భారం మోపుతోందని మండిపడ్డారు. పన్నుల పెంపు నిర్ణయంతో ప్రజలు ఆర్థికంగా చితికిపోతారని ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు పెంచుతూ పేద ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. విలువ ఆధారిత ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి

LOK SABHA: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచన లేదు: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.