ETV Bharat / state

చేపల చెరువు వేలం పంచాయితీ.. హైకోర్టులో పిల్

author img

By

Published : Jul 13, 2020, 8:57 PM IST

fish pond biding turns to violent at kovelamudi guntur district
వేలం పాట పంచాయితీ

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కోవెలమూడిలో చేపల చెరువు వేలం వైకాపా నేతల ఒత్తిడితో రెండోసారి నిర్వహించారు. మొదటిసారి పాటలో పాల్గొనలేకపోయిన వైకాపాకు చెందిన వర్గం వారు ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో దేవాదాయశాఖ అధికారులు రెండోసారి వేలం పాట నిర్వహించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గత పాటదారుడు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కోవెలమూడిలో చేపల చెరువు వేలం పాట ఉద్రిక్తతకు దారితీసింది. ఒకసారి జరిపిన వేలం పాట రాజకీయ ఒత్తిళ్లతో రెండోసారి నిర్వహించారు. కోవెలమూడిలో 15 ఎకరాల చెరువుకు దేవాదాయశాఖ అధికారులు ఈనెల 3న వేలం నిర్వహించారు. ఆ పాటలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి 35 వేలకు చేపలు పట్టేందుకు హక్కు పొందాడు. ఆ సమయంలోనే వైకాపాలో అంతర్గత పోరు వలన.. ఒక వర్గం వారు పాట ప్రారంభమైన కొంత సమయం తర్వాత వచ్చారు. తాము పాటలో పాల్గొంటామని ఈవోతో మాట్లాడారు. అందుకు అధికారులు ఒప్పుకోలేదు. పాట ప్రారంభమైన తర్వాత మధ్యలో ఎవరిని చేర్చుకునే పరిస్థితి ఉండదని చెప్పారు.

అసలు కథ అక్కడే మొదలైంది. పాటలో పాల్గొనలేకపోయిన వైకాపాకు చెందిన వర్గం వారు ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ఇచ్చారు. దీంతో దేవాదాయశాఖ అధికారులు గత పాటను రద్దు చేస్తూ... తిరిగి పాట మొదలుపెట్టారు. తమకు కనీసం విషయం చెప్పకుండా... నోటీసులు ఇవ్వకుండా పాట రద్దు చేసి తిరిగి ఏర్పాటు చేయడం ఏమిటని గత పాటదారుడు సుబ్రహ్మణ్యం దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ సమయంలో వైకాపా వారు సుబ్రహ్మణ్యం దంపతులపై వాదనకు దిగారు. వేలంలో నెగ్గినా కూడా కావాలనే తమ పాట రద్దు చేశారని పాటదారుడు సుబ్రహ్మణ్యం ఆరోపించాడు. ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. వేలం పాట వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. గత వేలం పాట రద్దు విషయంపై సుబ్రహ్మణ్యం హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు. వైకాపాకు చెందిన ఒక వర్గం వారు రెండోసారి పాట నెగ్గించుకున్నారు.

ఇదీ చదవండి: కరోనాపై పోరు: 2021 నాటికైనా వ్యాక్సిన్‌ వచ్చేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.