Damaged Roads in Guntur: "గుంటూరు గుంతల లోతు తెలియడం లేదు.. దేవుడిపైనే భారం వేశాం!"
Published: Sep 7, 2023, 9:14 AM


Damaged Roads in Guntur: "గుంటూరు గుంతల లోతు తెలియడం లేదు.. దేవుడిపైనే భారం వేశాం!"
Published: Sep 7, 2023, 9:14 AM

Damaged Roads in Guntur: గుంటూరు పేరును గుంతలూరుగా మార్చాలని నగర శివారు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారిలో అక్కడకక్కడ గుంతలు ఉండటం సహజమని కానీ గుంతల మధ్య రహదారిని వెతుక్కోవాల్సిన దుస్థితి ఉందని వాపోతున్నారు. చినుకుపడితే శివారు కాలనీ రోడ్లు చెరువుల మారి నరకాన్ని తలపిస్తున్నాయంటున్నారు. గజానికో గొయ్యితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Damaged Roads in Guntur : ఆ రోడ్లెక్కితే షెడ్డుకు వెళ్లని ఆటో ఉండదు! నడుము పట్టేయని ప్రయాణికుడు ఉండడు! కుదుపులకు గావు కేక పెట్టని నోరు ఉండదు! ఇదేం నరకం బాబోయ్ అంటూ తిట్టుకోని జనం ఉండరు! అన్నీ తెలిసినా స్పందించిన అధికారి లేడు. నాలుగు సంవత్సరాలుగా అవే గుంతలు అవే కుదుపులు.! ఇవేమీ పల్లె ప్రజల కష్టాలు కాదు! ఘన చరిత్ర ఉన్న గుంటూరు నగర దుస్థితి! రోడ్లైనా వేయాలని, లేదంటే గుంటూరు పేరును గుంతలూరుగానైనా మార్చాలని ప్రజలు నిట్టూరుస్తున్నారు.
Public Facing Problems with Damaged Roads at Guntur : చినుకు పడితే చాలు.. గుంటూరు నగరంలోని అనేక రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. గుంటూరు నగర శివారు కాలనీల రహదారుల పరిస్థితి అయితే అత్యంత దయనీయంగా మారింది. మోకాలి లోతు గుంతలు, బురదమయమైన దారులతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. చిన్నపాటి వర్షాలకే రాకపోకలు సాగించలేనంతగా రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయని, సుద్దపల్లి డొంక, ప్రగతి నగర్, రెడ్డిపాలెం ప్రాంత వాసులు వాపోతున్నారు. ఉద్యోగ, ఉపాధి పనుల నిమిత్తం రోజూ ఈ రోడ్డెక్కేవారి అగచాట్లు.. చెప్తే తీరేలా లేవు.
గుంతల లోతు తెలియడం లేదు : నాలుగైదు ఏళ్లుగా ఎలాంటి రహదారి నిర్మాణాలు చేపట్టలేదని, గుంతలు పడిన ప్రతిసారి కంకర, మట్టి పోసి సరిపెట్టడం మినహా శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ రహదారులు ఇలాగే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు తరచుగా కిందపడిపోతున్నారని, మహిళలు, వృద్ధులు, పిల్లలు గాయపడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు. ఇక వర్షం పడితే ఇది రోడ్డో, చెరువో కనిపెట్టడం కష్టమని, అసలు తాము గుంటూరులోనే ఉన్నామా? అని సందేహించాల్సిందని వారు తెలిపారు. అసలు గుంతల లోతెంతో తెలియక అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు వాపోయారు.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని ప్రయాణాలు : అత్యవసర సమయాల్లో దేవుడిపై భారం వేయాల్సి వస్తోందని గుంటూరు శివారు కాలనీల ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు. వర్షాకాలం పొడవునా బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తుమని వారంతో వాపోయారు.
Motorists Facing Problems with Worst Roads : ఈ గతుకుల రహదార్లపై వెళ్లే వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని ఆటోవాళ్లు, వాహనదారులు వాపోతున్నారు. కొన్నిసార్లు గుంతల్లో వాహనం ఇరుక్కుని.. దెబ్బతిన్న పరిస్థితులున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతల ధాటికి కొన్నిసార్లు టైర్లు కూడా నేలకు ఆనడం లేదని ఆటో వాలాలు వాపోతున్నారు. ఏటా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చే 10 వేల రూపాయలు ఒక్కసారి షెడ్డుకు వెళ్తే రిపేర్లకు చాలడం లేదని ఆక్రోశిస్తున్నారు.
వాహనదారుల అరణ్య రోదన : ఎవరైనా నాయకుల పర్యటనలున్నప్పుడు కంకర, మట్టితో గుంతల్ని కప్పేసి కాలం నెట్టుకొస్తున్నారనీ, అధికారులు కొత్తగా రోడ్డు వేయడం లేదని వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. జగనన్నకు చెప్పుకున్నా.. అరణ్య రోదనగానే మిగిలిందని వాహనదారులు మండిపడుతున్నారు. వర్షాకాలం మూడు నెలలు ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తున్నామని, ప్రభుత్వం సమస్యను పరిష్కారించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.
