ETV Bharat / state

'పారదర్శకంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చర్యలు'

author img

By

Published : Jan 30, 2021, 10:16 AM IST

Collector's direction to officers
అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం

గ్రామ పంచాయితీ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టినట్లు గుంటూరు కలెక్టర్ దినేశ్​ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ లోని శంకరన్ హాల్లో నోడల్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతోందని ఆయన తెలిపారు.

గుంటూరు జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతోందని కలెక్టర్ దినేశ్​ కుమార్ తెలిపారు. మొదటి దశలో పంచాయతీ ఎన్నికలు జరిగే తెనాలి రెవిన్యూ డివిజన్లో ఆయన పర్యటించారు. తెనాలి ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల అధికారులతో సమావేశమయ్యారు. నామినేషన్ల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలింగ్ కేంద్రాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పోటీ చేసే అభ్యర్థులు, ప్రజలకు గానీ ఏవైనా ఎన్నికల సంబంధిత సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎన్నికల పర్యవేక్షణకు, ఫిర్యాదుల స్వీకరణకు రెండు ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం అధికారులు విధులు నిర్వహించాలని కలెక్టర్ దినేశ్​ కుమార్ సూచించారు. గ్రామ పంచాయితీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి సిబ్బందికి శిక్షణ, పని విభజన, రవాణా ఏర్పాట్లు, మౌలిక వసతులు, ఎన్నికల సామాగ్రి చేరవేత, కాల్ సెంటర్ నిర్వహణపై అధికారులతో చర్చించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పెట్టే ఖర్చులపై నిఘా ఉంచాలన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడొద్దని పోలీసు అధికారులకు సూచించారు. 1,950 ఓటర్ సహాయ బృందాలు, బ్యాలెట్​, పోస్టల్ బ్యాలెట్, మీడియా, ఓటర్ హెల్ప్​లైన్​ యాప్, వీడియోగ్రఫీ, వెబ్ కాస్టింగ్, పోలింగ్ స్టేషన్స్, కరోనా సంబంధిత అంశాలపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్యాలెట్ బాక్సుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. అదనపు బాక్సులు కూడా సిద్ధం చేసుకోవాలని సూచించారు.

ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం:

చేబ్రోలు మండలంలో పోలింగ్ కేంద్రాలపై పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తున్నట్లు తెనాలి డీఎస్పీ ప్రశాంతి అన్నారు. తొలి దశ ఎన్నికలు చేబ్రోలు మండలం పరిధిలో ఉన్నాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద, అర్బన్ జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే మండల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ:

జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. తొలిరోజు అభ్యర్థులు మందకొడిగా నామినేషన్లు దాఖలు చేశారు. ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు తీసుకుని వెళ్లారు. నామినేషన్​ పత్రాలు పూర్తి వివరాలతో పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడంతో మొదటిరోజు ఎక్కువమంది నామినేషన్లు దాఖలు చేయలేదు. మరోవైపు కొన్ని కీలకమైన పంచాయతీల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కిరాకపోకవడం కూడా నామినేషన్లు తక్కువగా నమోదుకావడానికి కారణమని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

తెనాలి డివిజన్‌లో 337 పంచాయతీలకు గాను 129 మంది అభ్యర్థులు, వార్డు స్థానాలు 3,442 ఉండగా 219 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆదివారం సాయంత్రంతో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ముగియనుంది. దీంతోపాటు ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులు పోటీచేసే చోట బుజ్జగింపులు, బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఏకగ్రీవాలు చేయాలన్న లక్ష్యంతో అధికారపార్టీ సానుభూతిపరులు వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నారు. కొన్నిచోట్ల ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల ఎంపికను దృష్టిలో ఉంచుకుని స్థానికంగా బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపడానికి చర్చలు జరుపుతున్నారు.

గ్రామాభివృద్ధికి నిధులు వెచ్చిస్తామంటూ కొందరు అభ్యర్థులు ముందుకురావడంతో ఎవరు ఎక్కువ మొత్తం సమకూరుస్తారో అన్న సందిగ్ధత నడుమ కొన్ని గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. చెరుకుపల్లి మండలం రాంబొట్లవారిపాలెం గ్రామంలో అధికారపార్టీ నేతలు నామినేషన్‌ వేయనివ్వకుండా దాడి చేసి బెదిరిస్తున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మొత్తంమీద జిల్లాలో తొలివిడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది.

నామినేషన్ పత్రాలు ఇవ్వలేదని ఫిర్యాదు..

పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిపేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. చెరుకుపల్లి మండలం రాంబోట్ల పాలెం గ్రామానికి చెందిన అక్కల నాగమణి ఎస్పీ విశాల్ గున్నీని కలిశారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పంచాయతీ సెక్రటరీ నామినేషన్ పత్రాలు ఇవ్వలేదని, పోలీసులకు చెప్పినా పట్టించుకోకుండా తనపైనే తప్పుడు కేసులు బనాయించారని ఫిర్యాదు చేశారు.

బాధితురాలి అభ్యర్ధనను ఎస్పీ స్వీకరించారు. ఈ విషయంపై బాపట్ల డీఎస్పీ, రేపల్లె గ్రామీణ సీఐతో విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. అలాగే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని.. పోలీసులు వారికి పూర్తి స్థాయిలో అండగా ఉంటారని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

పంచాయతీ పోరు: తొలిరోజు 1,315 నామినేషన్లు దాఖలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.