ETV Bharat / state

నేడు సుప్రీంకోర్టులో అమరావతిపై విచారణ.. తీర్పుపై ఉత్కంఠ

author img

By

Published : Oct 31, 2022, 9:23 PM IST

Updated : Nov 1, 2022, 1:31 PM IST

FARMERS ON PADAYATRA
FARMERS ON PADAYATRA

FARMERS ON PADAYATRA : పాదయాత్ర విషయంలో ఎలా ముందుకెళ్లాలి? ఆర్‌ 5 జోన్‌ విషయంలో ఏ తరహా పోరాటం చేయాలి? అమరావతి కేసులు సుప్రీంకోర్టులో విచారణకు రానున్న తరుణంలో వాదనలు ఎలా ఉండాలి? ఇప్పుడు రాజధాని రైతుల ఆలోచనలు వీటిచుట్టూనే తిరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో పోరాటం, అరసవెల్లి పాదయాత్రను పున ప్రారంభించటం, కేసులపై న్యాయనిపుణులతో సంప్రదింపులు.. ఇలా మూడింటికి సమ ప్రాధాన్యత ఇచ్చేలా రైతులు పని విభజన చేసుకుని ముందుకెళ్తున్నారు.

AMARAVATI FARMERS PLANS ON PADAYATRA : పోలీసుల ఆంక్షలు, అధికార పార్టీ నేతల అడ్డంకుల కారణంగా అమరావతి రైతులు.. తమ అరసవల్లి పాదయాత్రను తూర్పుగోదావరి జిల్లాలో ఆపేశారు. ఆంక్షలు, అడ్డంకుల విషయం కోర్టులో తేల్చుకున్న తర్వాత మళ్లీ పాదయాత్ర ప్రారంభించేందుకు వారు సిద్ధమవుతున్నారు. పాదయాత్రకు మరీ ఎక్కువ రోజులు విరామం ఇవ్వటం కూడా అంత మంచిది కాదన్న అభిప్రాయం ఐకాసలో ఉంది. ప్రస్తుతం హైకోర్టు తీర్పు రిజర్వులో ఉన్న కారణంగా అందుకోసం రైతులు వేచిచూస్తున్నారు.కేవలం కోర్టు ఆదేశాల కోసం మాత్రమే విరామమిచ్చామని.. తీర్పు ఎలా ఉన్నా పాదయాత్ర మళ్లీ ప్రారంభిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు.

అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా....నవంబర్‌ 1న విచారణ జరగనుంది. ఇప్పుడు రాజధాని రైతులు ఈ విషయంపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సుప్రీంకోర్టు బెంచ్‌ ఏం చెబుతుందనేది రైతులకు కీలకం కానుంది. రాజధాని ఐకాస, అమరావతి పరిరక్షణ సమితి న్యాయవిభాగాలు ఇప్పుడు ఈ విషయంపై దృష్టి సారించాయి. కోర్టుల వ్యవహారాల తర్వాత పాదయాత్రపై నిర్ణయం తీసుకుంటారు. నవంబర్‌ 3లేదా 4 తేదీల్లో పాదయాత్ర ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో ప్రభుత్వం CRDA చట్టాన్ని సవరించి ఆర్‌ 5 జోన్‌ ఏర్పాటు చేసింది. దీనిపైనా రైతులు పోరాటానికి సిద్ధమయ్యారు. రైతుల అభ్యంతరాలు తెలియజేసేందుకు నవంబర్‌ 11వరకూ ప్రభుత్వం గడువిచ్చినందున ఆయా గ్రామాల్లోని అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నారు. ప్రస్తుతం రాజధాని గ్రామాల్లో స్థానిక ప్రభుత్వాలు లేనందున గ్రామసభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలు సేకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో అమరావతి బృహత్‌ ప్రణాళికను విచ్ఛిన్నం చేస్తున్నారనేది ప్రధానంగా రైతుల ఆభ్యంతరం. దీనిపై గ్రామసభల్లో తమ వాణి బలంగా వినిపించాలని భావిస్తున్నారు. గతంలో అమరావతి కార్పొరేషన్‌, అమరావతి మున్సిపాలిటి ఏర్పాటు కోసం నిర్వహించిన గ్రామసభల్లో అన్నిచోట్లా ప్రభుత్వ ప్రతిపాదన వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఇప్పుడూ అదే తరహాలో ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి రైతులు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో పాదయాత్ర ప్రారంభించాల్సి వచ్చినా గ్రామసభలకు ఇబ్బంది లేకుండా పని విభజన చేసుకుని ముందుకెళ్లాలని భావిస్తున్నారు.

మూడేళ్లుగా జరుగుతున్న రాజధాని ఉద్యమంలో ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదేనని రైతులు భావిస్తున్నారు. అందుకే అన్ని అంశాలు బేరీజు వేసుకుని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పాలకపక్షం నుంచి వచ్చే విమర్శలు, వెక్కిరింపుల్ని సంయమనంతోనే ఎదుర్కుని పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేస్తున్నారు.

రేపు సుప్రీంకోర్టులో అమరావతి పాదయాత్రపై విచారణ.. తీర్పుపై ఉత్కంఠ

ఇవీ చదవండి:

Last Updated :Nov 1, 2022, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.