ETV Bharat / state

AP Passengers in Train Accident:'141 మంది ఏపీ ప్రయాణికుల ఫోన్లు పనిచేయడం లేదు.. ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాం'

author img

By

Published : Jun 4, 2023, 9:17 AM IST

Odisha Train Accident
ఒడిశా రైలు ప్రమాదం

Andhra Pradesh Passengers in Odisha Train Accident: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో.. రెండు రైళ్లలో ప్రయాణించిన వారి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కోరమాండల్‌, యశ్వంతపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ల్లో కలిపి 141 మంది ప్రయాణికుల ఫోన్లు పనిచేయడంలేదని తెలిపింది. ప్రమాదానికి గురైన రైళ్లలో రాష్ట్రానికి చెందినవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వీరిలో ఎంతమంది సురక్షితంగా ఉన్నారన్న విషయంపై శనివారం రాత్రి వరకూ సమాచారం లేదు.

Andhra Pradesh Passengers in Odisha Train Accident: ఒడిశాలో ప్రమాదానికి గురైన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఏపీకి చెందిన 482 మంది ప్రయాణించారని.. వారిలో 267 మంది క్షేమంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మరో 20 మందికి తేలికపాటి గాయాలైనట్లు తెలిపింది. యశ్వంత్‌పూర్‌ రైల్లో రాష్ట్రానికి చెందిన 89 మంది ప్రయాణికులు టికెట్లు కొన్నారని.. వీరిలో 49 మంది సురక్షితంగా ఉన్నారని, మరో 28 మంది వివరాలు తేలాల్సి ఉందని వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్​కి చెందిన ఒక ప్రయాణికుడు మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారిలో కొంతమంది మెరుగైన వైద్యం కోసం వివిధ ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించింది. కోరమాండల్‌, యశ్వంతపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ల్లో కలిపి 141 మంది ప్రయాణికుల ఫోన్లు పనిచేయడం లేదని తెలిపింది. దీంతో మరికొంత మంది తెలుగు ప్రయాణికులు అసలు ఏమయ్యారో, ఎక్కడున్నారో అనే అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Odisha Train Accident : 'ఘోర'మాండల్​ రైలు దుర్ఘటన.. ఏ క్షణంలో ఏం జరిగిందంటే?

రాష్ట్ర ప్రభుత్వ చర్యలు: కోరమాండల్‌ రైలు దుర్ఘటనలో చిక్కుకున్న రాష్ట్ర ప్రయాణికులకు అవసరమైన సహాయక చర్యలను ముమ్మరంగా చేపడుతున్నామని.. ప్రభుత్వం తెలిపింది. ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశారని మంత్రి బొత్స తెలిపారు. మంత్రి అమర్‌నాథ్‌ ఆధ్వర్యంలో ఐఏఎస్‌ అధికారుల బృందాన్ని ఒడిశాకు పంపామన్నారు. 50 అంబులెన్సులు, వైద్య పరికరాలు, మందులు, వైద్యులతో కూడిన బృందాలు, 15 మహాప్రస్థానం వాహనాలను ప్రమాద స్థలికి తరలించామన్నారు. అత్యవసర సమయంలో తరలించేందుకు విశాఖలో ఒక హెలికాప్టర్‌ను కూడా సిద్ధంగా ఉంచామన్నారు.

బాధితులతో మాట్లాడిన మంత్రి గుడివాడ అమర్నాథ్: ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. బాలాసోర్​లోని ఎస్​ఎమ్​ఎమ్​సీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్​ వాసులను మంత్రి గుడివాడ అమర్నాథ్ శనివారం రాత్రి పరామర్శించారు. విశాఖ నుంచి బాలాసోర్ రోడ్డు మార్గంలో చేరుకున్న ఆయన నేరుగా ఆస్పత్రికి వెళ్లి బాధితులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్​కి చెందిన 11 మంది క్షతగాత్రులను గుర్తించామని మంత్రి అమర్నాథ్ చెప్పారు.

Telugu Passengers భూమి కంపించినట్లైంది.. తలచుకుంటేనే వణుకుపుడుతోంది.. తెలుగు ప్రయాణికుల అనుభవాలు

జీవనోపాధి కోసం వెళ్లి..: బతుకుదెరువు కోసం చాలా సంవత్సరాల క్రితమే ఒడిశాలోని బాలేశ్వర్‌కు వెళ్లి వలలు అల్లుకుంటూ, చేపలు పడుతూ జీవనోపాధి పొందుతున్న శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం జగన్నాథపురానికి చెందిన చోడిపల్లి గురుమూర్తి రైలు ప్రమాదంలో మృతి చెందారు. గురుమూర్తి ఏపీ ప్రభుత్వ పింఛను కోసం గ్రామానికి వచ్చి ఈ నెల 2వ తేదీన తిరుగు ప్రయాణమయ్యారు. పలాస రైల్వేస్టేషన్లో యశ్వంత్‌పూర్‌- హావ్‌డా రైలు ఎక్కి ప్రమాదంలో మృతిచెందారు. బాలేశ్వర్‌ ఆసుపత్రిలో మృతదేహాన్ని గుర్తించి శనివారం అంత్యక్రియలు చేశారు.

తీవ్ర గాయాలు: సంతబొమ్మాళి మండలం ఎస్బి కొత్తూరు పంచాయతీ ఎం. కొత్తూరు గ్రామానికి చెందిన కారాడ పూజ అనే మహిళ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. తలకు, ఎడమ చేతికి బలమైన గాయాలు కావడంతో బాలషోర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అమ్మఒడి పథకం కోసం వేలిముద్ర వేయడానికి మే 29న సొంతూరు వచ్చిన ఆమె తిరిగి వెళ్తుండగా బోగీల మధ్య ఇరుక్కుపోయింది.

వేగంగా ట్రాక్​ పునరుద్దరణ పనులు.. రాత్రంతా అక్కడే ఉన్న రైల్వే మంత్రి

వివరాలు తెలుసుకున్న ఎంపీ: కోరమాండల్‍ రైలులో తిరుపతి, రాయలసీమ పరిధిలోని ప్రయాణికులు లేరని రైల్వే అధికారులు తెలిపారని ఎంపీ గురుమూర్తి తెలిపారు. దుర్ఘటనకు సంబంధించి తిరుపతి రైల్వే స్టేషన్‍ లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను ఆయన పరిశీలించారు. రైలులో ప్రయాణించిన వారికి ఫోన్‍ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అధిక సంఖ్యలోనే మన రాష్ట్ర ప్రయాణికులు: ప్రమాదానికి గురైన రైళ్లలో రాష్ట్రానికి చెందినవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వీరిలో ఎంతమంది సురక్షితంగా

ఉన్నారన్న విషయంపై శనివారం రాత్రి వరకూ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. ప్రయాణించిన వారిలో చాలామంది ఫోన్లు పని చేయడం లేదు. స్విచ్ఛాఫ్‌లో ఉన్నాయి. కొన్ని రింగవుతున్నా సమాధానం ఇవ్వడం లేదు. కొన్ని బీప్‌ శబ్దం వచ్చి ఆగిపోతున్నాయి. వారంతా ఏమయ్యారు, ఎలా ఉన్నారో అధికారులూ చెప్పలేకపోతున్నారు. మృతులకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలు శనివారం అర్ధరాత్రి వరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌ వెల్లడించలేదు.

లూప్​లైన్​లోకి 'కోరమాండల్'.. అందుకే ప్రమాదం.. ఘటన జరిగిందిలా..

ఫోన్లు పనిచేయడం లేదు: ప్రమాదానికి గురైన రైళ్లలో ఏపీలోని విశాఖ, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, ఇతర ప్రాంతాల నుంచి 571 మంది రిజర్వేషన్‌ చేయించుకోగా.. ఇందులో 141 మంది ఫోన్లు పనిచేయటం లేదని సమాచాదం. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీకి వస్తున్న వారిలో విశాఖపట్నంలో దిగే వారే ఎక్కువగా ఉన్నట్లు రిజర్వేషన్‌ ఛార్టులను బట్టి తెలుస్తోంది.

పరిస్థితిపై ఆందోళన: ఈ రైల్లో ఆంధ్రప్రదేశ్​కు చెందిన ప్రయాణికులు అధికంగా థర్డ్‌ ఏసీ బోగీలైన బీ1, బీ2, బీ4, బీ5, బీ6, బీ8, బీ9ల్లో ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో జనరల్‌ బోగీలతో పాటు బీ1 నుంచి బీ6 వరకు ఉన్న బోగీలు బాగా దెబ్బతిన్నట్లు.. క్షతగాత్రులు చెబుతుండగా అందులో ఉన్న మన రాష్ట్రానికి చెందిన ప్రయాణికుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.

141 మంది ఫోన్లు పనిచేయడం లేదు.. ఏమయ్యారో.. ఎక్కడున్నారో..?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.